Belarus Plane Diversion : జర్నలిస్ట్ మీదకు యుద్ధ విమానం పంపి మరీ అరెస్ట్ చేసిన బెలారస్

ఓ జర్నలిస్ట్ ని అరెస్టు చేసేందుకు ఓ దేశ ప్రభుత్వం ఏకంగా యుద్ధ విమానాన్ని పంపించింది.

Belarus Plane Diversion : జర్నలిస్ట్ మీదకు యుద్ధ విమానం పంపి మరీ అరెస్ట్ చేసిన బెలారస్

Outrage As Belarus Forces Plane To Land Arrests Journalist On Board

Belarus Plane Diversion ఓ జర్నలిస్ట్ ని అరెస్టు చేసేందుకు ఓ దేశ ప్రభుత్వం ఏకంగా యుద్ధ విమానాన్ని పంపించింది. అతను ప్రయాణిస్తున్న విమానంలో బాంబు ఉందంటూ దానిని దారి మళ్లించి తమ దేశంలో ల్యాండ్​ అయ్యేలా చేసి..జర్నలిస్ట్ ను అరెస్ట్​ చేసింది. అయితే జర్నలిస్ట్ అరెస్టు కోసం ఆ దేశ ప్రభుత్వం చేపట్టిన చర్యపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

అసలేం జరిగింది
గతేడాది ఆగస్టులో బెలారస్‌ లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకాషెంకో అక్రమంగా గెలిచారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ క్రమంలో జరిగిన అల్లర్లలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆందోళనలపై కన్నెర్ర చేసిన అధ్యక్షుడు లుకాషెంకో..దాని వెనుక కొందరు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల హస్తం ఉందంటూ వారి అరెస్టులకు పూనుకున్నారు. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అక్కడి అధికారులు వారిపై కేసులు పెట్టారు. అయితే, ఆందోళనల్లో కీలక పాత్ర పోషించిన 26 ఏళ్ల జర్నలిస్టు రోమన్‌ ప్రొటాసెవిచ్‌, మరికొందరు దేశం విడిచి పారిపోయారు.

ఆదివారం రోమన్‌ ప్రొటాసెవిచ్‌..ర్యాన్‌ ఎయిర్‌ విమానయాన సంస్థకు చెందిన FR4978 బోయింగ్ 737విమానంలో గ్రీస్ రాజధాని ఏథెన్స్‌ నుంచి లిథేయేనియా రాజధాని విల్నియస్‌ కు ప్రయాణిస్తున్నట్లు బెలారస్‌ ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో ఆ విమానం బెలారస్ గగనతలం గుండా వెళ్తున్న సమయంలో మిగ్-29 ఫైటర్ జెట్ ను పంపింది బెలారస్‌. ర్యాన్‌ ఎయిర్‌ విమానంలో బాంబు ఉందని తమకు సమాచారం వచ్చినట్లు చెప్పి, ఆ విమానాన్ని బలవంతంగా దారిమళ్లించి బెలారస్‌ రాజధాని మింక్‌ విమానాశ్రయంలో అత్యవసరంగా దించింది. ఆ తర్వాత రోమన్‌ ప్రొటాసెవిచ్‌ ను అదుపులోకి తీసుకుంది. తీరికగా సోదా తతంగం నడిపి, బాంబు ఏమీ లేదని నిర్ధరించి.. విమానాన్ని పంపించేసింది. అయితే, విమానాన్ని బెలారస్‌ మళ్లిస్తున్నామని సిబ్బంది ప్రకటించగా.. సీట్లో కూర్చున్న రోమన్‌ ఒక్కసారిగా షాక్‌ తిన్నాడని, బెలారస్ లో తాను మరణశిక్ష ఎదుర్కొంటున్నానని చెబుతూ చాలా భయపడ్డాడని తోటి ప్రయాణికులు తెలిపారు.

ఇక,ఈ ఘటనను అమెరికా,జర్మనీ,ఫ్రాన్స్,గ్రీస్,పోలెండ్ సహా పలు ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. అమెరికా పౌరులు సహా 120 మందికి పైగా ప్రయాణికులను ప్రమాదంలో పెట్టి, బెలారస్‌ అధ్యక్షుడు ప్రవర్తించిన తీరు దిగ్భ్రాంతికరమని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా హైజాకింగ్‌, ఉగ్రవాద చర్యే అని పొలాండ్‌ ప్రధాని మండిపడ్డారు. లిథుయేనియా సహా కొన్ని దేశాలు బెలారస్‌ గగనతలాన్ని నిషేధించాయి. అయితే ప్రపంచదేశాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో..బెలారస్ తన చర్యను సమర్థించుకునే ప్రయత్నం చేసింది. హమాస్ ఉగ్రసంస్థకు నుంచి తమకు బాంబు బెదిరింపు వచ్చినట్లు బెలారాస్ సీనియర్ ట్రాన్స్ పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు.