ఎట్టకేలకు ఓటమిని ఒప్పుకున్న ట్రంప్.. బైడెన్‌కు అధికారం అప్పగించేందుకు అంగీకారం

  • Published By: vamsi ,Published On : November 24, 2020 / 11:00 AM IST
ఎట్టకేలకు ఓటమిని ఒప్పుకున్న ట్రంప్.. బైడెన్‌కు అధికారం అప్పగించేందుకు అంగీకారం

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ అధికార పగ్గాలు చేపట్టి, వైట్‌హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే ప్రక్రియ ప్రారంభించేందుకు లాంఛనప్రాయంగా అంగీకరించారు ప్రస్తుత ప్రెసిడెంట్ డోనల్డ్ ట్రంప్. కీలక అధికార యంత్రాంగం ‘ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది’ అని ట్రంప్ చెప్పారు. అదే సమయంలో ఎన్నికల ఫలితాలపై పోరాటం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ ఘన విజయం సాధించగా.. ట్రంప్ ఘోర ఓటమిని చవిచూశారు. అయితే.. ఎన్నికల ఓడిపోయినా కూడా ఓటమిని ట్రంప్ అంగీకరించలేదు. ఈ విషయంలో కోర్టు మెట్లెక్కగా.. కోర్టులోనూ చివరకు ట్రంప్‌కి చుక్కెదురైంది.



అయితే ఇప్పుడు ఎట్టకేలకు మొండి పట్టు వదిలి దిగివచ్చిన అమెరికా అధ్యక్షుడు.. కొత్తగా ఎన్నికైన జో బైడెన్‌‌కు అధికార పగ్గాలు అప్పజెప్పేందుకు అంగీకరించారు. ఈ క్రమంలోనే జో బైడెన్ ‘విజేతగా కనిపిస్తున్నారు’ అని జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ (జీఎస్ఏ) ప్రకటించింది. అంతకుముందు, అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో కూడా బైడెన్ గెలిచినట్లు అధికారికంగా ప్రకటించారు.



https://10tv.in/new-chinese-ammunition-bunkers-seen-7-km-from-2017-doklam-face-off-sit/
ట్రంప్ అధికార మార్పిడి ప్రక్రియకు అంగీకరించడాన్ని ఆహ్వానిస్తున్నట్లు బైడెన్ టీమ్ ప్రకటించింది. “ఈరోజు తీసుకున్న నిర్ణయం దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళ పరిష్కార ప్రక్రియను ప్రారంభించేందుకు ఎంతో అవసరం. కరోనా మహమ్మారిని అదుపు చేయడం, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం మన ముందున్న సవాళ్లు” అని బైడెన్ ప్రకటించారు.



కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడికి అధికారాన్ని బదలాయించే బాధ్యతను జీఎస్ఏకు అప్పగించినట్లు, ఆ విషయాన్ని బైడెన్ బృందానికి తెలిపినట్లు ట్రంప్ ట్వీట్ చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన నేతకు 63 లక్షల డాలర్ల నిధులను అందుబాటులో ఉంచుతారు. ఎన్నికల ఫలితాల మీద “పోరు” కొనసాగుతుందని చెబుతూనే, “దేశ ప్రయోజనాల దృష్ట్యా అధికార మార్పిడికి సంబంధించిన ప్రోటోకాల్స్ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమిలీకి, ఆమె బృందానికి సూచిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.



అలాగే, నా బృందానికి కూడా అదే విషయాన్ని చెప్పాను” అని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. “వేలాది సమస్యలు ఉన్నప్పటికీ నేను చట్టబద్ధంగా వ్యవహరించేందుకు కట్టుబడి ఉన్నాను” అని ఈ సంధర్భంగా ట్రంప్ అన్నారు.