ఆ గ్రామంలో ఆడపిల్ల పుడితే పండుగే.. దేవతలా పూజిస్తారు..

ఆ గ్రామంలో ఆడపిల్ల పుడితే పండుగే.. దేవతలా పూజిస్తారు..

International Women’s Day Special 2021 : అమ్మ కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు పసిగుడ్డును కూడా చంపేస్తున్న ఈరోజుల్లో ఓ గ్రామం మాత్రం ఆడపిల్ల పుడితే చాలు ఊరు ఊరంతా సంబరాలు చేసుకుంటుంది. ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతోందని తెలుసుకున్న ఆ గ్రామస్థులంతా కలిసి కట్టుగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ గ్రామంలో ఎవరి ఇంటిలో ఆడపిల్ల పుట్టినా ఊరంతా పండుగ చేసుకుంటుంది. ఆ ఆడపిల్లను పెంచటానికిగ్రామస్తులంతా ఆడపిల్ల తల్లిదండ్రులకు డబ్బులు కూడా ఇస్తారు. ఇలాగని గ్రామస్తులంతా తీర్మానించుకున్నారు. అంతేకాదు ఊరంతా స్వీట్లు పంచుకొని పండగ చేసుకుంటారు.

ఆదర్శంగా నిలుస్తున్న హరిదాస్ పూర్ గ్రామం
ఆడపిల్ల పుడితే నేటికి కూడా చాలామంది భారంగా భావిస్తున్నారు. ఆడపిల్ల పుట్టిందా అంటూ ఏదో జరగరానికి జరిగినట్లుగా సానుభూతి చూపెడతారు. కానీ తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం హరిదాస్ పూర్ గ్రామంలో మాత్రం ఆడపిల్ల పుడితే పండుగ చేసుకుంటారు. మిఠాయిలు పంచుకుంటారు. ఆడపిల్ల పుట్టిన ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు చెబుతారు.ఈ ఊరి ప్రజలంతా ఆడపిల్లలను కాపాడుకునేందుకు తమకు తాముగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

హరిదాస్ పూర్ గ్రామంలో గ్రామంలో అమ్మాయిల కంటే అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. సమాజంలో ఆడపిల్లను చిన్నచూపు చూస్తుండడం హరిదాస్ పూర్ ప్రజలను కలచివేసింది. తీవ్ర ఆవేదనకు గురించేసింది. దీంతో పంచాయతీ పాలక వర్గం కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఊళ్లో ఎవరికి ఆడపిల్ల పుట్టినా ఊరంతా పండుగ చేసుకోవాలని నిర్ణయించింది పంచాయితీ పాలక వర్గం. ఆ బిడ్డ పెంపకానికి కొంత డబ్బు ఇవ్వాలని కూడా తీర్మానించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందే పథకాలు కూడా వారికి చేరేలా నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి జిల్లా యంత్రాంగం కూడా దీనికి సహకరించింది. దీంతో 2020 జనవరి 1 నుంచి ఈ నిర్ణయాలను అమలు చేస్తున్నారు. గ్రామస్థులు తీసుకున్న నిర్ణయంతో 2020లో ఎనిమిది అమ్మాయిలు ఆ గ్రామంలో పుట్టారు.

హరిదాస్ పూర్ గ్రామంలో మగవాళ్లు ఎక్కువగా, ఆడపిల్లలు తక్కువగా ఉన్నట్లుగా తేలింది. దీంతో ఆడపిల్లల సంఖ్య పెంచేందుకు కన్యావందనం పేరుతో ఓ పథకాన్ని ప్రారంభించి పల్లె ప్రగతి పనుల్లో భాగంగా ఊరును బాగు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకంలో భాగంగా అకౌంట్ ఓపెన్ చేసి పుట్టిన ఆడబిడ్డ పేరు మీద ఆరు నెలల ఆర్థిక సాయం జమచేస్తున్నారు.దీంతో ఆడపిల్ల భారం కాదని.. ఆడపిల్ల అవసరం గుర్తించి భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తోంది హరిదాస్ పూర్ గ్రామం. గ్రామస్థుల ఔన్నత్యాన్ని తెలుసుకున్న కొంతమంది హరిదాస్ పూర్ వెళ్లి..తమకు తోచిన సహాయ సహకారాలు అందిస్తున్నారు. నిజంగా హారిదాస్ పూర్ హ్యాట్సాఫ్ కదూ..

https://youtu.be/y4zJTinHvjA