నవ్వించండీ..నవ్వుల పాలు చేయకండీ : ఏప్రిల్ ఫూల్స్ డే..వింత వింత సంప్రదాయాలు

నవ్వించండీ..నవ్వుల పాలు చేయకండీ : ఏప్రిల్ ఫూల్స్ డే..వింత వింత సంప్రదాయాలు

April Fools Day 2021 Peacial

April Fools Day 2021 peacial : ఏప్రిల్ 1 తేదీన ప్రపంచవ్యాప్తంగా ‘ఫూల్స్ డే’ని జరుపుకుంటారు. ఈరోజున చిన్నా పెద్దా..ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ఇలా ఎవరైనా సరే ఒకరినొకరు రకకరాలుగా ఫూల్స్ చేసి నవ్వుకుంటుంటారు. కొన్ని దేశాలలో ఏప్రిల్ ఫూల్స్ డే రోజున సెలవు కూడా ఇస్తుంటారు. ఈరోజు ఒకరిపై మరొకరు జోక్స్ వేసుకుంటూ ఆనందిస్తుంటారు. అయితే దీనిని ఎవరూ తప్పుగా భావించరు. అలాగని సరదాను సీరియస్ చేయకూడదు.

ఏ రోజు అయినా ప్రత్యేకంగా జరుపుకోవటానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆ రోజు ఏర్పడటానికి ఓ కారణం ఉంటుంది. మరి ఏప్రిల్ ఫూల్స్ డే చరిత్ర విషయానికొస్తే..ఇది ఫలానా వారు..ఫలానా దేశంలో మొదలుపెట్టారని చెప్పటానికి పెద్దగా ఆధారాల్లేవు. యూరప్ లో మొదటిసారిగా జరుపారని తెలుస్తోంది. అయితే..ఈ ఏప్రిల్ ఫూల్స్ డేకు సంబంధించిన కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి.

ఏప్రిల్ ఫూల్స్ డే 1392 నుంచి నిర్వహిస్తున్నట్లు చెబుతారు చాలామంది. ఫ్రాన్స్‌లో 1582 నుంచి ఏప్రిల్ ఫూల్స్ డే చేసుకుంటున్నారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అప్పట్లో పోప్ చార్ల్స్-9 పాత క్యాలెండర్ స్థానంలో నూతన రోమన్ క్యాలెండర్ తీసుకువచ్చారట. దీంతో జనం పాత తేదీపై నూతన సంవత్సరాన్ని జరుపుకున్నారట. దీనినే తొలి ఏప్రిల్ ఫూల్‌గా చెబుతుంటారు.

ఏప్రిల్ ఫూల్స్ డేను ప్రపంచంలోని వివిధ దేశాలలో పలు రకాలుగా జరుపుకుంటారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ ఆఫ్రికా, బ్రిటన్‌లలో ఏప్రిల్ ఫూల్స్‌డేను మధ్యాహ్నం వరకే చేసుకుంటారు. ఆయా దేశాల్లోని వార్తా పత్రికల్లోని మెయిన్ పేజీల్లో ఏప్రిల్ పూల్స్ డే సంబంధిత వార్తలు వస్తుంటాయి.

అలాగే ఫ్రాన్స్, ఐర్లాండ్, ఇటలీ, దక్షిణ కొరియా, జపాన్, రష్యా, నెదర్లాండ్, జర్మనీ, బ్రెజిల్, కెనడా, అమెరికాతో పాటు పలు దేశాలలో ఏప్రిల్ ఫూల్స్ డే ఎంతో సంతోషంగా చేసుకుంటారు. ఒకరినొకరు సరదాగా ఫూల్స్ చేసుకుని ఆనందపడుతుంటారు.

ఇటలీ, బెల్జియం దేశాలలో ఏప్రిల్ ఫూల్స్ డే నాడు ఓ సంప్రదాయాన్ని పాటిస్తారు. స్నేహితుల వీపు భాగాన… ఫన్నీ కామెంట్లు రాసిన పేపర్లు అతికిస్తారు. వాటిపై ‘I AM FOOL’అని రాస్తారు. వీటిని ఏప్రిల్ ఫిష్‌గా పిలుస్తుంటారు. అలాగే కాగితంతో తయారు చేసిన ఫిష్ లను అతికిస్తారు. ఇలా పలు దేశాల్లో వారి వారికి ఇష్టమైన రీతిలో ఏప్రిల్ ఫూల్స్ డేని హ్యాపీ హ్యాపీగా జరుపుకుంటారు.

అదే స్పెయిన్‌లో ఏప్రిల్ ఒకటో తేదీన ‘హోలీ ఇన్నోసెంట్స్’ అనే పండుగ నిర్వహిస్తారు. ఇరాన్‌లో నూతన సంవత్సర వేడుకల 13వ రోజు ‘సిజదా బెదర్’ పేరుతో ఫూల్స్ డేను జరుపుకుంటారు. చూశారుగా.. ఏప్రిల్ ఒకటో తేదీ ‘ఫూల్స్ డే’ ప్రత్యేకత.

నవ్వించాలి.. నవ్వులపాలు చేయకూడదు: ఏప్రిల్ 1వ తేదీని సరదాగా నవ్వుకోవడం కోసమే చేసే రోజు. అయితే, బంధుమిత్రులను సరదాగా ఆట పట్టించాలి తప్ప..దాన్ని అలుసుగా తీసుకుని ఆత్మీయుల్ని నవ్వులపాలు చేసేలా ఉండకూడదు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఏ దేశమూ ఈ ఏప్రిల్ ఫూల్స్‌ను చేసుకొనే స్థితిలో లేవు.