కుక్క విశ్వాసమంటే ఇదే : చనిపోయిన యజమాని కోసం..ఎదురుచూపులు

  • Published By: veegamteam ,Published On : November 4, 2019 / 11:11 AM IST
కుక్క విశ్వాసమంటే ఇదే : చనిపోయిన యజమాని కోసం..ఎదురుచూపులు

కుక్క. విశ్వాసానికి మారు పేరు అని మరోసారి నిరూపించింది. ప్రమాదవశాత్తు చనిపోయిన తన యజమాని కోసం పడిగాపులు పడి ఎదురు చూస్తోంది. తన యజమాని వస్తాడని ఇద్దరం కలిసి మళ్లీ షికార్లు చేస్తామని కొండంత ఆశతో ఎదురు చూస్తోంది. థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కుక్కకు మనుషులు సాటి వస్తారా అంటున్నారు నెటిజన్లు. 

అది థాయ్‌లాండ్‌లోని చాంతాబురి. సోంపార్న్‌ సితోంగ్‌కుమ్‌ 56 ఏళ్ల రైతుకు ‘మ్హీ’ అనే ఓ కుక్క ఉంది. ఆ రైతు ప్రతీ రోజు పొలానికి వెళ్లేటప్పుడు తన కుక్కను కూడా తీసుకెళతాడు. పొలం పనులు చూసుకుంటాడు. పొలానికి నీళ్లు పెడతాడు. అలా ఆ యజమానికి కుక్కకు మధ్య ఎంతో అనుబంధం పెరిగిపోయింది. రోజు లాగానే సింతోంగ్ కుమ్ శుక్రవారం (నవంబర్ 1) ఉదయం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. చెరువు  గట్టున ఉన్న స్పింక్లర్‌ వాల్వ్‌ ఆన్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోయాడు. అతనికి ఈత రాదు. దీంతో పాపం సింతోంగ్ కుమ్ నీళ్లలో మునిగిపోయి చనిపోయాడు. అప్పటి వరకూ పొలంలో పని చేసిన యజమాని కనిపించకపోవటంతో ‘మ్హీ’ అతన్ని వెతుక్కుంటూ చెరువు దగ్గరకు వచ్చింది. 

చెరువు గట్టుపై ఉన్న సోంపార్న్‌ చెప్పులు, టార్చ్‌లైట్‌ దగ్గరే కూర్చుని అతని కోసం ఎదురు చూస్తోంది. అలా తన సోదరుడు ఇంకా ఇంటికి రాకపోవటంతో   సితోంగ్‌కుమ్‌ సోదరి వెతుక్కుంటూ పొలం దగ్గరకు వచ్చింది. అక్కడ చెరువు గట్టున ‘మ్హీ’ని చూసింది. ఆందోళనకు గురైంది. సోదరుడి కోసం కేకలు వేసి పిలిచింది. కానీ ఎటువంటి సమాధానం రాలేదు. తన అన్న ప్రమాదావశాత్తూ చెరువులో పడిపోయి ఉండొచ్చని అనుమానించింది.

వెంటనే రెస్క్యూ టీంకు సమాచారం ఇచ్చింది. రెస్క్యూ బృందం చెరువులోంచి సోంపార్న్‌ డెడ్ బాడీని బయటకు తీశారు. సోంపార్న్‌కు ఆరోగ్యం సరిగా లేదని, అందువల్ల  స్పింక్లర్‌ వాల్వ్‌ ఆన్‌ చేసే సమయంలో తూలి బావిలో పడిపోయి ఉండొచ్చని అతని సోదరి కన్నీరుమున్నీరుగా విలపించింది. ‘మ్హీ’  సోంపార్న్‌ మంచి అనుబంధం గురించి తెలిసిన ఆమె ‘మ్హీ’ ని చూసి మరింతగా దు:ఖిస్తోంది.  యజమాని మరణంతో దీనంగా కూర్చున్న ‘మ్హీ’ దీనస్థితిపై నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.