Ramasethu : రామసేతుపై మళ్లీ మొదలైన పరిశోధనలు..శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు?

రామసేతుపై మళ్లీ పరిశోధనలు మొదలయ్యాయి. రామసేతు సహజ సిద్ధంగా ఏర్పడిందా? లేక మానవ నిర్మితమా? అనే విషయాన్ని తేల్చే పనిలో శాస్త్రవేత్తలు తలమునకలయ్యారు.

Ramasethu : రామసేతుపై మళ్లీ మొదలైన పరిశోధనలు..శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు?

How was the Rama Setu Built.? : నీటిపై తేలియాడే రాళ్లు.. పునాది లేని వారధి.. రామేశ్వరం నుంచి శ్రీలంక వరకు వంతెన.. సున్నపురాయి, ఇసుకతో రామసేతు. ఇది రామయణ కాలంనాటిదని హిందువుల ప్రగాఢ విశ్వాసం. నారాయణుడే నరుడిగా వచ్చి వారధి కట్టాడని నమ్ముతారు. కానీ దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికీ రామసేతుపై ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. రామసేతుపై సైంటిస్టులు ఏం చెప్తున్నారు? అసలు మరోసారి రామసేతు ఎందుకు తెరపైకి వచ్చింది?

రామసేతుపై మళ్లీ పరిశోధనలు మొదలయ్యాయి. ఇది సహజ సిద్ధంగా ఏర్పడిందా? లేక మానవ నిర్మితమా? అనే విషయాన్ని తేల్చే పనిలో శాస్త్రవేత్తలు తలమునకలయ్యారు. సీతాదేవిని అపహరించిన పది తలల రావణసూరుడిని అంతమొందించేందుకు లంకకు బయల్దేరుతాడు శ్రీరాముడు. సుగ్రీవుడి సైన్యాధిపతి నీలుడు.. తన వానర సైన్యాన్ని తీసుకుని ధనుష్కోటికి చేరుకుంటాడు. కానీ లంకకు వెళ్లాలంటే ముందుగా సముద్రాన్ని దాటాలి. హనుమంతుడైతే ఒక్క గెంతులో సముద్రాన్ని దాటేశాడు. కానీ వానరులంతా దాటడం సాధ్యం కాదు.. అందుకే.. వారధి కట్టాలని నిర్ణయం తీసుకుంటారు. కానీ.. అంతపెద్ద మహాసముద్రంలో వారధి కట్టడం ఎలా..? దీనికి తన స్నేహితుడు నలుడిని పిలిపిస్తాడు. ఇద్దరూ కలిసి వానరసేన సాయంతో రాళ్లను సముద్రంలో పేర్చి వారధి నిర్మిస్తారు.. ఆ వారధి పైనుంచే సముద్రాన్ని దాటి.. లంకకు చేరుకుని రావణాసురుడిని వధిస్తాడు శ్రీరాముడు.

ఇది ఇంత వరకు అందరికి తెలిసి పురాణ గాధే. ఇలా సీతాదేవి జాడ కోసం భారత్, శ్రీలంక మధ్య రాముడు వారధి నిర్మించాడని పురణాలు చెప్తున్నాయి. ఆ వారధి ఇంకా ఉంది. అయితే సముద్రం నీటిలో ఉంది. 2003లో నాసా పరిశోధనలో కొన్ని నిజాలు బయటికి వచ్చాయి. భారత్‌-శ్రీలంక మధ్య సముద్రంలో ఇంకా సేతువు ఉందని శాటిలైట్ చిత్రాలతో గుర్తించింది నాసా. అది మానవ నిర్మితం సృష్టించిన అద్భుతం అని ప్రకటించింది నాసా. ఆ తర్వాత కొన్నాళ్లకే మాట మార్చిన నాసా…. మానవ నిర్మితం అని చెప్పడానికి ఆధారాల్లేవని కొట్టిపారేసింది. ఇసుక రేణువులతో సముద్రంలో వచ్చిన మార్పులతో వారధి ఏర్పడిందని చెప్పింది. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి రామసేతు వారధి తెరపైకి వచ్చింది.

రాబోయే రెండేళ్లలో రామసేతు వారధిని అసలు నిజం తేల్చేందుకు రంగంలోకి దిగింది నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ. వారధి ప్రాంతంలో డ్రిల్లింగ్ ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమైంది. సముద్రం నీటి అడుగున పర్యటించనుంది. ప్రస్తుతం వారధి స్థలంలో ఎక్కడా చూసినా ఇసుక ఉందంటున్న NIO డ్రిల్లింగ్ చేసి నమూనాలను సేకరిస్తామంది. ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి రెండేళ్ల సమయం పట్టనుంది. మరోవైపు రామసేతును జాతీయ వారసత్వ కట్టడంగా ప్రకటించాలని సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. వారసత్వ చిహ్నంగా ప్రకటించాలని బీజేపీ నేతలు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. గతంలో డిస్కవరీకి చెందిన సైన్స్‌ ఛానెల్‌ వాట్‌ ఆన్‌ ఎర్త్‌ పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. నాసా ఉపగ్రహ చిత్రాలు, పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధనల ఆధారంగా.. ఈ వంతెన మానవ నిర్మితమేనని ఛానెల్‌ వెల్లడించింది. ఇసుక తిన్నెపై సున్నపు రాళ్లను జతచేసినట్లు కనిపించే ఈ నిర్మాణాన్ని శాస్త్రీయ కోణంలో పరిశోధకులు విశ్లేషించారు. ఇక్కడి ఇసుక తిన్నెలు సహజమైనవేనని, కానీ దానిపై రాళ్లు మాత్రం వేరొకచొటి నుంచి తీసుకొచ్చారని తేల్చారు. దీని కోసం రాళ్లు, ఇసుక వయసును నిర్ధారించే పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.

భారత్, శ్రీలంకలను కలుపుతున్నట్టుగా ఉండే రామసేతులో మరెక్కడా లేని విధంగా ఇసుక, సున్నపురాళ్ల మిశ్రమంతో కూడిన రాళ్లు వారధిపై కనిపిస్తాయి. దాదాపు 40 కిలోమీటర్ల పొడవుండే రామసేతు ఎప్పుడు ఏర్పడిందన్న దానిపై అనేక రకాల వాదనలున్నాయి. అయితే.. 2004లో వచ్చిన సునామీ తీవ్రతను కూడా ఈ రామసేతు తగ్గించిందన్న అభిప్రాయం ఉంది.రామసేతు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఆడమ్స్ బ్రిడ్జిగానూ ప్రాచుర్యంలో ఉన్న ఈ వారధి అసలు రహస్యాన్ని తెలుసుకునేందుకు సీఎస్ఐఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సంయుక్తంగా అడుగులు ముందుకు వేసింది. రెండు సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఆర్కియాలజీ ఆమోదం తెలిపింది. పురాతన వస్తువులు, రేడియో మెట్రిక్, పదార్థాల ఉష్ణోగ్రత, కాంతి పరిశీలన, పర్యావరణ సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం చేపడుతున్నారు.

గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ-1 ప్రభుత్వం రామసేతు నిర్మాణాన్ని ధ్వంసం చేసి సేతు సముద్రం షిప్ ఛానల్ నిర్మించాలని అనేక ప్రయత్నాలు చేసింది. రామసేతు అడ్డుగా ఉండడం వల్ల భారత వాణిజ్య నౌకలు శ్రీలంక చుట్టు 400 కిలోమీటర్లు అధిక దూరం ప్రయాణించాల్సి వస్తుంది. దీనికి పరిష్కారంగా భారత ప్రభుత్వం జూలై 2, 2005లో సేతు సముద్రం షిప్పింగ్‌ కెనాల్‌ ప్రాజెక్టును ఆమోదించింది. అయితే ఆ ప్రాజెక్టు ద్వారా రామసేతును 20 మీటర్ల లోతు, 200మీటర్ల వెడల్పు తవ్వవలసి ఉంటుంది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ ఆందోళనలు వెల్లువెత్తాయి. కొన్ని హిందూ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో.. సేతుసముద్రం ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లవద్దంటూ 2007లో సుప్రీంకోర్టు స్టే విధించింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా రామసేతుకు హాని కలిగించకుండా సేతు సముద్రం ప్రాజెక్టు చేపడుతామని అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ-1 ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మన్నార్ పాక్ జలసంధితో కలుపుతూ 83 కిలోమీటర్ల పొడవునా లోతైన రామసేతు సున్నపురాయిని తొలగించి సేతు సముద్రం నిర్మించాలని అనేక ప్రయత్నాలు చేసింది. అయితే 2013లో ఆర్కే ప‌చౌరీ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 2013లో భారత ప్రభుత్వం శాశ్వతంగా ప్రాజెక్టును నిలిపివేసింది.