త‌న‌కు తాను క్ష‌మాభిక్ష .. ట్రంప్ మ‌రో సంచ‌ల‌నం!

త‌న‌కు తాను క్ష‌మాభిక్ష .. ట్రంప్ మ‌రో సంచ‌ల‌నం!

Donald Trump : అధ్యక్ష పీఠాన్ని తనకే దక్కాలని అనుకున్నారు. ఓటమిని అంగీకరించలేదు. తానే ప్రెసిడెంట్ అనుకున్నారు. కానీ..అలా జరగలేదు. అధ్యక్ష పీఠం నుంచి దిగిపోవడానికి మరో 12 రోజులు మాత్రమే ఉంది. ఎవరో ఇప్పటికే అర్థమైందా ? ఆయనే డోనాల్డ్ ట్రంప్. క్యాపిటల్ హిల్ పై తన మద్దతు దారుల దాడి తర్వాత..ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకొనే విధంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాను చేసిన తప్పులన్నింటీ నుంచి సెల్ఫ్ పార్డన్ (తనకు తాను క్షమాభిక్ష) చేసుకోవాలని అనుకుంటున్నారంట. ఇప్పటికే ఈ విషయాన్ని తన సహాయకులతో చర్చించినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించడం హాట్ టాపిక్ అయ్యింది.

క్యాపిటల్ హిల్ పై దాడి : –
దాడి తర్వాత..తనపై విచారణ జరగవచ్చనే ఆందోళనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే తనకు తాను క్షమాభిక్ష పెట్టుకొనే దిశగా ఆలోచన చేస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కూడా…ఈ విషయంలో ట్రంప్ ట్వీట్ చేసిన అంశం తెరమీదకు వచ్చింది. అమెరికా ప్రెసిడెంట్ గా స్వీయ క్షమాభిక్ష విధించుకొనే అవకాశం ఉందని ట్రంప్ వాదించారు. 2018లో ట్రంప్ ఈ విషయంపై ట్వీట్ చేశారు. నేను ఏ తప్పు చేయలేదు కదా..అంటూ ఆ ట్వీట్ లో వెల్లడించారు. చెప్పిన విధంగా..ట్రంప్ అలా చేస్తే..పెద్ద సంచలనం అవుతుందంటున్నారు. ఆయన పదవి నుంచి దిగిపోయినా..విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయ నిపుణులు వెల్లడించారు.

రాజ్యాంగ నిపుణులు : –
తనకు తాను క్షమాభిక్ష పెట్టుకోవడం కుదరదని అంటున్నారు రాజ్యాంగ నిపుణులు. తన విషయంలో తాను ఏ వ్యక్తీ జడ్జీ కాలేరని వాళ్లు వెల్లడిస్తున్నారు. క్షమాభిక్ష అనేది ఓ వ్యక్తి..మరో వ్యక్తికి ఇచ్చేది తప్ప..తనకు తాను ఇచ్చేది కాదని జార్జ్ టౌన్ ప్రొఫెసర్ లూయిస్ సీడ్ మన్ తెలిపారు.

గతంలో

1974లో స్వీయ క్షమాభిక్ష చట్టబద్ధమేనని అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న నిక్సన్ లాయర్ చెప్పారు. దీనిని న్యాయశాఖ కొట్టిపారేసింది. అయితే..అలా కాకుండా..25వ సవరణ ప్రకారం..అధ్యక్షుడిగా తాను విధులు నిర్వహించలేనని చెబుతూ..ముందు అధ్యక్ష పీఠం నుంచి దిగిపోవాలని సూచించింది. ఈ బాధ్యతలు వైస్ ప్రెసిడెంట్ కు అప్పగించాలని, ఆ తర్వాత.. అధ్యక్ష పీఠంలో ఉన్న వ్యక్తి క్షమాభిక్ష పెట్టవచ్చని న్యాయశాఖ సూచించింది. క్షమాభిక్ష పొందిన తర్వాత..మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టవచ్చని సూచించింది. దీంతో నిక్సన్ అదే విధంగా చేశారు. అమెరికా చరిత్రలో క్షమాభిక్ష పొందిన ఏకైక అధ్యక్షుడిగా నిలిచారు. మరి ట్రంప్ విషయంలో ఏమి జరుగుతుందో చూడాలి.