వర్సిటీలో విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్‌ జరుగుతుండగా కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి, 8 మందికి గాయాలు

కాల్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ స్పందించారు.

వర్సిటీలో విద్యార్థులకు ఫైనల్ ఎగ్జామ్స్‌ జరుగుతుండగా కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి, 8 మందికి గాయాలు

Updated On : December 14, 2025 / 10:10 AM IST

Brown University: అమెరికాలోని రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో కాల్పుల కలకలం చెలరేగింది. నల్లటి దుస్తులు ధరించిన ఓ దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు. దీంతో ఇద్దరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఫైనల్ పరీక్షలకు హాజరవుతుండగా ఈ కాల్పులు జరిగాయని అధికారులు వివరించారు. పోలీసులకు నిందితుడు ఇప్పటికీ చిక్కలేదు. క్యాంపస్ సమీపంలో నివసించే ప్రజలు ఇళ్ల లోపలే ఉండాలని పోలీసులు సూచించారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.

Also Read: తెలంగాణలో పురుషుల కంటే మహిళల ఆయుర్దాయమే అధికం

“శనివారం స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ డిపార్ట్‌మెంట్ ఉన్న బారస్-హోలీ భవనంలో కాల్పులు జరిగాయి. అనుమానితుడు కాల్పులు జరిపినప్పుడు ఇంజనీరింగ్ డిజైన్ పరీక్షలు జరుగుతున్నాయి” అని అధికారులు తెలిపారు.

కాల్పుల శబ్దాలు వినగానే విద్యార్థులు అప్రమత్తమై దాక్కునే ప్రయత్నాలు చేశారు. ల్యాబ్‌లోని విద్యార్థులు కాల్పుల గురించి హెచ్చరిక అందుకున్న తర్వాత డెస్క్‌ల కింద దాక్కుని లైట్లు ఆపివేశారు.

బాధితుల కోసం ప్రార్థించండి: ట్రంప్
కాల్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ స్పందించారు. వైట్ హౌస్ ఆయన మాట్లాడుతూ.. “ఇప్పుడు మనం చేయగలిగేది బాధితుల కోసం ప్రార్థించడమే” అని అన్నారు.

తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌ చేశారు. “రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల గురించి నాకు సమాచారం అందింది. ఎఫ్‌బీఐ ఆ ఘటనాస్థలిలో ఉంది” అని అన్నారు.