ఉగ్రదాడిని ఖండించిన రష్యా అధ్యక్షుడు పుతిన్: భారత్ అండగా ఉంటాం

  • Published By: veegamteam ,Published On : February 15, 2019 / 05:41 AM IST
ఉగ్రదాడిని ఖండించిన రష్యా అధ్యక్షుడు పుతిన్: భారత్ అండగా ఉంటాం

మాస్కో : జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపొర పట్టణ సమీపంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై గురువారం (ఫిబ్రవరి 14)న జరిగిన ఆత్మాహుతి దాడిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ సందేశం పంపారు. 

ద్రోహులు శిక్ష అనుభవించక తప్పదు : పుతిన్ 
జమ్మూకశ్మీర్‌లో భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడి దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. జవాన్లు ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. ఈ క్రూరమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామనీ..ఈ  దాడి చేసినవారు, చేయించినవారు కచ్చితంగా ఫలితం అనుభవించి తీరతారనీ..ఉగ్రవాదాన్ని తుదముట్టించే చర్యల్లో భారత్‌తో కలిసి ముందడుగు వేస్తామని హామీ ఇచ్చారు. భారత్‌కు రష్యా అండగా ఉంటుందనీ..ఉగ్రదాడిలో గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాననీ పుతిన్ సందేశంలో పేర్కొన్నారు.

ఉగ్రదాడిని ఖండిస్తున్న దేశాలు 
ఈ దాడికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్‌ ఇప్పటికే ప్రకటించింది. ఈ దాడికి ఉగ్రవాదుల దుశ్చర్యలో 44 మంది జవాన్లు అసువులుబాసారు. ఈ ఘోరఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. కష్ట సమయంలో భారత్‌కు అండగా ఉంటామని ప్రకటిస్తున్నాయి.