తారాజువ్వలా.. బిట్ కాయిన్ నయా రికార్డ్

తారాజువ్వలా..  బిట్ కాయిన్ నయా రికార్డ్

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ తారాజువ్వలా నయా రికార్డులను క్రియేట్ చేస్తోంది. చరిత్రలో తొలిసారి బిట్‌కాయిన్ విలువ న్యూయార్క్‌లో 50వేల 191 డాలర్ల రేటును దాటగా.. ఇండియన్ రూపాయల్లో పోల్చుకుంటే.. దాని విలువ సుమారు 36 లక్షల 55 వేల రూపాయలు. గత ఏడాదితో పోలిస్తే బిట్‌ కాయిన్ విలువ 140 శాతం పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి క్రిప్టో కరెన్సీ విలువ 73 శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్‌ బిట్‌ కాయిన్ వైపు మొగ్గు చూపడమే విలువ పెరుగుదలకు కారణం అంటున్నారు నిపుణులు.

2008లో బిట్‌కాయిన్ల ప్రస్థానం మొదలవగా.. 2013లో తొలిసారి దాని విలువ వెయ్యి డాలర్లు దాటింది. ఆ తర్వాత క్రమంగా పుంజుకొని ఇప్పుడు 50 వేల డాలర్లు దాటింది. నిజానికి గతేడాది మార్చిలో కూడా బిట్ కాయిన్ విలువ 5వేల డాలర్లే. ఆ తర్వాత కొద్దినెలల్లోనే 20వేల డాలర్లకుపైగా పెరిగింది. బంగారంతో పోలిస్తే బిట్‌కాయిన్‌ కొనుగోలు లాభదాయకం అనే ఆలోచన జనంలో పెరగడంతో వాల్యూలో రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతుందీ క్రిప్టో కరెన్సీ.

కరోనా పరిణామాల తర్వాత వ్యాపారాలు, ఉద్యోగాలు గల్లంతై జనాల కొనుగోలు శక్తి దెబ్బతింది. దీనిని పునరుద్ధరించడానికి ప్రభుత్వాలు ప్రకటించిన భారీ ఉద్దీపన పథకాల వల్ల ద్రవ్యోల్బణం పెరిగి, కరెన్సీ విలువ పడిపోయి, బ్యాంకింగ్‌ రంగం సుస్థిరతపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మంచి పెట్టుబడి సాధనాలు అనుకున్న బంగారం, షేర్ల ధరలు తికమకకు గురిచేశాయి‌. ఇలాంటి తరుణంలో వీటికన్నా బిట్‌కాయిన్‌, ఎథీరియంలాంటి క్రిప్టోకరెన్సీలపై పెట్టుబడి పెట్టడం సేఫ్ అనే భావన ఇన్వెస్టర్‌లలో కనిపిస్తోంది.

బిట్‌ కాయిన్‌ భారీ వృద్ధికి తొలి కారణం.. ప్రపంచంలోని అతిసంపన్నులలో ఒకరైన టెస్లా కంపెనీ అధిపతి ఎలాన్‌ మస్క్‌. బిట్‌ కాయిన్ల మార్కెట్‌లో 150 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టారు ఎలన్ మస్క్. దీంతో ఒక్కసారిగా బిట్‌కాయిన్‌ టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారిపోయింది. ఆ తర్వాత కెనడా కూడా బిట్ కాయిన్‌కు అనుమతి ఇవ్వడం దాని బలాన్ని పుంజుకునేలా చేసింది. ప్రస్తుతం 50వేల డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోన్న బిట్ కాయిన్ విలువ.. ఈ ఏడాదిలోనే లక్ష డాలర్లను మించిపోతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రపంచంలో ఇప్పటివరకు 6వేలకు పైగా క్రిప్టో కరెన్సీలు ఉండగా.. వాటి మార్కెట్‌ విలువ లక్షా 24 వేల కోట్ల డాలర్లు అంటే 90 లక్షల కోట్ల రూపాయలు పైగా ఉంది. వీటిలో ఒక్క బిట్‌ కాయిన్‌ మార్కెట్‌ విలువే దాదాపు 50లక్షల కోట్ల రూపాయలుగా ఉండటం ఆశ్చర్యపరిచే అంశం. ఇది ప్రపంచంలో అతిపెద్ద చెల్లింపుల సంస్థ వీసా, అతిపెద్ద చిల్లర వర్తక సంస్థ వాల్‌మార్ట్‌ మార్కెట్‌ విలువలకన్నా చాలా ఎక్కువ. అంకెలను లెక్కేలేస్తేనే ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేస్తున్న బిట్ కాయిన్.. ఫ్యూచర్ శాసిస్తుందా అంటే.. కాదు అని చెప్పడానికి అయితే లేదు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.