పాక్ విమాన ప్రమాదంలో 97మంది మృతి…క్రాష్ అయ్యేముందు మేడే, మేడే అన్న పైలట్

  • Published By: venkaiahnaidu ,Published On : May 23, 2020 / 06:15 AM IST
పాక్ విమాన ప్రమాదంలో 97మంది మృతి…క్రాష్ అయ్యేముందు మేడే, మేడే అన్న పైలట్

 పాకిస్థాన్‌లోని క‌రాచీ ఎయిర్ పోర్ట్ కు సమీపంలో శుక్రవారం లాహోర్ నుంచి వచ్చిన విమానం ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవ్వడానికి ఒక్క నిమిషయం ముందు ఓ విమానం కూలిన విషయం తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో 97 మంది మృతిచెందినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే విమానం కూల‌డానికి ముందు.. ఎయిర్‌పోర్ట్ దగ్గర్లో విమానం గాల్లో రెండుమూడు సార్లు చ‌క్క‌ర్లు కొట్టిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు.

తొలుత ఆ విమానం ఓ మొబైల్ ట‌వ‌ర్‌ ను ఢీకొట్టింది. ఆ త‌ర్వాత అది స‌మీపంలో ఉన్న ఇళ్లపై కూలిన‌ట్లు సాక్షులు తెలిపారు. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు ప్ర‌యాణికులు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారని, ఆ ఇద్ద‌ర్ని గుర్తించామని, వారిలో ఒక‌రు బ్యాంక్ ఆఫ్ పంజాబ్ ప్రెసిడెంట్ జాఫర్ మసూద్ అని సింధ్ హెల్త్ మినిస్టర్ అజ్రా పెచ్చుహో తెలిపారు. విమనం క్రాష్ అవడంతో 25-30ఇళ్లు కూడా డ్యామేజ్ అయ్యాయని,ఆ ఇళ్లోని వారిని కూడా హాస్పిటల్స్ కు తరలించడం జరిగిందని,అయితే చాలామందికి తీవ్రగాయాలయ్యాయని  ఈధీ వెల్ఫేర్ ట్రస్ట్ తెలిపింది.

విమానంలోని పైల‌ట్‌.. ఏటీసీతో జ‌రిపిన సంభాష‌ణ‌ను కూడా రిలీజ్ చేశారు.  విమానాన్ని ల్యాండ్ చేయ‌డానికి పైల‌ట్ ఇబ్బందిప‌డిన‌ట్లు తెలుస్తోంది. స‌ర్ డైరెక్ట్‌గా వ‌స్తున్నాను, మా ఇంజిన్ ఫెయిల్ అయ్యింద‌ని పైల‌ట్ త‌న సంభాష‌ణ‌లో తెలిపాడు. స‌ర్‌.. మేడే, మేడే, మేడే పాకిస్థాన్ 8303 అంటూ ఉండ‌గానే ట్రాన్స్‌మిష‌న్ కోల్పోయిన‌ట్లు ఏటీసీ అధికారులు చెప్పారు. అంత‌ర్జాతీయ విమానాల పైల‌ట్లు ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో మేడే.. మేడే అంటూ ఏటీసీతో సంభాషిస్తుంటారన్న విషయం తెలిసిందే.  రేడియో క‌మ్యూనికేష‌న్‌లో వాళ్లు ఇలా చెబుతుంటారు.

అయితే ఈ ప్ర‌మాద ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ జ‌రిపించాల‌ని పాకిస్థాన్ పైల‌ట్ల సంఘం డిమాండ్ చేసింది. అనేక ఇండ్లు నేల‌మ‌ట్టం అయ్యాయి. గాయ‌ప‌డ్డ‌వారిలో ఎక్కువ‌శాతం మంది మ‌హిళ‌లే ఉన్నారు. మరోవైపు ఈఘటనపై తక్షణ ఎంక్వైరీకి ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశించారు. మరోవైపు పాక్ విమాన ప్రమాదంపై భారత ప్రధాని మోడీ కూడా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు తర్వగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Read: పాకిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం…ల్యాండ్ అయ్యే నిమిషం ముందు క్రాష్