మహిళలకు డ్రైవింగ్ హక్కు కోసం పోరాడిన సౌదీ యాక్టివిస్ట్ కు 6ఏళ్ల జైలు శిక్ష

మహిళలకు డ్రైవింగ్ హక్కు కోసం పోరాడిన సౌదీ యాక్టివిస్ట్ కు 6ఏళ్ల జైలు శిక్ష

Saudi Activist Jailed సౌదీ అరేబియాలో మహిళలకు డ్రైవింగ్ హక్కు కోసం పోరాడిన ప్రముఖ మహిళా ఉద్యమకారిణి లౌజైన్ అల్-హాథ్‌లౌల్‌(31) కు సోమవారం సౌదీ కోర్టు అయిదేళ్ల ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది. అయితే, అల్-హాథ్‌లౌల్‌ ఇప్పటికే రెండున్నరేళ్లుగా జైలులోనే ఉన్నారు. సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే అభియోగాలతో 2018 మే నెలలో అల్-హాథ్‌లౌల్‌ సహా మరికొంత మంది మహిళా హక్కుల కార్యకర్తలను సౌదీ పోలీసులు అరెస్టు చేశారు.

ఆమెను విడుదల చేయాలంటూ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు పలుమార్లు కోరాయి. అయితే, తీవ్రవాద సంబంధిత కేసులను విచారించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు… జాతీయ భద్రతకు విఘాతం కలిగించడం, సౌదీ రాజకీయ వ్యవస్థను మార్చేందుకు ప్రయత్నించడం, విదేశీ ఎజెండాతో పనిచేస్తున్నారనే కేసుల్లో ఆమెను దోషిగా తేల్చుతూ సోమవారం తీర్పు చెప్పింది. అయితే, ఆ ఆరోపణలను అల్-హాథ్‌లౌల్‌‌తో పాటు, ఆమె కుటుంబ సభ్యులు ఖండించారు. తన సోదరి యాక్టివిస్ట్ అని..టెర్రరిస్ట్ కాదని అల్-హాథ్‌లౌల్‌‌ సోదరి లినా తెలిపారు. ఆమెను జైలులో చిత్రహింసలకు గురిచేశారని వారు ఆరోపించగా, కోర్టు తోసిపుచ్చింది.

అయితే, సౌదీ కోర్టు తీర్పు మరియు యాక్టివిస్ట్ కు జైలు శిక్ష….అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తో సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముంది. సౌదీ అరేబియా మానవహక్కువల రికార్డును జో డైబెన్ విమర్శించిన విషయం తెలిసిందే. తాజా పరిణామాల పట్ల అమెరికా ఆందోళన వ్యక్తం చేసిందని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి కాలే బ్రౌన్ పేర్కొన్నారు. సౌదీ అరేబియాలో మహిళల హక్కుల విషయమై భావ ప్రకటనా స్వేచ్ఛ మరియు శాంతియుత ఉద్యమం ప్రారధాన్యతను తాము నొక్కి చెప్పామని తెలిపారు. 2021 లో అల్-హాథ్‌లౌల్‌ విడుదలవుతదని తాము ఎదురుచూస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

మరోవైపు, సౌదీ మహిళలపై దశాబ్దాలుగా కొనసాగిన డ్రైవింగ్ నిషేధాన్ని అధికారికంగా 2018లో ఎత్తివేసిన విషయం తెలిసిందే. అయితే, సౌదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడమనేది మామూలుగా జరగిందేమీ కాదు. మహిళల డ్రైవింగ్ హక్కు కోసం ఎందరో కార్యకర్తలు ఉద్యమం సాగించారు. ప్రభుత్వం వారిని అణచివేసింది కూడా. కనీసం ఎనిమిది మంది మహిళా కార్యకర్తలను అరెస్టు చేశారు. వారిపై కౌంటర్ టెర్రరిజం కోర్టులో విచారణ జరిపి వారికి సుదీర్ఘ జైలు శిక్షలు విధించారని హక్కుల సంస్థ ఆమ్నెస్టీ తెలిపింది. వారిలో ఒకరే ప్రస్తుతం వార్తల్లో నిలిచిన లౌజైన్ అల్-హాథ్‌లౌల్. మహిళల డ్రైవింగ్ హక్కుల కోసం ఉద్యమించిన వారిలో ఆమె కీలక వ్యక్తి.