కేజీఎఫ్‌కి వెయ్యింతల బంగారాన్ని అమెరికా సొంతం చేసుకోవాలనుకుంటుందా..? దానికి చెక్ చెప్పడానికే చైనా మిషన్ మూన్ చేపట్టిందా?

  • Published By: naveen ,Published On : November 26, 2020 / 05:14 PM IST
కేజీఎఫ్‌కి వెయ్యింతల బంగారాన్ని అమెరికా సొంతం చేసుకోవాలనుకుంటుందా..? దానికి చెక్ చెప్పడానికే చైనా మిషన్ మూన్ చేపట్టిందా?

china moon wealth: భూమిపై పరిశోధన తర్వాత ఇక రోదసిలో ప్రారంభం కాబోతోందా..? కేజిఎఫ్‌కి వెయ్యింతల బంగారం అంతా అమెరికా సొంతం చేసుకోవాలనుకుంటుందా..? అమెరికాకి చెక్ పెట్టేందుకు చైనా చాంగ్-5 రోదసీలోకి పంపిందా..? వరుస పరిణామాలు చూస్తుంటే అలానే అన్పిస్తోంది.. భూమిపైన బంగారం కోసం మనిషి అన్వేషణ, ఆశ ఇప్పటివి కాదు.. అది కాస్తా ఇప్పుడు ఇతర గ్రహాలు, గ్రహశకలాల పైనా ప్రారంభం కాబోతోంది. ఇప్పటిదాకా భూగ్రహంపైన సాగిన మైనింగ్ ఇక అంతరిక్షంలో ప్రారంభం కాబోతోంది.. లక్షల టన్నుల బంగారం తవ్వుకునేందుకు అగ్రరాజ్యం వ్యూహాలు సిద్ధం చేసింది. ఐతే పైకి మాత్రం దాన్ని కవరప్ చేస్తోంది.

అమెరికాకి చైనా వార్నింగ్ ఇచ్చిందా?
అమెరికన్ స్పేస్ సెంటర్ నాసా చేపట్టిన 16 సైకీ( sixteen psyche) కలకలం రేపుతోంది. లక్షల కిలోమీటర్ల దూరంలో అంతరిక్షంలో తిరుగుతోన్న ఓ గ్రహశకలంపై అధ్యయనం చేయడానికి అమెరికా కొన్నేళ్లుగా సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఓ స్పేస్‌క్రాఫ్ట్‌ని కూడా తయారు చేస్తోంది. దానికి సంబంధించిన క్రిటికల్ డిజైన్ దశ కూడా పూర్తైంది. భూ గ్రహం ఎలా ఏర్పడింది.. దాని ఇతర వివరాలేంటనేది కనుక్కోవడానికే ఈ కొత్త మిషన్ అని నాసా చెప్తుంది. ఐతే దీనికి చెక్ పెట్టేందుకే చైనా కూడా చాంగ్ 5ని రోదసిలోకి పంపడం ద్వారా అంతరిక్షంలో తన ఆధిపత్యం కోసం తహతహలాడుతుందంటున్నారు. అమెరికా సైకీ ఉల్కలోని నిక్షేపాలను సొంతం చేసుకుంటే.. తాను చందమామపై శకలాలను తవ్వుకుంటానంటూ పరోక్షంగా హెచ్చరిస్తోంది డ్రాగన్ కంట్రీ.

అక్కడి బంగారం తీసుకొస్తే ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ మిలియనీర్ కావొచ్చు:
సిక్టీన్ సైకీ సైజు చంద్రుడిలో ఒక వంతుకి దాదాపు సమానం.. ఇది కానీ భూమిని తాకిందంటే.. పండగే.. కానీ అలా ఉల్కాపతం తాకిందంటే ఉత్పాతాలూ వస్తాయ్. అందుకే ఈ సువర్ణ గ్రహశకలంపైకే వెళ్లి అక్కడే మైనింగ్ చేసుకుని వస్తే.. ఈ ఆలోచనే అమెరికా గత ఇరవై ఏళ్లుగా చేస్తోంది. ఇక్కడి బంగారమే యాజ్ఇటీజ్‌గా భూమిపైకి తెస్తే ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ మిలియనీర్ కావచ్చట. చంద్రునిలోని ఒక వంతులోని ఆస్టరాయిడ్‌లోనే ఇంత బంగారం ఉంటే.. ఇక చందమామలో ఎంత ఉండొచ్చు. అందులోనూ చందమామలోని దక్షిణ ధృవంపై బంగారం బోలెడంత దొరుకుతుందని తేల్చారు.

చంద్రునిపై కోటాను కోట్ల టన్నుల కొద్దీ యురేనియం, థోరియం నిల్వలు:
ఇక చందమామపై ఎక్కువగా టైటానియం లోహం ఉందని పరిశోధకులు తేల్చగా.. యురేనియం, థోరియం నిల్వలు కోటాను కోట్ల టన్నుల కొద్దీ పోగుపడి ఉందని చెప్తున్నారు. ఇలాంటి విలువైన ఖనిజాలను సొంతం చేసుకోవడమే లేటెస్ట్ మూన్ మిషన్స్ టార్గెట్ అంటున్నారు. అంతేకాదు చంద్రగ్రహంపై విరివిగా లభించే హీలియం నిక్షేపంతో భూమిపై న్యూక్లియర్ ఫ్యూషన్ రియాక్టర్లు నిర్మించవచ్చు. ఐతే లండన్‌లోని బర్క్ బెక్ కాలేజ్ ప్రొఫెసర్ ఇయాన్ క్రాఫర్డ్ అంచనా ప్రకారం చంద్రుడిపై మైనింగ్ చేసి తెచ్చుకునేదేం ఉండదని ఏ నిక్షేపం బైటికి తీసినా ఆవిరైపోతుందంటాడాయన.

బహుశా ఈ వాదనలో ఎంత వరకూ నిజముందో తెలుసుకోవడానికి కూడా ఈ చంద్ర గ్రహ యాత్రలు చేపడుతోంది చైనా.. చందమామపై శకలాలను యథాతథంగా తీసుకొచ్చి భూవాతావరణంలో వాటిలోని లోహాలను వెలికి తీసే ప్రయత్నాలు జరుగుతాయంటున్నారు.