బ్రేకింగ్ న్యూస్ :చైనాలో అమెరికా పౌరుడు మృతి

  • Published By: madhu ,Published On : February 8, 2020 / 07:23 AM IST
బ్రేకింగ్ న్యూస్ :చైనాలో అమెరికా పౌరుడు మృతి

కరోనా..కరోనా..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఖండాలు దాటుతోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే పలు దేశాలకు ఈ వైరస్ పాకిపోయింది. చైనాలో ప్రధాన నగరంలో ఒకటైన వూహాన్‌లో వందలాది మంది చనిపోగా..వేలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్‌కు ఇప్పటి వరకు ఏ మందు కనిపెట్టలేకపోతున్నారు.

చైనాలో ఉన్న ఇతర దేశాలకు చెందిన వారు భయంతో వణికిపోతున్నారు. తమ వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు ఇతర దేశాల వారు ప్రయత్నాలు ముమ్మరం చేపడుతున్నారు. తాజాగా ఓ అమెరికన్ పౌరుడు ఈ వైరస్ బారిన పడి చనిపోయాడు. 60 సంవత్సరాలున్న ఓ వృద్ధుడు చైనాలో వూహాన్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు నిర్ధారించారు.

ఫిబ్రవరి 06వ తేదీన ఇతను చనిపోయినట్లు బీజింగ్‌లోని అమెరికా రాయబార కార్యాలయం 2020, ఫిబ్రవరి 07వ తేదీ శనివారం వెల్లడించింది. అయితే..ఇతను చనిపోవడానికి కరోనా వైరసే కారణమని వెల్లడించలేమని, తీవ్రమైన న్యూమోనియా వ్యాధితో ఇతను బాధ పడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక చైనా విషయానికి వస్తే..ఈ వైరస్ బారిన పడి..దాదాపు 722 మంది చనిపోయినట్లు అంచనా వేస్తున్నారు. దాదాపు 34 వేల మందికి ఈ వైరస్ సోకినట్లు లెక్కలు చెబుతున్నారు. కరోనా వైరస్ సోకిన విదేశీయుల సంఖ్య 19కి చేరిందని తెలుస్తోంది. మహమ్మారి విజృంభిస్తున్న తీరు తీవ్ర ఆందోళన రేపుతోంది.