Chinese Billionaires To Singapore : చైనా వదిలి సింగపూర్ వెళ్లిపోతున్న సంపన్నులు .. ఆందోళనలో డ్రాగన కంట్రీ

Chinese Billionaires To Singapore : చైనా వదిలి సింగపూర్ వెళ్లిపోతున్న సంపన్నులు .. ఆందోళనలో డ్రాగన కంట్రీ

Chinese Billionaires Moving to Singapore

Chinese Billionaires Moving to Singapore : ఓ వైపు కరోనా లాక్‌డౌన్‌లు.. మరోవైపు తైవాన్‌ ఉద్రిక్తతలు.. ఇలాంటి పరిస్థితుల మధ్య మకాం మార్చేందుకు చైనా సంపన్నులు సిద్ధం అవుతున్నారు. వెకేషన్‌ కోసం కాదు..ఏకంగా ఐడెంటిటీనే మార్చుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇంతకీ చైనా సంపన్నులు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు ?

చైనా సర్కార్‌ చర్యలు.. ఆ దేశ సంపన్నుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తున్నాయ్. అందుకే దేశం నుంచి మకాం మార్చేసేందుకు ఒక్కొక్కరుగా సిద్ధం అవుతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో దారి అయితే.. చాలామంది మాత్రం సింగపూర్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్‌టాపిక్ అయింది. డ్రాగన్‌ ప్రభుత్వం అర్థం లేని చర్యలు చూసీ చూసీ అలసిపోయిన కుబేరులు.. బతికితే సింగపూర్‌లో బతుకు అన్నట్లుగా ఫ్లైట్ టికెట్లు సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు కొంతకాలం అని ప్లాన్ చేసుకుంటుంటే.. చాలామంది మాత్రం పర్మినెంట్‌గా సింగపూర్‌లోనే సెటిల్‌ కావాలని ప్లాన్ చేస్తున్నారు.

నిజానికి సింగపూర్‌ అనేది చాలామంది కుబేరులకు బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్‌. తక్కువ పన్ను విధానాలతో విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు వచ్చాయ్. చైనాకు చెందిన సంపన్నులు కూడా భారీగానే ఇన్వెస్ట్ చేశారు. నిజానికి సింగపూర్‌ చేసే అతిపెద్ద వ్యాపారం చైనాతోనే ! ఐతే ఇన్నాళ్లు చైనాలో ఉండి సింగపూర్‌లో పెట్టుబడులు పెట్టిన ఆ దేశ సంపన్నులు.. సింగపూర్‌కే పూర్తిగా మకాం మార్చేయాలని ఫిక్స్ అయ్యారు. జీరో కోవిడ్ అంటూ చైనా సర్కార్ తీసుకున్న నిర్ణయాలు.. తైవాన్‌ పరిణామాలతో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ఇలాంటి పరిణామాల మధ్య దేశం విడిచి వెళ్లడమే బెటర్ అనుకొని బ్యాగులు సర్దేసుకుంటున్నారు.

2020 కరోనా వెలుగుచూసినప్పటి నుంచి చైనాలో వరుస లాక్‌డౌన్‌లు అమలుచేస్తోంది జిన్‌పింగ్‌ సర్కార్ ! వేల కోట్ల సంపద ఉన్నా.. చిన్న బ్రెడ్డు ముక్క కోసం ఓ సంపన్నుడు గుండెలు పగిలేలా ఏడ్చిన విజువల్స్ మొన్నటి లాక్‌డౌన్‌లో కనిపించాయ్. వరుస లాక్‌డౌన్‌లతో నష్టాల పాలవుతున్నట్లు.. పిల్లల చదువులు కూడా పక్కదారి పడుతున్నట్లు భావించి చైనాకు గుడ్‌బై చెప్పేందుకు చాలామంది సంపన్నులు సిద్ధం అయ్యారు. దాదాపు 10వేల మంది ధనవంతులు ఇతర దేశాలకు వెళ్లిపోవాలన్న ఆలోచనలో ఉన్నారు. సింగపూర్‌తో పాటు స్విట్జర్లాండ్‌, ఇజ్రాయిల్‌, ఆస్ట్రేలియా, యూఏఈ దేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. వెళ్తూ వెళ్తూ తమ ధనాన్ని కూడా తీసుకెళ్లే పనిలో ఉన్నారట.

తైవాన్‌ పరిణామాలు కూడా ఇప్పుడు చైనా సంపన్నులను టెన్షన్‌ పెడుతున్నాయ్. యుక్రెయిన్ మీద యుద్ధానికి దిగిన రష్యాపై ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ ఆర్థిక ఆంక్షలు విధించాయ్. ఐతే రేపటి రోజు తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు చైనా ఓ అడుగు ముందుకేసినా.. ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయ్. మరి అప్పుడు తమ పరిస్థితి ఏంటి.. తమ వ్యాపారాల పరిస్థితి ఏంటని.. చైనా సంపన్నులంతా తట్టాబుట్టా సర్దుకుంటున్నారు. సింగపూర్ జనాభా 53 లక్షలు కాగా.. అందులో రెండింట్లో మూడోవంతు చైనీయులే ఎక్కువగా ఉంటారు. ఒకవేళ ఒక్కడికి వెళ్లినా.. సొంత దేశాన్ని వీడిన ఫీలింగ్ ఉండదు. అందుకే ఎక్కువ మంది సింగపూర్‌ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో చైనా సంపన్నులను అట్రాక్ట్ చేసేందుకు సింగపూర్ సర్కార్‌ కూడా రకరకాల ప్రయత్నాలు మొదలుపెడుతోంది.