ప్రాణ స్నేహితులు : బైడెన్ గెలుపు వెనుక ఒబామా

  • Published By: madhu ,Published On : November 8, 2020 / 07:43 AM IST
ప్రాణ స్నేహితులు : బైడెన్ గెలుపు వెనుక ఒబామా

Obama behind Biden’s victory : బైడెన్‌కు పెన్సిల్వేనియాలో మెజారిటీ రావడానికి ఒబామా కీలకంగా వ్యవహరించారు. పెన్సిల్వేనియాలో 20 ఎలక్టోరల్ ఓట్లు రావడానికి ఒబామానే కారణమంటున్నారు డెమొక్రాట్లు. నల్లజాతీయుల ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఒబామా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ గెలుపు వెనుక మాజీ అధ్యక్షుడు ఒబామా కీలక పాత్ర పోషించారు. వీరిద్దరి స్నేహం రెండు దశాబ్దాలకు పైనాటిది. వీరిద్దరి అనుబంధం విచిత్రంగా మొదలైంది.



2008 అమెరికా అధ్యక్ష ఎన్నికలు :-
2008 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలని బైడెన్‌ నిర్ణయించుకొన్నారు. అప్పటికే ఈయనకు సెనెటర్‌గా దాదాపు 35 ఏళ్ల అనుభవం ఉంది. బైడెన్‌కు పోటీగా మరో సీనియర్‌ క్రిస్‌ డోడ్ కూడా రంగంలోకి దిగారు. అప్పటికే యువకుడైన బరాక్‌ ఒబామా ఇల్లినాయిస్‌ సెనెటర్‌గా మంచి పేరు తెచ్చుకొన్నారు. ఆయన కూడా బరిలోకి దిగారు. ఐయోవాలో నిర్వహించిన కాకస్‌లో బైడెన్‌కు ఒకశాతం మాత్రం మద్దతు లభించింది. దీంతో ఆయనకు అర్థమైపోయింది. ఆ తర్వాత రేసు నుంచి వైదొలగారు. బరాక్‌ రేసులో దూసుకెళ్లి డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా నిలిచారు. ఆయన ఉపాధ్యక్షుడిగా బైడెన్‌ను ఎన్నుకొన్నారు. అలా వీరి బంధం మొదలైంది.



ఒబామా నీడలా జో :-
ఒబామా అధ్యక్షుడిగా ఉన్న రెండు పర్యాయలు జోబైడెన్‌ ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. ప్రతి కీలక సమావేశంలో జో ఒబామా నీడలా ఉండేవారు. అప్పట్లో అమెరికా పత్రికల్లో వీరిద్దరి సమన్వయాన్ని బ్రోమాన్స్‌గా వర్ణిస్తూ కుప్పలు తెప్పలుగా ఆర్టికల్స్‌ వచ్చేవి. లెట్స్‌ మూవ్‌ ప్రచారం కోసం వీరిద్దరు కలిసి ఓ వీడియోలో కూడా నటించారు. అది అప్పట్లో సంచలనం అయింది.



అమెరికా అత్యున్నత పురస్కారం :-
ఒబామా పుట్టిన రోజు సందర్భంగా జో బైడెన్‌ ఒక ఫొటో షేర్‌ చేశారు. దీనిలో జో-బరాక్‌ అని రాసి ఉన్న బ్రాసిలెట్‌ ఉంది. అంతే కాదు.. 2017జనవరిలో జో బైడెన్‌ అమెరికా అత్యున్నత పురస్కారం ది ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడం కైవసం చేసుకున్నారు. ఒబామా చేతుల మీదుగా ఆ పురస్కారం అందుకున్నారు. ట్రంప్‌పై ఉన్న వ్యతిరేకతకు తోడు ఒబామా కూడా బైడెన్‌ తరపున ప్రచారం చేయడం డొమొక్రాట్లకు కలిసొచ్చింది.