G7 Tax Deal: చారిత్రక ఒప్పందం.. గూగుల్, ఫేస్‌బుక్ వంటి కంపెనీలపై 15శాతం పన్ను

G7 Tax Deal: చారిత్రక ఒప్పందం.. గూగుల్, ఫేస్‌బుక్ వంటి కంపెనీలపై 15శాతం పన్ను

G7 Global Corporate Tax Deal Impose A Common Global Corporate Tax

G7 global corporate tax deal: ప్రపంచంలోని ఏడు ధనిక దేశాలు పెద్ద మల్టీ నేషనల్ టెక్ కంపెనీలపై అధిక పన్నులు విధించాలని నిర్ణయించాయి. గూగుల్, ఫేస్‌బుక్, ఆపిల్, అమెజాన్ వంటి పెద్ద అమెరికా కంపెనీలపై 15శాతం వరకు పన్ను విధించే చారిత్రాత్మక ప్రపంచ ఒప్పందంపై జి-7 గ్రూప్ సంతకం చేసింది. ఆర్థికంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశాలతో కూడిన జీ7 బృందం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జీ7 అంటే ఏడు దేశాల బృందం కాగా.. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా ఇందులో సభ్యులుగా ఉన్నాయి.

జి -7 గ్రూప్ దేశాల ఆర్థిక మంత్రులు లండన్‌లో జరిగిన సమావేశాల్లో ఈ ఒప్పందంపై సంతకం చేసినట్లు బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ తెలిపారు. సునాక్ మాట్లాడుతూ, “చాలా సంవత్సరాల చర్చల తరువాత, జి-7 ఆర్థిక మంత్రులు ప్రపంచ పన్నుల వ్యవస్థను సంస్కరించడానికి ఒక చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసినందుకు సంతోషంగా ఉంది..” అన్నారు.

అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ యెల్లెన్ కూడా లండన్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ ఒప్పందం ప్రపంచ రేటు 15 శాతానికి చేరే ప్రక్రియను వేగవంతం చేస్తుందని యెలెన్ చెప్పారు. అమెరికా మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో మధ్యతరగతి మరియు శ్రామిక ప్రజలకు ఈ ఒప్పొందం వల్ల న్యాయం జరుగుతుందని అన్నారు.

స్వాతంత్ర్యం, మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, చట్ట పాలన, సుసంపన్నత, సుస్థిర అభివృద్ధి సూత్రాలుగా ఏర్పడిన జి-7 బృందం సమావేశం వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ముందు జరిగింది. ఇప్పుడు తీసుకున్న జి-7 ఒప్పందం.. శిఖరాగ్ర సమావేశంలో ఆమోదించబడుతుంది. బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ అధ్యక్షతన జూన్11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కార్న్‌వాల్‌లో ఈ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. రెండు సమావేశాలకు యూకే ఆతిథ్యం ఇస్తోంది. తక్కువ ఆదాయ దేశాలకు వ్యాక్సిన్లు అందించాలని కూడా జి-7 సమావేశంలో ప్రస్తావన ఉంది.