కొత్త FDI రూల్స్ పై చైనా ఏడుపు…WTO సూత్రాలను భారత్ ఉల్లంఘించిందంటూ ఆరోపణలు

  • Published By: venkaiahnaidu ,Published On : April 20, 2020 / 09:46 AM IST
కొత్త FDI రూల్స్ పై చైనా ఏడుపు…WTO సూత్రాలను భారత్ ఉల్లంఘించిందంటూ ఆరోపణలు

భారత్ కొత్త FDI(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి)రూల్స్ WTO సూత్రాలను ఉల్లంఘించినట్లు చైనా ఆరోపించింది. భారత్ కొత్త ఎఫ్ డీఐ రూల్స్…వివక్ష ఉండకూడదన్న WTO సూత్రాలు మరియు ఫ్రీ అండ్ ఫెయిర్ ట్రేడ్(free and fair trade)కు వ్యతిరేకంగా ఉన్నట్లు చైనా ఆరోపించింది. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని వివక్షతో కూడుకొన్నదిగా అభివర్ణించింది. వివక్ష విధానాల యొక్క రివిజన్ కు చైనా పిలుపునిచ్చింది.  

భారత్‌తో సరిహద్దులు పంచుకునే దేశాల్లోని కంపెనీలు ఇండియాలో చెందిన పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేస్తూ,విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) పాలసీకి సవరణలు చేస్తూ గత శనివారం మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో దేశంలోని కంపెనీల్లో చైనా సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టి సదరు కంపెనీలను చైనా టేకోవర్ చేయడాన్ని నిలిపివేసే చర్యగా భారత్ తీసుకున్న నిర్ణయాన్ని చూడవచ్చు. దీంతో ప్రత్యక్ష మార్గంలో దేశంలో పెట్టుబడులు పెట్టడానికి అనుమతి లేదు. 

దేశంలో పెట్టుబడులకు ఎఫ్‌డీఐ ద్వారా రెండు రకాల అనుమతులు ఉన్నాయి. మొదటిది ఆటోమేటిక్ మార్గం… కంపెనీలకు మన ఇండియా లో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. రెండోది ప్రభుత్వ అనుమతితో పెట్టుబడులు పెట్టాలి. పాత ఎఫ్‌డీఐ పాలసీ ప్రకారం భారత్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ కంపెనీలకు మాత్రమే ప్రభుత్వం అనుమతి అవసరం అయ్యేంది. అయితే సవరించిన ఎఫ్‌డీఐ పాలసీతో చైనా,మయన్మార్,నేపాల్,భూటాన్ కూడా భారత్ లో పెట్టుబడులు పెట్టాలంటే కేంద్రప్రభుత్వ అనుమతి తప్పనిసరి. 

అయితే ప్రస్తుత కరోనా వైరస్ ప్రభావంతో దేశీయ కంపెనీలన్ని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. విదేశీ సంస్థలకు ఇలాంటి కంపెనీల మీద కన్నుపడింది. దేశీయ కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తమ వాటాను పెంచుకోవాలని.. లేదంటే ఏకమొత్తంగా కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి. ఈ మేరకు ఎఫ్‌డీఐ రూల్స్‌ను సవరిస్తూ..దేశీయ కంపెనీల కొనుగోలును కేంద్రం నియంత్రించింది. భారత్ సరిహద్దు దేశాలకూ నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజా సవరణలతో ఎఫ్‌డీఐ డీల్‌ ద్వారా యాజమాన్య హక్కుల బదిలీకి కూడా కేంద్రం చెక్ పెట్టింది.

కాగా .. HDFCలో ఇటీవల చైనా బ్యాంక్ 1.01 శాతం కొనుగోలుకు ఒప్పందానికి నూతన నిబంధనలు వర్తించవని తెలుస్తోంది. 10 శాతం లేదా ఎక్కువ వాటా కొనుగోలుకు మాత్రమే రూల్స్ వర్తిస్తాయి. రక్షణ, ఫార్మా సహా 17 రంగాల్లో ఇతర దేశాల కంపెనీలు పైన పేర్కొన్న నిబంధనలు మించి పెట్టుబడులు పెట్టాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి. అవకాశవాద టేకోవర్ లను తొలగించడానికే ఈ మార్పులు చేయడం వెనుక ఉద్దేశ్యమని అని కేంద్రం శనివారం సృష్టం చేసింది.