Omicron In UK : ఏప్రిల్ చివరినాటికి బ్రిటన్ లో 75వేల ఒమిక్రాన్ మరణాలు!

ప్రస్తుతం ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న కరోనా కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"వ్యాప్తి కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోకపోతే వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి బ్రిటన్ లో 25వేల నుంచి 75వేల మధ్యలో

Omicron In UK : ఏప్రిల్ చివరినాటికి బ్రిటన్ లో 75వేల ఒమిక్రాన్ మరణాలు!

Uk3

Omicron In UK : ప్రస్తుతం ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న కరోనా కొత్త వేరియంట్ “ఒమిక్రాన్”వ్యాప్తి కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోకపోతే వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి బ్రిటన్ లో 25వేల నుంచి 75వేల మధ్యలో మరణాలు సంభవించే ప్రమాదముందని తాజాగా ఓ అధ్యయనం తెలిపింది.  ఒమిక్రాన్​తో హాస్పిటల్స్ లో చేరే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని ఓ మోడెలింగ్​ అధ్యయనం హెచ్చరించింది.

కొత్త వేరియంట్​.. రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే దానిపై అందుబాటులో ఉన్న డేటాతో ఈ అధ్యయనం చేసిన లండన్​ స్కూల్​ ఆఫ్​ హైజీన్​ అండ్​ ట్రాపికల్​ మెడిసిన్​కు చెందిన పరిశోధకులు…2021 జనవరితో పోల్చుకుంటే ఒమిక్రాన్​తో కరోనా కేసులు,మరణాలు మరింత ఎక్కువగా నమోదవుతాయని హెచ్చరించారు.

అత్యంత సానుకూల పరిణామాలను(రోగనిరోధక శక్తి దెబ్బతినకుండా ఉండి, వ్యాక్సిన్​ బూస్టర్లు కచ్చితంగా పనిచేస్తే) దృష్టిలో పెట్టుకుంటే..2022 ఏప్రిల్​ 30 నాటికి 24,700 మరణాలు నమోదవుతాయి. రోజుకు 2వేల కేసులు బయటకొస్తాయి. ఈ సమయంలో కొవిడ్​ కట్టి చర్యలు చేపడితే మరణాల సంఖ్య 7,600కి తగ్గే అకాశముంది. ఇక,అత్యంత దారుణమైన పరిస్థితుల్లో(ఒమిక్రాన్ ను అడ్డుకునే సామర్థ్యం వ్యాక్సిన్ లకు, రోగ నిరోధక శక్తికి లేకపోతే), మరిన్ని కట్టడి చేర్యలు తీసుకోకపోతే.. 74,800 మరణాల వరకు నమోదవుతాయి. హాస్పిటల్స్ లో చేరే వారి సంఖ్య 4.92లక్షలు దాటిపోతుంది. ఇదే జరిగితే ప్రభుత్వం అత్యంత కఠినమైన ఆంక్షలు విధించాలని, లేకపోతే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని పరిశోధకులు హెచ్చరించారు.

మరోవైపు, బ్రిటన్ లో సోషల్ గేథరింగ్స్ పై మళ్లీ ఆంక్షలు విధించకపోతే వచ్చే ఏడాది జనవరి నుండి దేశంలో ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్లు భారీగా పెరిగే అవకాశముందని లండ‌న్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ ట్రాపిక‌ల్ మెడిసిన్(LSHTM)ప‌రిశోధ‌కులు గత శ‌నివారం హెచ్చ‌రించారు. క్రిస్మస్ పండుగ కారణంగా జన సమూహాలకు అవకాశం ఎక్కువగా ఉన్నందున..ఆంక్షలు విధంచాల్సిందేనని,లేకుంటే ప్రమాదం ముంచుకొచ్చే అవకాశముందని తెలిపారు. ఒమిక్రాన్​ ముప్పుపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని, ప్రపంచవ్యాప్తంగా మరింత డేటా తెలియాల్సి ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. తమ అధ్యయనం భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే పరిస్థితులకు సిద్ధంగా ఉండేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బ్రిటన్ లో సామాజిక వ్యాప్తి స్థాయికి చేరిందని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్ జావిద్ వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసుల్లో అంతర్జాతీయ ప్రయాణాలకు ఎటువంటి సంబంధం లేనివారు కూడా ఉన్నారని నాలుగు రోజుల క్రితం బ్రిటన్ ప్రతినిధుల సభకు అందించిన నివేదికలో జావిద్ పేర్కొన్నారు. దీని ద్వారా సామాజిక వ్యాప్తి ఉందని స్పష్టమవుతోందని అన్నారు. ఒమిక్రాన్​ను అడ్డుకునేందుకు తాము ఏ అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదని జావిద్ స్పష్టం చేశారు.

ఇక, బ్రిటన్ లో ఆదివారం నాటికి 3,137 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో ఒమిక్రాన్ వేరియంట్ తో తొలి మరణం కూడా బ్రిటన్ లోనే నమోదైంది. బ్రిటన్ లో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తి మరణించాడన్న విషయాన్ని సోమవారం ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.

ALSO READ CBSE English Paper Controversy : సోనియా సీరియస్..ఆ ప్రశ్న తొలగించిన సీబీఎస్ఈ

ALSO READ First Omicron Death : తొలి ఒమిక్రాన్ మరణం నమోదు.. ఎక్కడంటే..