Freedom Convoy: కెనడాలో మరింత సంక్లిష్టంగా “ఫ్రీడమ్ కాన్వాయ్” నిరసనలు: అడ్డుకున్న పోలీసులు

కెనడా దేశంలో ట్రక్ డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి చేయడంపై.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగిన "ఫ్రీడమ్ కాన్వాయ్" నిరసనలు మరింత సంక్లిష్టంగా తయారౌతున్నాయి

Freedom Convoy: కెనడాలో మరింత సంక్లిష్టంగా “ఫ్రీడమ్ కాన్వాయ్” నిరసనలు: అడ్డుకున్న పోలీసులు

Freedom

Freedom Convoy: కెనడా దేశంలో ట్రక్ డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి చేయడంపై.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగిన “ఫ్రీడమ్ కాన్వాయ్” నిరసనలు మరింత సంక్లిష్టంగా తయారౌతున్నాయి. వ్యాక్సిన్ మ్యాండేట్ పై ప్రభుత్వం వెనక్కు తగ్గకపోవడంతో, ట్రక్ డ్రైవర్లు, ఇతర మద్దతుదారులతో కలిసి పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. దేశ రాజధాని ఒట్టావాలో రోడ్లను, పార్లమెంట్ కు చేరుకునే రహదారులను నిరసనకారులు నిర్బంధించారు. గత మూడు వారాలుగా రాజధాని నగరంలో రోడ్లపైనే వాహనాలను నిలిపివేసిన నిరసనకారులు.. అక్కడే గుడారాలు కూడా ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్నారు. కాగా గడ్డకట్టే చలిలో చిన్న పిల్లలతో సహా ప్రజలు రోడ్లపైకి చేరి నిరసనలు తెలపడంపై అక్కడి పోలీసు అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై పోరాటం కోసం చిన్నారులను ఇబ్బంది పెట్టొద్దంటూ నిరసనకారులకు సూచిస్తున్నారు.

Also read: Indian Students : కెనడాలో భారతీయ విద్యార్థుల అవస్థలు.. అండగా భారత హైకమిషన్..!

ఇదిలాఉంటే.. కెనడా పార్లమెంటు భవనం ఎదుట గుడారాలు ఏర్పాటు చేసుకున్న నిరసనకారులను శనివారం పోలీసులు చెదరగొట్టారు. నిరసనకారులపై పెప్పర్ స్ప్రే మరియు స్టన్ గ్రెనేడ్లు ఉపయోగించి వారిని బలవంతంగా అదుపుచేసే ప్రయత్నం చేశారు. గత రెండు రోజుల్లో మొత్తం 176 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన నిరసనకారుల వద్ద శరీర కవచాలు, బ్యాగుల్లో పొగ గ్రెనేడ్లు మరియు ఇతర బాణసంచా సామాగ్రి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నిరసనలను మరింత బలోపేతం చేసి, శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా భారీ కుట్రలు పన్నినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. మరోవైపు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు..నిరసనలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు.

Also read: Ukraine Tension : యుక్రెయిన్‌లో టెన్షన్ టెన్షన్ .. తొలి మరణం నమోదు!

దేశంలో ప్రజల ప్రాధమిక హక్కులను హరించేలా కెనడా ప్రభుత్వం, ప్రధాని జస్టిన్ ట్రూడో వ్యవహరిస్తున్నారంటూ కొన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కాకుంటే(రాజధాని నగరం) మరోచోట.. ఈ నిరసనలను కొనసాగిస్తామని, కరోనా వ్యాక్సిన్ పై ప్రభుత్వం దిగివచ్చేంత వరకు తమ పోరాటం సాగిస్తామని నిరసనకారులు భీష్మించుకున్నట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. మరోవైపు దేశంలో నిరసనలను తొక్కిపెట్టడానికి కెనడా ప్రధాని ట్రూడో.. “నేషనల్ ఎమర్జెన్సీ” విధిస్తు నిర్ణయం తీసుకున్నారు. ప్రజల అభిప్రాయాన్ని తెలుకోవాల్సిందిపోయి, అధికార బలప్రయోగం చేస్తున్నారంటూ ట్రూడో పై ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా కెనడాలో పరిస్థితులను గమనిస్తున్న అంతర్జాతీయ విశ్లేషకులు.. నిరసనలతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వానికే నష్టం చేకూర్చుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిరసనలను తొక్కిపెట్టాలని చూస్తే ఆందోళనకారులు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందంటూ హెచ్చరిస్తున్నారు.

Also read: Flight Travelling: విమాన ప్రయాణికులకు ఆంక్షలు సడలించిన యూఏఈ, సింగపూర్