బీరూట్‌ పోర్టు వద్ద మరోసారి భారీ అగ్ని ప్రమాదం

  • Published By: venkaiahnaidu ,Published On : September 10, 2020 / 06:29 PM IST
బీరూట్‌ పోర్టు వద్ద మరోసారి భారీ అగ్ని ప్రమాదం

లెబనాన్ రాజధాని బీరూట్ ‌ను వరుస ప్రమాదాలు వణికిస్తున్నాయి. బీరూట్ ‌లో పోర్టు ఏరియాలో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆయిల్, టైర్లు నిల్వ ఉంచే ఓ గోడౌన్‌ లో తాజా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. పోర్టు ఏరియా ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

ప్రమాద విషయం తెలియగానే అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. లెబనాన్ ఆర్మీ హెలికాప్టర్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తోంది. పోర్టు సమీపంలోని కార్యాలయాలను ఖాళీ చేయాల్సిందిగా లెబనాన్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది.


ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి కార్మికులు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలను కొంత మంది నెటిజన్లు ట్విటర్‌లో షేర్ చేశారు.

కాగా, బీరూట్ లో ఆగస్టు నెలలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. పోర్టు ఏరియాలో అక్రమంగా నిల్వ ఉంచిన అమ్మోనియం నైట్రేట్ కారణంగా ఆగస్టు 4న ఈ భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 191 మంది మరణించగా.. వేలాది మంది గాయపడ్డారు. వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి.. దీంతో భారీ సంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ ఈ శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.