kim jong un : ప్రపంచ దేశాల్లో దడ పుట్టిస్తున్న నార్త్ కొరియా నియంత ‘కిమ్’..6 నెలల్లో 31 మిసైల్స్ ప్రయోగాలు

ఉత్తరకొరియా చరిత్రలోనే ఒకే రోజు 8మిసైల్స్ ప్రయోగించడం ఇదే తొలిసారి. కేవలం ఆరు నెలల వ్యవధిలో 31మిసైల్స్ ప్రయోగించడం మరో సెన్సేషన్‌. నార్త్ కొరియా అధ్యక్షుల్లో తక్కువ సమయంలో ఇన్ని మిసైల్స్ ప్రయోగించిన ఏకైక అధ్యక్షుడిగా కిమ్ నిలిచాడు.

kim jong un :  ప్రపంచ దేశాల్లో దడ పుట్టిస్తున్న నార్త్ కొరియా నియంత ‘కిమ్’..6 నెలల్లో 31 మిసైల్స్ ప్రయోగాలు

North Korea's History That 8 Missiles Have Been Fired In A Single Day

North Korea’s history that 8 missiles have been fired in a single day : అమెరికా అయితే ఏంటి.. జపాన్ అయితే నాకేంటి.. ఎదుటోడు ఎవడైనా సరే.. భయపడేదే లేదు.. నేను అనుకున్నదే చేస్తా.. నా జోలికొస్తే అంతు చూస్తా.. ఇది ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్‌ ఉన్ మాట. అతను చెప్పిందే వేదం.. అతని మాటే మరణశాసనం. ఎవరి బెదిరింపులకు భయపడని మొండోడు.. మొరటోడు కూడా. తన టెంపరితనం, దుందుడుకుతో ఎప్పుడూ ఏదో ఒక దేశంతో కయ్యానికి కాలు దువ్వుతునే ఉంటాడు. తాజాగా కిమ్ చేసిన పని ప్రపంచ దేశాల్లో దడ పుట్టిస్తోంది. ముఖ్యంగా అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌ను షేక్ చేస్తోంది. ఇంతకీ కిమ్‌ చేసిన పనేంటి? అగ్ర దేశాలు ఎందుకు భయపడుతున్నాయ్?

ఉత్తరకొరియా క్షిపణులు పరీక్షిచండం కొత్తేమీ కాదు. ఆ పరీక్షలను దక్షణ కొరియా, జపాన్, అమెరికా ఖండించడమూ కొత్తేమీ కాదు. ఎందుకంటే ఉత్తర కొరియా ఎప్పుడూ క్షిపణులను ప్రయోగించే పనిలోనే ఉంటుంది. ఉత్తరకొరియాను కరోనా మహమ్మారి కకావికలం చేస్తున్నా.. క్షిపణి ప్రయోగాలు కొనసాగుతున్నాయంటేనే అర్ధం చేసుకోవచ్చు… ప్రజల ఆరోగ్యం కంటే.. క్షిపణి ప్రయోగాలకే కిమ్ ఎంత ప్రాధాన్యత ఇస్తారనేది. అయితే.. తాజాగా చేపట్టిన క్షిపణి ప్రయోగం అగ్రరాజ్యాలను వణికించింది. ఎటువంటి హెచ్చరికలు లేకుండానే ఉత్తర కొరియా ఒకే రోజు 8షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగించింది. ప్యాంగ్యాంగ్ లోని సునన్ ఏరియా నుంచి 8 బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించి.. అగ్రరాజ్యాలకు సవాల్ విసిరాడు కిమ్. దక్షిణ కొరియా, అమెరికా జాయింట్ మిలటరీ డ్రిల్ పూర్తైన తర్వాత రికార్డు స్థాయిలో మిసైల్స్ టెస్ట్ చేశాడు.

ఉత్తరకొరియా చరిత్రలోనే ఒకే రోజు 8మిసైల్స్ ప్రయోగించడం ఇదే తొలిసారి. కేవలం ఆరు నెలల వ్యవధిలో 31మిసైల్స్ ప్రయోగించడం మరో సెన్సేషన్‌. నార్త్ కొరియా అధ్యక్షుల్లో తక్కువ సమయంలో ఇన్ని మిసైల్స్ ప్రయోగించిన ఏకైక అధ్యక్షుడిగా కిమ్ నిలిచాడు. దశాబ్దం క్రితం ఉత్తరకొరియా అధ్యక్షుడిగా కిమ్ జోన్‌ఉంగ్ బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి రక్షణ రంగంపైనే ఫోకస్ పెట్టాడు. ముఖ్యంగా.. శత్రుదేశాలకు తనేంటో చెబుతూనే.. తన జోలికి వస్తే ఏమవుతుందోననే భయాన్ని పరిచయం చేశాడు. అందుకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కిమ్ ప్రయోగించిన క్షిపణులే ఉదాహరణ. దశాబ్ద కాలంగా ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణులను ఓసారి పరిశీలిస్తే.. 2013లో 6 … 2014లో -19, 2015లో-13, 2016లో-14, 2017లో ఏకంగా 24 మిసైల్స్ టెస్ట్ చేసింది. 2018లో మాత్రం అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చల సందర్భంగా మిసైల్స్ ప్రయోగానికి కిమ్ విరామం ఇచ్చాడు. 2019లో తిరిగి 24 మిసైల్స్ పరీక్షించాడు. 2020లో 9, 2021లో 8మిసైల్స్ ప్రయోగించిన కిమ్.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో బాలిస్టిక్ మిసైల్స్‌ను ఎక్కుపెట్టాడు. కేవలం ఆరు నెలల వ్యవధిలో 31మిసైల్స్ పరీక్షించాడు.

జనవరి 5, 10 తేదీలలో జరిపిన పరీక్షల తరువాత, హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్, మాన్యువరబుల్ రీ-ఎంట్రీ వెహికల్ అనే క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది నార్త్‌కొరియా. ఈసారి మాత్రం ప్రయోగించిన క్షిపణులన్నీ తక్కువ దూరాన్ని కలిగి ఉన్నవే ! ఇవి జపాన్ తీరానికి చాలా దూరంగా సముద్రంలో ల్యాండ్ అయ్యాయి. 2017 ఆగస్టులోనూ ఉత్తరకొరియా జపాన్ మీదుగా క్షిపణులు ప్రయోగించింది. అప్పట్లో మిస్సైల్ పరీక్షల సైరన్ మోతలు జపాన్‌కు వినిపించాయి. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే మిస్సైల్‌ ప్రయోగించింది ఉత్తర కొరియా. ఆ మిస్సైల్‌ జపాన్‌ తీరానికి దూరంలో పడింది కాబట్టి సరిపోయింది.. అదే జపాన్ భూభాగంలో పడితే అక్కడ భారీ నష్టం వాటిల్లేది. అంతేకాదు… రెండు దేశాల మధ్య యుద్ధాన్నే తీసుకొచ్చేది. అసలు ఉత్తర కొరియా వరుసగా ఈ క్షిపణి ప్రయోగాలు ఎందుకు చేస్తోంది ? ఎలాంటి హెచ్చరికలు లేకుండా చేస్తున్న పరీక్షల వెనక ఆంతర్యం ఏంటి ? ఉత్తరకొరియా నియంత కిమ్‌ ఎవరిని భయపెట్టాలనుకుంటున్నాడు? ఇవే ఇప్పుడు ప్రపంచ దేశాలను తొలిచేస్తున్న ప్రశ్నలు.

ఆర్ధిక పరిస్థితి బాగా లేకున్నా.. ఉత్తరకొరియా మిసైల్ పరీక్షలు చేస్తూనే ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత సరిహద్దులను మూసివేయడం, అమెరికా ఆంక్షలతో ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారింది. ఆహార, ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. అక్కడి జనాలు ఆకలికేకలు పెడుతున్నారు. కానీ కిమ్‌ మాత్రం తన మొండితనంతో కొరియన్లును ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. క్షిపణి ప్రయోగాలు చేస్తూ అందరి దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నాడు. అంతే కాదు.. అమెరికా, జపాన్ రక్షణ వ్యవస్థలను నాశనం చేసే సాంకేతికను కూడా ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తోంది. అగ్రరాజ్యాలు పసిగట్టకుండా వేగంగా తప్పించుకోగలిగే, క్లిష్టతరమైన క్షిపణులను తయారుచేయడమే నార్త్ కొరియా లక్ష్యంగా కనిపిస్తోంది. అమెరికాతో పీకల్లోతు శత్రుత్వం ఉన్న చైనా కూడా ఏ రోజూ ఈ స్థాయిలో దూకుడుగా వ్యవహరించలేదు. కానీ ఉత్తరకొరియా మాత్రం సై అంటే సై అంటూ ఎప్పటికప్పుడు కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. వరుస క్షిపణి ప్రయోగాలతో ఇటు దక్షిణ కొరియాతో పాటు అటు అమెరికాను మరోసారి కిమ్‌ రెచ్చగొట్టాడు.