బాత్ రూంలో కూడా కెమెరాలు పెట్టారు…మరియం నవాజ్

  • Published By: venkaiahnaidu ,Published On : November 14, 2020 / 05:57 PM IST
బాత్ రూంలో కూడా కెమెరాలు పెట్టారు…మరియం నవాజ్

Maryam Nawaz ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ సంచలన ఆరోపణలు చేశారు. చౌదరి షుగర్ మిల్స్‌ కేసులో మరియం జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను జైలులో ఉన్నపుడు ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించిన మరియం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసింది.



తనను నిర్బంధించిన జైలు గదితో పాటు బాత్రూమ్‌ లో కూడా సీసీ కెమెరాలను అమర్చారని మరియం ఆరోపించారు. తాను రెండుసార్లు జైలు జీవితం గడిపినట్లు మరియం తెలిపారు. ఓ మహిళనైన తనను జైలులో ఏ విధంగా చూశారో తాను చెబితే…ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ముఖం చూపించే సాహసం చేయదన్నారు. తన గదిలోకి అధికారులు బలవంతంగా చొచ్చుకొచ్చారని ఆరోపించారు. తన తండ్రి సమక్షంలోనే అరెస్టు చేసి…వ్యక్తిగతంగా దాడి చేస్తే… ఇక పాకిస్థాన్‌లో ఏ మహిళకూ రక్షణ ఉండదన్నారు.



మహిళలు పాకిస్థాన్‌లో ఉన్నా, విదేశాల్లో ఉన్నా బలహీనులు కాదన్నారు. వేధింపులకు గురిచేసినప్పుడు తాను ఏడవడానికి ఇష్టపడలేదని… వేధింపులకు కుంగిపోకుండా ఆ సత్యాన్ని ప్రపంచానికి తెలియాజేయాలని అనుకున్నానని మరియం నవాజ్ స్పష్టం చేశారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకే నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో చట్టవిరుద్ధంగా తనని అరెస్టు చేసినట్లు మరియం ఆరోపించారు.



ఇక, రాజ్యంగ వ్యవస్థల పట్ల తమకు వ్యతిరేకత లేదని.. రహస్య సంప్రదింపులు జరపబోమని మరియం నవాజ్ చెప్పారు. రాజ్యాంగ నిబంధనల మేరకు సైన్యంతో చర్చించేందుకు తమ పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందన్నారు. పాకిస్థాన్ డెమొక్రాటిక్ మువ్‌మెంట్ (PDM) వేదికపై చర్చలకు సిద్ధమేనని తెలిపారు.