Russia Attack On Ukraine: పుతిన్‌దే బాధ్యత.. రష్యాపై అమెరికా ఆగ్రహం

రష్యా చర్యలను నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి, ప్రపంచదేశాలు విజ్ఞప్తి చేసినా కూడా రష్యా మాత్రం పట్టించుకోవట్లేదు. డాన్‌బాస్ ప్రాంతంలోకి కదులుతోంది రష్యా మిలిటరీ.

Russia Attack On Ukraine: పుతిన్‌దే బాధ్యత.. రష్యాపై అమెరికా ఆగ్రహం

Biden

Russia Attack On Ukraine: రష్యా చర్యలను నిలిపివేయాలని ఐక్యరాజ్యసమితి, ప్రపంచదేశాలు విజ్ఞప్తి చేసినా కూడా రష్యా మాత్రం పట్టించుకోవట్లేదు. డాన్‌బాస్ ప్రాంతంలోకి కదులుతోంది రష్యా మిలిటరీ. యుక్రెయిన్‌పై రష్యా చర్యలను తీవ్రంగా ఖండిస్తోంది అమెరికా.

ఈమేరకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఓ ముఖ్యమైన ప్రకటన చేశారు. జరగబోయే పరిణామాలకు పుతిన్‌దే బాధ్యత అంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 24గంటల్లో యుక్రెయిన్‌ని రష్యా ఆక్రమిస్తుంది చెబుతుంది అమెరికా.

అమెరికా, బ్రిటన్​సహా పలు దేశాలు ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించగా.. మరికొన్ని దేశాలు సైతం అదేబాటలో నడుస్తున్నాయి. తాజాగా జపాన్‌ ప్రధాని సైతం రష్యాపై ఆంక్షలు విధించారు. రష్యా ప్రభుత్వ బాండ్ల జారీ, పంపిణీని జపాన్‌లో నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు.

యుక్రెయిన్​లోని రెండు రెబల్​ప్రాంతాలకు సంబంధించిన వారికి వీసాల జారీని సైతం నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఆ ప్రాంతాలతో వాణిజ్యాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. యుక్రెయిన్​ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగిస్తోందని రష్యాపై మండిపడ్డారు.

ఆస్ట్రేలియా కూడా అదే దారిలో నడిచింది. రష్యా భద్రతా మండలికి చెందిన 8 మంది సభ్యుల ప్రయాణాలపై నిషేధంతో పాటు ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో.. రోసియా బ్యాంక్, ప్రోమ్స్​వ్యాజ్​ బ్యాంక్, ఐఎస్​బ్యాంక్, జెన్​బ్యాంక్, బ్లాక్​సీ బ్యాంక్​ఫర్​డెవలప్మెంట్ రీ కన్‌స్ట్రక్షన్లతో ఆస్ట్రేలియా వ్యక్తులు, సంస్థలు.. వ్యాపార లావాదేవీలు జరపలేవని స్పష్టం చేసింది.

అమెరికాపై చైనా కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డింది. యుక్రెయిన్-ర‌ష్యా విష‌యంలో అన‌వ‌స‌రంగా భయాందోళ‌న‌లను వ్యాప్తి చేస్తోంద‌ని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ అభిప్రాయపడ్డారు. ర‌ష్యాపై ఆంక్షలు విధించడాన్ని కూడా తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది చైనా. యుక్రెయిన్‌కు ఆయుధాల‌ను అందిస్తూ అమెరికా మ‌రింత ఉద్రిక్తత‌ల‌ను పెంచిపోషిస్తోంద‌ని చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

యుక్రెయిన్‌పై రష్యా దాడి వార్తల నేపధ్యంలో స్టాక్ మార్కెట్ కుప్పకూలింది, సెన్సెక్స్ 1800 పాయింట్లకు పైగా పడిపోయి 55,500 దిగువకు చేరుకుంది. నిఫ్టీ 500 పాయింట్లు పడిపోయింది.