Covid Updates : ప్రపంచంలో ఎక్కడలేనంతగా భారత్‌లో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా

Covid Updates : ప్రపంచంలో ఎక్కడలేనంతగా భారత్‌లో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న కరోనా

Covid Spreading Faster In India

Covid spreading faster in India : ప్రపంచంలో ఎక్కడలేని విధంగా భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకూ అంతకంతకూ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో గత 24 గంటల్లో రోజువారీగా కరోనా కేసులు 1,50వేలకు పైగా దాటేశాయి. ఒక్క ఆదివారమే కొత్త కరోనా మరణాల సంఖ్య 800కు పైగా నమోదైంది. భారతదేశంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటినుంచి మొత్తంగా 12 మిలియన్ల కరోనా కేసులు నమోదైతే.. 1,67వేల కరోనా మరణాలు నమోదయ్యాయి. ప్రపంచంలో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో అతిపెద్ద కరోనా కేసులు నమోదైన దేశంగా నిలిచింది.

మహారాష్ట్రలో కూడా కరోనా కోరలు సాచింది. భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ బాధితుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో ఆస్పత్రుల్లో పడకల కొరత ఏర్పడింది. బెడ్లు ఖాళీ లేక కూర్చీల్లోనే కరోనా చికిత్స అందించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్ల ఆస్పత్రుల్లో వైద్యులు లేక బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పుణెలో కరోనా తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. ఆస్పత్రులన్నీ నిండిపోవడంతో ఖాళీ లేక వెలుపులే పేషెంట్లకు ఆక్సీజన్ అందించి చికిత్స అందిస్తున్నారు.

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా యువతపై ప్రభావం చూపుతోంది. యువకులే ఎక్కువగా కరోనా బారినపడుతున్నారు. గత ఏడాదిలో కరోనా మొదటి వేవ్.. రోజువారీ కేసుల సంఖ్య రెట్టింపు స్థాయిలో చేరుకోవడానికి 6వారాలకు పైనే సమయం పట్టింది.. కానీ, 2021 ఏడాదిలో మాత్రం సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. కేవలం 10 రోజుల్లోపే కరోనా కేసుల సంఖ్య ప్రమాదకరస్థాయికి చేరుకుంది.

కరోనా నిబంధనలను పాటించకపోవడం కారణంగానే రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య తీవ్రతరమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో వ్యాక్సినేషన్ అందించేందుకు స్టాక్ కొరత వెంటాడుతోంది. దాంతో వ్యాక్సినేషన్ సెంటర్లన్నీ మూసివేశారు. దేశంలో రాజకీయ సమావేశాలు, ఉత్సవాలు, ఫెస్టివల్స్ వంటి కార్యక్రమాలతో కరోనా కేసుల ఉధృతి పెరగడానికి దారితీసిందని విశ్లేషకులు చెబుతున్నారు.