International Mountain Day 2020 : ఎందుకు జరుపుకుంటాం? ఎప్పుడు ఏర్పడింది? విశేషాలేంటీ

  • Published By: nagamani ,Published On : December 11, 2020 / 02:54 PM IST
International Mountain Day 2020 : ఎందుకు జరుపుకుంటాం? ఎప్పుడు ఏర్పడింది? విశేషాలేంటీ

International Mountain Day 2020: ప్రకృతి మనిషికి అందించిన వనరులు ఎన్నో..ఎన్నెన్నో. గాలి, నీరు,నిప్పు,అడవులు, బొగ్గు, పెట్రోలియం,బంగారం, వజ్రాలు, ఖనిజాలు, వాతావరణం, వర్షపాతం, కొండలు, గుట్టలు,పర్వతాలు ఇలా ప్రకృతి మనిషికి ఎన్నో ఇచ్చింది. ప్రకృతి మనకు అందించిన ఈ సహజ వనరుల్ని వాడుకోవాలి. వాటిని సంరక్షించుకోవాలి. ఆ బాద్యత ప్రతీ మనిషికి ఉంది. కానీ మనిషి మాత్రం అన్నింటిని కలుషితం చేస్తున్నాడు.రాబోయే తరాలకు అందకుండా చేస్తున్నాడు.



  

ప్రకృతి మనిషికి ఇచ్చిన వరాలు పర్వతాలు
ప్రకృతి మనకు ఇచ్చిన సహజవనరుల్లో పర్వతాలు కూడా ఉన్నాయి. డిసెంబర్ 11 అంతర్జాతీయ పర్వతాల దినోత్సవం. ఈ విషయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. మరి ఈ పర్వతాల దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి? ఈ రోజు ఎందుకు ఏర్పడిందో తెలుసుకుందాం..



మొదటి తరం మానవుల నాగరికత ఆనవాళ్లు నదులు, పర్వతాల్లోనే బైటపడ్డాయి. నీరు ఉన్నచోటే ప్రాణి మనుగడ సాగిస్తుంది. అలాగే పర్వతాలు భద్రతనిస్తాయి. అందుకే నదులు, పర్వతాల వద్దనే మొదటితరం మనిసి నాగరికత ఆనవాళ్లు బైటపడ్డాయి. నదులు, పర్వతాలు అనేక జీవజాతులకు నిలయంగా ఉంటాయి.



వాటి పరిరక్షణ కోసం డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ మౌంటెన్ డే (International Mountain Day)ను నిర్వహిస్తారు. అన్ని దేశాల్లోనూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 11న International Mountain Day వేడుకలు జరుపుతారు. పర్వతాలు వివిధ జంతువులు, మొక్కలకు నిలయంగా విలసిల్లుతున్నాయి.



ప్రపంచ జనాభాలో 15శాతం మందికి పర్వతాలపైనే నివాసం
భూమిపైన జీవవైవిధ్యాన్ని (biodiversity) కాపాడుకుంటూ వస్తున్నాయి. ప్రపంచ జనాభాలో 15శాతం మంది ప్రజలు పర్వత ప్రాంతాల్లోనే నివసిస్తున్నారంటే పర్వతాల ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీన్ని గుర్తుచేసుకుంటూ డిసెంబర్ 11న పర్వతాల పరిరక్షణ, అక్కడి జీవవైవిధ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. పర్వతాలను పరిరక్షించుకోవాలనే ఉద్ధేశ్యంతోనే ఇంటర్నేషనల్ మౌంటెన్ డే ఏర్పడింది.



ఇంటర్నేషనల్ మౌంటెన్ డే..ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే..
2020 ఇంటర్నేషనల్ మౌంటెన్‌ డే కు “Mountain biodiversity”ని థీమ్‌గా United Nations ఎంచుకుంది. పర్వతాలపై కనిపించే జీవవైవిధ్యాన్ని కాపాడుతూ, అక్కడ నివసించే ప్రజలకు ఎదురవుతున్న బెదిరింపులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో United Nations ఈ థీమ్‌ను తీసుకుంది.



జీవవైవిధ్యానికి సవాళ్లుగా.. మైనింగ్ పేరిట జరిగే విధ్వంసాలు, జంతువుల అక్రమ రవాణా
కొన్ని వందల ఏళ్లుగా పర్వతాలు అనేక జీవజాతులకు నిలయంగా వెల్లివిరుస్తున్నాయి. పర్వతాలపై వాతావరణ పరిస్థితులు వ్యవసాయానికి, ఉద్యానవన పంటలకు, పశువుల పెంపకానికి అవకాశాలను సృష్టించాయి. కానీ వాతావరణ మార్పులు, మారుతున్న వ్యవసాయ పద్ధతులు, మైనింగ్ పేరిట జరిగే విధ్వంసాలు, జంతువుల అక్రమ రవాణా కోసం సాగించే వేట, అక్కడ నివసించే పక్షులు, వన్యప్రాణుల అక్రమ రవాణా వంటివి జీవవైవిధ్యానికి సవాళ్లు విసురుతున్నాయి. వన్యప్రాణుల మనుగడను ప్రశ్నిస్తున్నాయి. ఇటువంటి అంశాలపై ప్రజలకు అవగాహనతో పాటు ప్రభుత్వాల బాధ్యతను ఈ రోజు గుర్తుచేస్తుంది. దీనిపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మౌంటెన్ బయోడైవర్సిటీ అనే థీమ్‌ను UN ఎంచుకుంది.



International Mountain Day ఎప్పుడు మొదలైంది?
అవసరాలను బట్టి ప్రత్యేక రోజులు మొదలవుతాయనే విషయం తెలిసిందే. అలాగే టర్నేషనల్ మౌంటెన్‌ డే చరిత్ర 1992 నుంచే మొదలైంది. 1992లో UN ఆధ్వర్యంలో జరిగిన Conference on Environment and Development సదస్సులో పర్వతాల పరిరక్షణ అంశం చర్చకు వచ్చింది. అప్పటినుంచి పర్వతాల ప్రాముఖ్యతపై పర్యావరణవేత్తలు సదస్సులు నిర్వహించటం ప్రారంభించారు. ఆ తరువాత 2002 సంవత్సరాన్ని ‘UN International Year of Mountains’గా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. 2003 నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ 11న International Mountain Dayని నిర్వహించటం కొనసాగుతోంది.



International Mountain Day ప్రాముఖ్యత ఏంటి? తెలుసుకోవాల్సిన అవసరమేంటీ?
ప్రపంచ జనాభాలో సగంమందికి పర్వతాలు మంచినీటిని అందిస్తున్నాయి. పర్వతాలు అందించే నీటితోనే అంత స్థాయి జనాభా మనుగడ సాగిస్తోంది. కానీ అక్కడి వాతావరణ మార్పుల వల్ల పర్వతాలపై నివసించే ప్రజల మనుగడ కష్టమవుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, కరిగిపోతున్న మంచుపర్వతాలు..మనకు తెలియకుండానే మనిషిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ఇది మనిషి గుర్తించటంలేదు.



మంచు పర్వతాలు కరిగిపోతుండటంతో కోట్లామంది ప్రజల మంచినీటి సరఫరాపై ప్రభావం పడుతోంది. ఇది ఏ ఒక్క దేశానికో కాదు. ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశంపై ఏదో ఒక విధంగా ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇది ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా గుర్తించాలి. వాతావరణ కాలుష్యానికి కారణమయ్యే చర్యల్ని అడ్డుకోవాలి. సహజవనరులను పరిరక్షించుకోవాలి. ఇది ప్రతీ ఒక్కరి బాధ్యతగా ఉండాలి. దీంతో పాటు పర్వతాల పరిధిలో ఉండే జీవవైవిధ్యాన్ని, అందమైన ప్రకృతిని కాపాడటానికి ప్రజలకు ఈ International Mountain Day అవగాహన కల్పించటానికి ఏర్పడింది.