Melbourne Couple Jail : భారత మహిళను 8 ఏళ్లు బానిసలా హింసించారు.. చివరికి జైలుపాలయ్యారు!

భారతీయ మహిళను ఎనిమిదేళ్లుగా హింసించిన మెల్ బోర్న్ దంపతులకు జైలు శిక్ష పడింది. మౌంట్ వేవర్ లేలోని తమ ఇంట్లో తీవ్ర హింసలు పెట్టినందుకుగానూ వారిద్దరికి వేర్వేరుగా కోర్టు శిక్ష విధించింది.

Melbourne Couple Jail : భారత మహిళను 8 ఏళ్లు బానిసలా హింసించారు.. చివరికి జైలుపాలయ్యారు!

Melbourne Couple Jailed For Enslaving Indian Woman

Melbourne Couple Jailed For Enslaving Indian Woman : భారతీయ మహిళను ఎనిమిదేళ్లుగా బానిసలా హింసించిన మెల్ బోర్న్ దంపతులకు జైలు శిక్ష పడింది. మౌంట్ వేవర్ లేలోని తమ ఇంట్లో తీవ్ర హింసలు పెట్టినందుకుగానూ వారిద్దరికి వేర్వేరుగా కోర్టు శిక్ష విధించింది. మెల్ బోర్న్ దంపతుల్లో కుముత్ని కన్నన్ (53)కు ఎనిమిదేళ్లు జైలు శిక్ష పడగా.. ఆమె భర్త కందాస్వామి కన్నన్ కు ఆరేళ్లు జైలు శిక్ష పడింది. దంపతులిద్దరూ శ్రీలంకకు చెందినవారు. ఒక మహిళ పట్ల మానవత్వం లేకుండా అమానుషంగా ప్రవర్తించిన దంపతులపై విక్టోరియా సుప్రీంకోర్టు జస్టిస్ జాన్ చాంపియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం లేని చర్యగా పేర్కొన్నారు.

53 ఏళ్ల మహిళ తన భర్త కంటే అమానుషంగా ప్రవర్తించినట్టు తేలింది. విక్టోరియా సుప్రీంకోర్టు ప్రకారం.. కుముతికి కనీసం నాలుగు ఏళ్లు జైలు శిక్ష పడాలి.. ఆమె భర్త కనీసం మూడేళ్ల జైలు శిక్ష పడాలి.. కానీ, ఓ నివేదిక ప్రకారం, కందసామికి ఇందులో ప్రమేయం తక్కువగా ఉందని కోర్టు అభిప్రాయపడింది. అందుకే భార్య కంటే భర్తకు తక్కువ శిక్ష పడింది. 2007 నుంచి 2015 వరకు దాదాపు ఎనిమిదేళ్లుగా ఇద్దరూ తమ ఇంట్లో బంధించి హింసించారు. ఆమెతో బలవంతంగా వంట చేయించడం, ఇళ్లు శుభ్రం చేయించడం, వారి పిల్లలను చూసుకోవడం అనేక పనులు చేయించినట్టు కోర్టు విచారణలో తేలింది.

దంపతుల ఇబ్బందులు తట్టుకోలేక స్పృహ కోల్పోయిన మహిళను ఆస్పత్రిలో చేర్పించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ 40 కిలోల బరువు మాత్రమే ఉండగా.. ఆమె శరీరం కూడా బాగా దెబ్బతిని ఉంది. అలాగే డయాబెటిస్ తో బాధపడుతోంది. తమిళనాడుకు చెందిన బాధిత మహిళ ఆస్ట్రేలియాలో ఈ దంపతుల ఇంట్లో పనికి చేరింది.

ఇప్పుడా ఆ మహిళకు 60 ఏళ్ల వయస్సు.. నర్సింగ్ హోమ్‌లో నివసిస్తోంది. బాధితురాలు 2002, 2005లో రెండుసార్లు ఆస్ట్రేలియాకు వచ్చింది. ఆమె 2007లో ఒక నెల టూరిస్ట్ వీసాపై వచ్చింది. కానీ ఈసారి తిరిగి రాలేదు. బాధితురాలిని ఇంట్లో 23 గంటలు పనిచేయించుకునేవారు. వేతనం మాత్రం 3.36 డాలర్లు మాత్రమే ఇచ్చేవారని నివేదికలు పేర్కొన్నాయి. ఇంట్లో ఆమెను హింసిస్తూ కొట్టేవారని సరైన ఆహారం ఇవ్వలేదని తెలిసింది. ఆస్పత్రిలో ఆమెను చేర్చిన సమయంలో ఆ మహిళ వివరాలను దంపతులు దాచిపెట్టారు.