చేతులకు గ్లోవ్ వేసుకున్నా కరోనా వైరస్ వేగంగా ఎలా వ్యాపిస్తుందో ఈ నర్సు లైవ్‌లో చూపిస్తుంది చూడండి!

  • Published By: sreehari ,Published On : April 5, 2020 / 05:58 AM IST
చేతులకు గ్లోవ్ వేసుకున్నా కరోనా వైరస్ వేగంగా ఎలా వ్యాపిస్తుందో ఈ నర్సు లైవ్‌లో చూపిస్తుంది చూడండి!

కరోనా వైరస్ నియంత్రణకు అనేక దేశాలు, రాష్ట్రాలు ఇంట్లోనే ఉండాలంటూ ప్రజలను ఆదేశిస్తున్నాయి. ఎక్కడికి ప్రయాణించొద్దంటూ ట్రావెల్ షరతులు కూడా విధించాయి. నిత్యావసర వస్తువుల కోసం వెళ్లక తప్పని పరిస్థితి. ఈ క్రమంలో చాలామంది గ్రాసరీ స్టోర్లకు వెళ్తుంటారు. అక్కడి వస్తువులను తాకుతుంటారు. అయితే ఇప్పుడు వైరస్ వ్యాప్తి కాకుండా ఉండేలా తమ చేతికి గ్లోవ్ లు వేసుకుంటున్నారు. చేతి గ్లోవ్ లు ఎంతవరకు వైరస్ బారి నుంచి కాపాడుతాయంటే కచ్చితంగా అవును అని చెప్పలేం. వైరస్ ఒకరి నుంచి మరొకరి వ్యాప్తి చెందకుండా కేవలం ఒక గ్లోవ్ లతోనే అరికట్టలేమని మిచిగాన్ లోని శాగినాలో నివసించే ఒకప్పటి ఎమర్జెన్సీ రూమ్ నర్సు మోలీ లిక్సే చెబుతోంది. 

ఇటీవలే ఆమె ఓ గ్రాసరీ స్టోర్ కు వెళ్లిన సమయంలో అక్కడ చాలామంది తమ చేతులకు గ్లోవ్‌లు ధరించినట్టు చూసి మంచి ఆలోచన అనుకుందంట. కానీ, అదంతా మంచి విషయం కాదని, అలా చేయడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందుతుందని చెబుతోంది. చేతులకు గ్లోవ్ వేసుకున్నప్పటికీ గ్రాసరీ స్టోర్లో వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో మోలీ లిక్సే తన ఫేస్ బుక్ వీడియోలో లైవ్ లో ప్రదర్శించి చూపించాలని నిర్ణయించుకుంది.

వైరస్ ఎలా సోకుతుందో చెప్పడానికి ఇక్కడ ఆమె కొంత ఆకుపచ్చ (వైరస్ గుర్తుగా) రంగును తీసుకుంది. గ్రాసరీ స్టోర్ లోకి వెళ్లి తన చేతులకు గ్లోవ్స్ వేసుకుంది. కారులోనే తన సెల్ ఫోన్ వదిలేసింది. షాపింగ్ కార్ట్ ను క్లీన్ చేసింది. కొంత టాయిలెట్ పేపర్ ను కూడా పట్టుకుంది. గ్లోవ్ ధరించిన తన చేతి వేళ్లతో ఓ ప్లేట్ పై ఉన్న రంగును తాకింది. 
grocery shop

రంగు అంటిన చేతి వేళ్లతో ఓ కార్డుబోర్డు ముక్కను తన ఫోన్ మాదిరిగా పట్టుకుని వైరస్ ఆకృతిలో అక్కడక్కడ పెయింట్ వేసింది. అదే గ్లోవ్ చేతులతో గ్రాసరీలో ఐటమ్స్ ఒక్కొక్కటిగా తీసుకుని కార్ట్ లో వేస్తోంది. ఇలా వేసిన ప్రతిసారి ఆ రంగును తాకుతూ చూపించింది. అంటే వైరస్ ఇలా వ్యాపించే అవకాశం ఉందని సూచించింది. చివరగా ఫోన్ కాల్ కూడా పిక్ చేస్తూ కాసేపు మాట్లాడినట్టుగా నటించింది. ఫోన్ చెవిపై పెట్టుకుంది. 

గ్లోవ్ కు ఉన్న రంగు ఫోన్ కు అంటింది. అదే రంగు తన చెంపకు కూడా అంటింది. ఇలా ఫోన్ నుంచి కూడా వైరస్ తన ముఖానికి చేరినట్టుగా తెలిపింది. గ్లోవ్స్ వేసుకున్నప్పటికీ కూడా వైరస్ ఒక వస్తువు నుంచి మరొక వస్తువుకు ఇలా చేరుతుందని వీడియోలో ప్రదర్శించింది. చేతికి గ్లోవ్ వేసుకోవడమే కాదు… ఏది తాకినా సరే ముందుగా ప్రతిసారి చేతులను శుభ్రంగా కడుక్కోవడం చేయాలని తన వీడియోలో అవగాహన కల్పించింది.