NASA: విశ్వ‌రూపం అద్భుతం.. వెలుగులోకి 1300 కోట్ల ఏళ్ల నాటి అద్భుత దృశ్యాలు

విశ్వం ఏర్ప‌డి దాదాపు 1380కోట్ల సంవ‌త్స‌రాలు అని అంచ‌నా. ఆ వెంట‌నే విశ్వంలో జ‌రిగిన‌ ప‌రిణామాలను తెలుసుకొనేందుకు ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌ల్లో ఆస‌క్తి నెల‌కొంది. ఇందులో భాగంగా జేడ‌బ్ల్యూఎస్‌టీ(జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్)ను నాసా రూపొందించింది. తాజాగా జేడ‌బ్ల్యూఎస్‌టీ తీసిన చిత్రాల‌ను నాసా విడుద‌ల చేసింది.

NASA: విశ్వ‌రూపం అద్భుతం.. వెలుగులోకి 1300 కోట్ల ఏళ్ల నాటి అద్భుత దృశ్యాలు

Nasa1

NASA: విశ్వం ఏర్ప‌డి దాదాపు 1380కోట్ల సంవ‌త్స‌రాలు అని అంచ‌నా. ఆ వెంట‌నే విశ్వంలో జ‌రిగిన‌ ప‌రిణామాలను తెలుసుకొనేందుకు ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌ల్లో ఆస‌క్తి నెల‌కొంది. ఇందులో భాగంగా జేడ‌బ్ల్యూఎస్‌టీ(జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్)ను నాసా రూపొందించింది. వెయ్యి కో్ట్ల డాల‌ర్ల వ్య‌యంతో జేడ‌బ్ల్యూఎస్‌టీ ప్రాజెక్టును నాసా చేప‌ట్టింది. 2021 డిసెంబ‌ర్ లో ఈ టెలిస్కోపును ప్ర‌యోగించారు.

Nasa2

భూమికి 16 ల‌క్ష‌ల కిలో మీట‌ర్ల దూరంలోని ప్ర‌దేశానికి ఇది చేరుకుంది. తాజా నాసా రూపొందించిన‌ ఈ టెలిస్కోప్ విశ్వంలోని అద్భుతాన్ని ఆవిష్క‌రించేలా తొలి ఫొటోను పంపించింది. ఈ ఫొటోల‌ను మంగ‌ళ‌వారం సాయంత్రం అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ వైట్ హౌస్ లో విడుద‌ల చేశారు. ఇవి ఏకంగా 1300 కోట్ల ఏళ్ల నాటి విశ్వాన్ని క‌ళ్ల‌కు క‌డుతున్నాయ‌న్న‌ది న‌మ్మ‌శ‌క్యం కాని వాస్త‌వ‌మంటూ బైడెన్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

Nasa3

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌లోని రెండు కెమెరాలు ప్రపంచంలోనే అతిపెద్దవి, అత్యంత శక్తివంతమైన అంతరిక్ష టెలిస్కోప్. సదరన్ రింగ్ నెబ్యులా అని పిలువబడే ప్లానెటరీ నెబ్యులా NGC 3132 యొక్క తాజా చిత్రాన్ని విడుద‌ల చేశాయి. ఇది భూమికి దాదాపు 2,500 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. జేడ‌బ్ల్యూఎస్‌టీ తీసిన మ‌రో నాలుగు చిత్రాల‌ను నాసా విడుద‌ల చేసింది. 2.9కోట్ల కాంతి సంవ‌త్స‌రాల దూరంలో ఉన్న ఐదు గెలాక్సీల ఫొటో క‌నువిందు చేస్తోంది. ఈ న‌క్ష‌త్ర మండ‌లాలు ప‌ర‌స్ప‌రం చాలా ద‌గ్గ‌రంగా ఉన్నాయి. అల్లిబిల్లిలా సాగే వీటి క‌ద‌లిక‌లు.. నృత్య‌ప్ర‌ద‌ర్శ‌న‌ను త‌ల‌పిస్తున్నాయి. వీటిని స్టీఫెన్స్ క్వింటెట్‌గా పేర్కొంటున్నారు. 225 ఏళ్ల కింద‌ట మాన‌వుల‌కు ఇవి తొలిసారి క‌నిపించాయి. భూమికి 7,600 కాంతి సంవ‌త్స‌రాల దూరంలో ఉన్న కారినా నెబ్యులా ఫొటోనూ పంపింది. ఇది విశ్వంలో అత్యంత దేవీప్య‌మానంగా ఉన్న తారా జ‌న‌న ప్ర‌దేశం.

నీల రంగులో ఉన్న వాస్ప్- 96బి అనే ఒక భారీ గ్ర‌హాన్ని జేడ‌బ్ల్యూఎస్‌టీ ఫొటో తీసింది. ఇది శ‌ని గ్ర‌హం ప‌రిమాణంలో ఉటుంది. భూమికి 1,150 కాంతి సంవ‌త్స‌రాల దూరంలో ఉంది. దాని వాతావ‌ర‌ణాన్ని కూడా జేడ‌బ్ల్యూఎస్‌టీ క్షుణ్ణంగా విశ్లేషించింది. ఇందులో నీటి జాడ ఉన్న‌ట్లు వెల్ల‌డైంది. అయితే ఇక్క‌డ జీవం మ‌నుగ‌డ‌కు ఆస్కారం లేదు. అలాంటి ప‌రిస్థితులు క‌లిగిన మ‌రిన్ని గ్ర‌హాల‌ను ఈ టెలిస్కోప్ ప‌సిగ‌డుతుంద‌న్న భ‌రోసా ఏర్ప‌డింద‌ని నాసా వెల్ల‌డించింది.