Putin-New START Treaty: ‘అణ్వాయుధ’ ఒప్పందానికి దూరంగా ఉంటామని పుతిన్ సంచలన ప్రకటన.. ఏమిటీ ఒప్పందం?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. అమెరికాతో కుదుర్చుకున్న న్యూ స్టార్ట్ (స్ట్రాటెజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ) ఒప్పందానికి తాము దూరంగా ఉంటామని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉన్న అణ్వాయుధాల నియంత్రణ ఒప్పంద ఉల్లంఘన జరిగేలా రష్యా ప్రవర్తిస్తోందంటూ కొన్ని రోజుల క్రితమే అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే.

Russia president putin
Putin-New START Treaty: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. అమెరికాతో కుదుర్చుకున్న న్యూ స్టార్ట్ (స్ట్రాటెజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ) ఒప్పందానికి తాము దూరంగా ఉంటామని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉన్న అణ్వాయుధాల నియంత్రణ ఒప్పంద ఉల్లంఘన జరిగేలా రష్యా ప్రవర్తిస్తోందంటూ కొన్ని రోజుల క్రితమే అమెరికా ఆరోపించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే అణ్వాయుధ నియంత్రణ ఒప్పందాన్ని రష్యా పాటించడం లేదని అమెరికా కాంగ్రెస్ కు అగ్రరాజ్య విదేశాంగ శాఖ నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభమై దాదాపు సంవత్సరం కావస్తున్న వేళ పుతిన్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తూ “న్యూ స్టార్ట్”లో ఇక ఉండబోమని కీలక ప్రకటన చేశారు. మరోవైపు, ఒకవేళ అమెరికా అణ్వాయుధ పరీక్షలు చేస్తే రష్యా కూడా ఆ పని చేయడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆయన ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.
“న్యూ స్టార్ట్”పై ప్రేగ్ లో అమెరికా-రష్యా 2010లో సంతకాలు చేశాయి. ఆ తదుపరి ఏడాది నుంచి అమల్లోకి వచ్చింది. ఆ ఒప్పందం 2021 వరకు కొనసాగింది. అనంతరం మరో ఐదేళ్ల పాటు దాన్ని పొడిగించారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన కొన్ని రోజులకే ఈ ఒప్పందాన్ని పొడిగించారు. 2016, ఫిబ్రవరి 4 వరకు ఈ ఒప్పందం కొనసాగాల్సి ఉంది.
ఆ ఒప్పందానికి తాము దూరంగా ఉంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ చేసిన ప్రకటనపై పలువురు నిపుణులు స్పందించారు. పుతిన్ “న్యూ స్టార్ట్” ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేయలేదని, దాన్ని భవిష్యత్తులో మళ్లీ కొనసాగించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. “న్యూ స్టార్ట్” ప్రకారం అమెరికా అణ్వాయుధ కేంద్రాలను రష్యా నిపుణులు పరిశీలించే అవకాశం ఉంటుంది.
అలాగే, రష్యా అణ్వాయుధాలను అమెరికా కూడా పరిశీలిస్తుంది. అయితే, రష్యా అణ్వాయుధాల కేంద్రాలను పరిశీలించడానికి అమెరికాకు పుతిన్ సర్కారు గత ఏడాది ఆగస్టులో అనుమతి ఇవ్వలేదు. ఉక్రెయిన్ యుద్ధంలో ఆ దేశానికి అమెరికా సాయం చేస్తున్న వేళ రష్యా ఈ చర్యకు పాల్పడింది. ఇవాళ పుతిన్ చేసిన ప్రకటనతో అణ్వాయుధ కేంద్రాల పరిశీలన, నియంత్రణ రెండింటికీ రష్యా దూరంగా ఉండనుంది.
మళ్లీ ఇరు దేశాల మధ్య చర్చలు జరిగితేగానీ ఈ ఒప్పందం అమలు కాదు. కాగా, ప్రపంచంలో అత్యధిక అణ్వాయుధాలు రష్యా వద్ద ఉన్నాయి. ఆ దేశం వద్ద దాదాపు 6,000 వార్హెడ్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న వార్హెడ్స్ లో 90 శాతం రష్యా, అమెరికా వద్దే ఉన్నాయని అంచనా. భూమిని సర్వనాశనం చేయడానికి అవసరమైన దాని కంటే ఎన్నో రెట్ల ఎక్కువ శక్తి వాటికి ఉంది.