గోడ లొల్లి : ట్రంప్ కీలక నిర్ణయం

  • Published By: madhu ,Published On : February 16, 2019 / 01:55 AM IST
గోడ లొల్లి : ట్రంప్ కీలక నిర్ణయం

నేను ఎవరి మాట వినను. ఏది అనుకుంటానో అది ఖచ్చితంగా చేసి తీరుతాను. ఎవరెన్ని చెప్పినా డోంట్‌ కేర్‌ అంటూ దూసుకుపోతున్న అమెరికా అధ్యక్షుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తన కార్యనిర్వాహక అధికారాలతో నిధులు విడుదల చేసి మెక్సికో సరిహద్దు గోడ నిర్మిస్తానంటున్నాడు. 
మెక్సికో సరిహద్దులో గోడ కోసం కాంగ్రెస్‌తో గొడవ పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుకున్నంత పని చేశాడు. అమెరికాలో జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ట్రంప్‌ తన కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా గోడ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసుకోవచ్చు. వలసలు అమెరికా దేశంపై జరుగుతున్న దాడిగా ట్రంప్‌ అభివర్ణించారు. 

2016లో అమెరికా ప్రజలకు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి 5.7 బిలియన్‌ డాలర్లు కావాలంటూ ట్రంప్‌ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఐదు వారాల పాటు.. ప్రభుత్వ కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. దీంతో మధ్యే మార్గంగా కాంగ్రెస్‌ 1.4 బిలియన్‌ డాలర్లు ఇవ్వడానికి అంగీకరించింది. ఇది ఏ మాత్రం సరిపోవని.. తాను కోరుకున్నట్లు గోడ నిర్మాణానికి సుమారు ఎనిమిది బిలియన్‌ డాలర్లు అవసరమని ట్రంప్‌ వాదిస్తున్నారు. ఇందుకు కాంగ్రెస్‌ ఆమోదించిన నిధులతో పాటు.. తన కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించిన ఇతర నిధులను కూడా వినియోగిస్తానంటున్నాడు ట్రంప్‌. దీంతో మిలిటరీ, డ్రగ్‌ వ్యతిరేక కార్యక్రమాల నిధులను గోడ నిర్మాణానికి మళ్లించే అవకాశాలు ఉన్నట్లు శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. మరోవైపు.. మరో షట్‌డౌన్‌ రాకుండా ప్రభుత్వ విభాగాలకు నిధులు సమకూర్చే బిల్లులకు అనుకూలంగా డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఓటేసిన మరుసటి రోజే ట్రంప్‌ అత్యవసర పరిస్థితి ప్రకటించిడం గమనార్హం. 

ఇదిలావుంటే.. ట్రంప్‌ నిర్ణయంపై కోర్టులో సవాలు చేయాలని విపక్ష డెమొక్రటిస్‌ సభ్యులు యోచిస్తున్నారు. ట్రంప్‌ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఈ హెచ్చరికలను ట్రంప్‌ తేలిగ్గా తీసుకున్నారు. తన నిర్ణయంపై దావా వేస్తే ఆ విచారణ ప్రక్రియ చాలా కాలం కొనసాగుతుందన్నారు. అయినా నాదే గెలుపు అన్నారు ట్రంప్‌. అయితే.. లేని సంక్షోభం పేరిట ట్రంప్‌ అత్యవసర పరిస్థితిని విధించారని.. సైనికుల నిధులను దారి మళ్లిస్తే దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.