Russia-ukraine war :వీధుల్లో కుళ్లిన శవాలతో భీతావహంగా యుక్రెయిన్..ఓ పక్క రష్యా దాడులు..మరోపక్క కలరా వ్యాధితో అతలాకుతలం

వీధుల్లో కుళ్లిన శవాలతో భీతావహంగా యుక్రెయిన్ లోని కొన్ని నగరాలు మారిపోయాయి...ఓ పక్క రష్యా దాడులు..మరోపక్క కలరా వ్యాధితో అతలాకుతలంగా ఉంది యుక్రెయిన్ పరస్థితి. 100 రోజులు దాటినా యుద్ధం మాత్రం కొనసాగుతునే ఉంది.

Russia-ukraine war :వీధుల్లో కుళ్లిన శవాలతో భీతావహంగా యుక్రెయిన్..ఓ పక్క రష్యా దాడులు..మరోపక్క కలరా వ్యాధితో అతలాకుతలం

China Taiwan America (3)

Russia ukraine war : యుద్ధం యుక్రెయిన్‌కు అనేక కష్టాలు తెచ్చిపెడుతోంది. తూర్పు యుక్రెయిన్ భీతావహంగా మారింది. లిసిచాన్స్క్, చోర్ట్‌కివ్స్, సెవెరోడొంటెస్క్ వంటి ప్రాంతాల్లో రష్యా దళాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మరోవైపు తాము ఆక్రమించుకున్న ప్రాంతాల్లోని యుక్రెయిన్ పౌరులకు పాస్‌పోర్టులు జారీచేసే ప్రక్రియ రష్యా వేగవంతం చేసింది. అదే సమయంలో ఈయూలో సభ్యత్వం కోసం యుక్రెయిన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.అటు దేశాన్ని కలరా వ్యాధి కలవరపెడుతోంది. యుక్రెయిన్‌లోని మారియుపోల్‌లో కలరా వ్యాధి తీవ్రతరమైంది. కలరా వ్యాప్తి చెందుతోందని.. పారిశుద్ధ్య వ్యవస్థలు విచ్ఛిన్నమయ్యాయని..వీధుల్లో పడిఉన్న శవాలు కుళ్ళిపోతున్నాయని నగర మేయం ఆవేదన వ్యక్తంచేశారు.

100  రోజులకు పైగా సాగుతున్న యుక్రెయిన్ యుద్ధం కొలిక్కిరావడం లేదు. రెండు నెలల నుంచి తూర్పు యుక్రెయిన్‌పై దాడులు చేస్తున్న రష్యా ఈ వారంలో మరింత బీభత్సం సృష్టించింది. సెవెరోడొంటెస్క్‌ నగరంలోని అజోల్ కెమికల్ ప్లాంట్‌పై నిరంతరాయంగా రష్యా దాడులు జరపడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్లాంట్‌లోని అండర్ గ్రౌండ్ బాంబ్ షెల్టర్‌లో 800 మంది యుక్రెయిన్ పౌరులు తలదాచుకున్నారని భావిస్తున్నారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, అయినప్పటికీ నియంత్రణలోన ఉందని సెవెరోడొండెస్క్ మేయర్ చెప్పారు. యుద్ధం నగరంలోని వీధుల్లో ఎక్కువగా జరుగుతోందని, రెండు వైపులా సైనికులకు భారీ నష్టం వాటిల్లుతోందని బ్రిటన్ తెలిపింది.

లుహాన్స్క్ ప్రాంతం మొత్తాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా సేనలు ప్రయత్నిస్తున్నాయి. లిసిచాన్స్క్‌లో భారీగా షెల్లింగ్ జరుపుతోంది. సెవెరో డొంటెస్క్, లిసిచాన్స్క్‌ నగరాలను కలిపే రెండో బ్రిడ్స్‌ను రష్యా బలగాలు ధ్వంసంచేశాయి. లిసిచాన్స్క్, సెవెరోడొండెస్క్ నగరాల్లో జరుగుతున్న యుద్ధంపై జెలన్‌స్కీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు జంటనగరాలు మృతిచెందిన నగరాలని ఆవేదన వ్యక్తంచేశారు. యుక్రెయిన్ పోరాటాన్ని కొనసాగించేందుకు వీలుగా పాశ్యాత్య దేశాలు మరిన్ని ఆయుధాలు అందించాలని ఆ దేశం కోరుతోంది.

Also read : China-Taiwan : తైవాన్ చైనాలో అంతర్భాగమే..కాదంటే యుద్ధం తప్పదు..ఎవ్వరిని లెక్క చేసేదేలేదంటున్న డ్రాగన్ దేశం

చోర్ట్‌కివ్‌లో రష్యా బలగాలు జరిపిన దాడుల్లో 22 మందికి గాయాలయ్యాయి. ఇప్పటిదాకా ఆక్రమించుకున్న ప్రాంతాలపై పట్టు నిలుపుకునేందుకు, అవి తిరిగి యుక్రెయిన్ వశం కాకుండా ఉండేందుకు రష్యా కొత్త ప్రణాళికలు అమలుచేస్తోంది. పూర్తిగా రష్యా ఆధీనంలో ఉన్న జపోరిజ్‌జియా, ఖేర్సన్ నగరాల్లో రెఫరెండం నిర్వహించడానికి ముందే అక్కడి ప్రజలకు రష్యా పాస్‌పోర్టులు అందించే పని ప్రారంభించింది. ఖేర్సన్‌లో ఇప్పటిదాకా 20 మందికి పాస్‌పోర్టులు అందించింది. మెల్టిపోల్‌లోనూ భారీగా పాస్‌పోర్టులు ఇస్తోంది. రష్యా పాస్‌పోర్టుల కోసం స్థానికులే దరఖాస్తు చేసుకుంటున్నారని మాస్కో అంటోంది. వచ్చే వారంలో యుక్రెయిన్ వ్యవహారాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. యూరోపియన్ యూనియన్‌లో యుక్రెయిన్‌కు క్యాండిడేట్ స్టేటస్ ఇచ్చే అంశంపై ఈ వారం చివరినాటికి ఈయూ నిర్ణయం తీసుకోనుంది. యుక్రెయిన్‌ను ఈయూలో చేర్చుకోవడం వల్ల యుక్రెయిన్‌తో పాటు యూరోపియన్ యూనియన్ కూడా బలోపేతమవుతుందని జెలన్‌స్కీ అన్నారు.

మరోవైపు యుద్ధంతో అల్లకల్లోలమవుతున్న యుక్రెయిన్‌కు మరో ప్రమాదం వచ్చి పడింది. నాలుగు నెలల నుంచి నిరంతరాయంగా యుద్ధం జరుగుతుండడంతో అక్కడ పారిశుధ్యం గాడితప్పింది. వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారనికి తోడు….యుద్ధంలో మరణించిన వారి మృతదేహాలు ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో..భయంకర అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. మరియుపోల్, ఖేర్సన్ వంటి నగరాల్లో కలరా కేసులు వేగంగా పెరుగుతున్నాయని యుక్రెయిన్ అధికారులంటున్నారు. రష్యా దాడులు, యుక్రెయిన్ ప్రతిఘటనలో మరియుపోల్‌ భారీగా ధ్వంసమయింది.

అక్కడ మౌలిక సదుపాయాలన్నీ దెబ్బతిన్నాయి. మరియుపోల్‌లో మురుగునీరు, మంచినీరు కలిసిపోయాయని ఇది కలరాకు దారితీసే ప్రమాదముందని ఐక్యరాజ్యసమితి, రెడ్ క్రాస్ గతంలోనే హెచ్చరించాయి. దాడిల్లో మృతిచెందినవారి మృతదేహాలు భవనాల లోపల కూడా ఉన్నాయి. అపరిశుభ్ర పరిస్థితులు, కుళ్లిపోయిన మృతదేహాలు క్రిమికీటకాలు స్థావరంగా మారాయి. కలరాతో మరియపోల్ సహా ఇతర ప్రాంతాల్లో తీవ్ర సంక్షోభం తలెత్తే ప్రమాదముందన్న హెచ్చరికలు వినపడుతున్నాయి. సకాలంలో వైద్యం అందించే పరిస్థితులు లేకపోవడం, వైద్యసిబ్బంది కొరతతో ఎప్పుడేం జరుగుతోందన్న భయాందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ వార్తలపై రష్యా స్పందించడం లేదు.