China Threatens Japan : అణు బాంబుతో దాడి చేస్తాం..జపాన్ కి చైనా తీవ్ర హెచ్చరిక!

ఇరుగుపొరుగు దేశాలతో చైనాకు ఘర్షణ ఇంకా కొనసాగుతోంది.

China Threatens Japan : అణు బాంబుతో దాడి చేస్తాం..జపాన్ కి చైనా తీవ్ర హెచ్చరిక!

China (2)

China Threatens Japan  ఇరుగుపొరుగు దేశాలతో చైనాకు ఘర్షణ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఇండియా, వియత్నాం, తైవాన్ దేశాలతో ఘర్షణ వైఖరి అవలంభిస్తున్న చైనా..జపాన్‌తో కూడా వివాదం తెచ్చుకుంది. ఇప్పుడు జపాన్-చైనా దేశాల మధ్య వివాదం రాజుకుంటోంది. జపాన్‌కు సంబంధించి ఏ ఒక్క యుద్ధ విమానం గానీ, సైనికుడు గానీ తైవాన్ సరిహద్దులో కన్పించినా..జపాన్ దేశాన్ని నామరూపాల్లేకుండా చేస్తామని చైనా హెచ్చరిస్తోంది. తైవాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే అణుబాంబుతో దాడి చేస్తామంటూ జపాన్‌ను తీవ్రంగా హెచ్చరించింది డ్రాగన్ దేశం. తైవాన్‌పై సంపూర్ణ సార్వభౌమాధికారం తనకే ఉందని..జపాన్ జోక్యం సహించే ప్రసక్తే లేదని  చైనా స్పష్టం చేసింది.

అణ్వాయుధాలు లేనటువంటి దేశాలపై అణ్వాయుధాలను ప్రయోగించరాదనే విధానానికి జపాన్ విషయంలో మినహాయింపు ఇస్తామని చైనా కమ్యూనిస్టు పార్టీ తెలిపింది. ఆ పార్టీ అధికారిక ఛానెల్ దీనికి సంబంధించిన వీడియోను ప్రసారం చేసింది. ఈ బెదిరింపు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేం మొదట అణు బాంబులను ప్రయోగిస్తాం అని చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ వీడియోలో హెచ్చరించినట్లు ఉంది. రెండోసారి బేషరతుగా లొంగిపోతున్నట్లు జపాన్ ప్రకటించే వరకు అణు బాంబులను నిరాఘాటంగా ప్రయోగిస్తామని చైనా బెదిరించినట్లు ఆ వీడియోలో ఉంది.

తైవాన్ న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐదు నిమిషాల నిడివిగల ఈ వీడియోను చైనాకు చెందిన జిగువా (యూట్యూబ్ లాంటి ఫ్లాట్ ఫాం)లో ఆదివారం అప్‌లోడ్ చేసినట్లు తెలిసింది. అయితే కొద్దిసేపటికే దీనిని తొలగించడం గమనార్హం. అయితే అప్పటికే దీని కాపీలను కొందరు యూట్యూబ్, ట్విటర్‌లలో అప్‌లోడ్ చేశారు. కాగా, దాదాపు రెండు వారాల క్రితం జపాన్ ఉప ప్రధాన మంత్రి టారో అసో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చైనా బెదిరింపు వీడియో విడుదలైంది. తైవాన్‌ను జపాన్ తప్పనిసరిగా సమర్థించాలని టారో అసో అన్నట్లు జపాన్ టైమ్స్ తెలిపింది.