సూపర్ పవర్ కావాలని చైనా.. ధైర్యంగా ఎదుర్కొంటున్న భారత్!

  • Published By: vamsi ,Published On : September 3, 2020 / 08:36 PM IST
సూపర్ పవర్ కావాలని చైనా.. ధైర్యంగా ఎదుర్కొంటున్న భారత్!

ప్రపంచంలో సూపర్ పవర్‌గా ఎదగాలని అనుకుంటున్న చైనాకు.. ఇప్పుడు ఇండియా కొరకరాని కొయ్యగా మారిపోయింది. ఇండియాలో చొరబడి భూభాగాన్ని ఆక్రమించాలనుకున్న డ్రాగన్‌కు.. ఇటు వైపు నుంచి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరల్డ్ నెంబర్ వన్‌గా మారాలని అనుకుంటున్న చైనాని.. భారత్ నెంబర్ వన్ విలన్‌గా ప్రపంచానికి చూపిస్తుంది. అందుకే 12 దేశాల్లో తన సైన్యాన్ని మోహరించాలని చూస్తోంది. అందులో.. మూడు భారత పొరుగు దేశాలు కూడా ఉన్నాయి.

చిన్న చిన్న దేశాలకు.. పెట్టుబడులు, ఆర్థిక మూలాలు, అభివృద్ధి లాంటివి ఆశగా చూపి.. తన పని తాను చేసుకుంటూ పోతోంది చైనా. ఇందుకు బదులుగా ఆయా దేశాల్లో తమ మిలటరీ స్థావరాలు, సైనికులను ఏర్పాటు చేస్తామని చెబుతోంది. తన విస్తరణవాదాన్ని విస్తరించేందుకు.. సామ్రాజ్యాన్ని డబుల్ చేసుకునేందుకు.. డ్రాగన్ కంట్రీ చిన్న దేశాలపై కన్నేసింది.

ఇండో- ఫసిఫిక్‌ ప్రాంతంపై పైచేయి సాధించేందుకు వీలుగా.. 12 దేశాల్లో మిలటరీ లాజిస్టిక్ ఫెసిలిటీస్ నెలకొల్పేందుకు చైనా ప్రయత్నిస్తోందని అమెరికా డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ పెంటగాన్.. యూఎస్ కాంగ్రెస్‌కు సమర్పించిన వార్షిక నివేదికలో ప్రస్తావించింది. ఈ 12 దేశాల్లో.. 3 భారత్ పొరుగు దేశాలు కూడా ఉన్నాయి. పాకిస్థాన్, శ్రీలంక, మయన్మార్‌లో.. చైనా తన సైనిక స్థావరాలు, మిలటరీ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు థాయ్ లాండ్, సింగపూర్, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెన్యా, సిచిల్స్, టాంజానియా, అంగోల్, తజకిస్థాన్ కూడా ఉన్నాయి. ఇప్పటికే.. జిబౌటిలో చైనా మిలటరీ లాజిస్టిక్ ఫెసిలిటీస్‌ని ఏర్పాటు చేసింది. నమీబియా, వనాటు, సోలోమన్ దీవుల్లో.. తమ సైనిక కార్యకలాపాల గురించి సంకేతాలు ఇచ్చింది డ్రాగన్ కంట్రీ.

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, మిలటరీ లాజిస్టిక్స్ నెట్‌వర్క్ రెండూ.. అమెరికా సైనిక కార్యకలాపాలకు ఆటంకం కలిగించవచ్చని పెంటగాన్ అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా సైనిక లక్ష్యాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు.. అమెరికాకు వ్యతిరేకంగా జరిగే ప్రమాదకర కార్యకలాపాలకు కూడా మద్దతిచ్చే అవకాశముందని తన నివేదికలో తెలిపింది.

పెంటగాన్ చెప్పినదాని ప్రకారం.. చైనా తన మిలటరీ లాజిస్టిక్స్ ఫెసిలిటీస్ కోసం వన్ బెల్ట్ వన్ రోడ్.. స్ట్రాటజీని అమలు చేస్తోంది. డ్రాగన్ కంట్రీ సెలెక్ట్ చేసుకున్న 12 దేశాల్లో అభివృద్ధికి తోడ్పడటంతో పాటు ప్రపంచ రవాణా, వాణిజ్య అనుసంధానానికి కృషి చేస్తోంది. అంతేకాదు.. పొరుగు దేశాలతో కూడా వాణిజ్య సంబంధాలు పొంపొందించేందుకు సాయపడతామని చెబుతోంది. ఈ చిన్న దేశాల్లో పెట్టుబడులు పెట్టి.. వాటి ఆర్థిక సామర్థ్యం పెంచుతామని చెబుతోంది. ఇందుకు బదులుగా.. ఆ దేశాల్లో తమ మిలటరీ స్థావరాలను, సైనికులను ఏర్పాటు చేసుకుంటామంటోంది.

వన్ బెల్ట్.. వన్ రోడ్ ప్లాన్ ప్రకారం.. చైనా ఇప్పటికే పాకిస్థాన్ లో పైప్ లైన్స్, పోర్ట్ నిర్మాణం చేపట్టింది. సముద్ర మార్గంలో ఇంధన వనరుల రవాణా చేయడం.. డ్రాగన్ కంట్రీకి భారంగా మారింది. ఇందుకోసం.. హిందూ మహాసముద్రంలో మలాకా జలసంధిపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చైనా భావిస్తోంది. అందుకే.. పాకిస్థాన్‌లో పోర్ట్ నిర్మిస్తోంది. డ్రాగన్ కంట్రీ.. తనకు దక్షిణ, పశ్చిమ భాగంలో ఉన్న ప్రాంతాల్లో.. స్థిరత్వాన్ని మెరుగుపరుచుకునేందుకు.. ఈ ఓబీఓఆర్‌ను ఫాలో అవుతోంది. సరిహద్దుల నుంచి ఎక్కువవుతున్న బెదిరింపులను తగ్గించుకునేందుకు కూడా ఇది పనిచేస్తుందని.. చైనా భావిస్తోంది.

మిగతా దేశాల్లో ఏర్పాటు చేసే చైనా సైన్యాన్ని.. నియంత్రించడంలో అతిథ్య దేశాలే కీలకపాత్ర పోషిస్తాయని చైనా అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే.. హోస్ట్ కంట్రీస్‌తో.. స్థిరమైన, దీర్ఘకాలిక సంబంధాల కోసం ఇది ఉపయోగపడుతుంది. తమ సైనిక స్థావరాలు సక్సెస్ కావాలన్నా కూడా ఇదే బెటర్ ఆప్షన్ అని డ్రాగన్ కంట్రీ భావిస్తోంది. ఆయా దేశాలపై.. యూఎస్ మిలటరీ నిఘాను పర్యవేక్షించేందుకు కూడా చైనా మిలటరీ లాజిస్టిక్ నెట్ వర్క్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. 2017లో.. చైనా అధికారికంగా తన ఫస్ట్ మిలటరీ బేస్‌ని జిబౌటీలో లాంచ్ చేసింది. అక్కడ.. చైనీస్ నేవీ మెరైన్స్, యుద్ధ వాహనాలు, ఆయుధ సామాగ్రిని ఉంచింది. కానీ.. ప్రస్తుతానికి అక్కడే ఉన్న కొన్ని కమర్షియల్ పోర్టుల మీద ఆధారపడని చైనా మిలటరీ బేస్ పనిచేస్తోంది.

ప్రపంచాన్ని శాసించేందుకు.. చైనా మొదటగా 12 దేశాల్లో తన మిలటరీ బేస్‌లను ఏర్పాటు చేయాలని చూస్తోంది. మిగతా దేశాలన్నీ చైనాను ఎదిరించేందుకు వెనకడుగు వేస్తుంటే.. ఇండియా మాత్రమే సరిహద్దు విషయంలో ధైర్యంగా ఎదుర్కొంటోంది. ఊహించని షాక్‌లు ఇస్తోంది. అందుకే.. చైనా భారత్ పొరుగు దేశాల్లో కూడా తన మిలటరీ బేస్‌లను ఏర్పాటు చేయాలని డిసైడైంది. ఇందుకోసం.. పాకిస్థాన్, శ్రీలంక, మయన్మార్‌ను సెలక్ట్ చేసుకుంది.