Pakistan: ఇదేం పాడు రాజకీయం? ప్రధాని పదవి పోగానే జైలుకే.. ఇమ్రాన్ కంటే ముందు చాలా మంది మాజీ ప్రధానులు జైలుకు వెళ్లారు, ఒకిరిని ఉరి తీశారు కూడా..

ఈ సారి ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. అయితే వైద్య చికిత్స కోసం నవంబర్ 2019లో దేశం విడిచి వెళ్ళడానికి అనుమతించారు. అప్పటి నుంచి ఆయన పాకిస్థాన్‌కు తిరిగి రాలేదు. ఇప్పుడు ఆయన సోదరుడు షాబాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్నారు.

Pakistan: ఇదేం పాడు రాజకీయం? ప్రధాని పదవి పోగానే జైలుకే.. ఇమ్రాన్ కంటే ముందు చాలా మంది మాజీ ప్రధానులు జైలుకు వెళ్లారు, ఒకిరిని ఉరి తీశారు కూడా..

Jailed Prime Ministers: తోషాఖానా కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ దోషి అని ట్రయల్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ఈ కేసులో ఆయనకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు ఒక లక్ష పాకిస్తాన్ రూపాయల జరిమానా విధించింది. ఈ జరిమానాను చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలపాటు జైలు శిక్షను అనుభవించాలని తీర్పు వెలువరించింది. అంతేకాకుండా, క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనకుండా ఆయనపై ఐదేళ్లపాటు నిషేధం విధించింది. ఇమ్రాన్‌పై నమోదైన ఆరోపణలు రుజువైనట్లు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి హుమయూన్ దిలావర్ తెలిపారు.

కాగా, పాకిస్తాన్ మాజీ ప్రధాని అరెస్ట్ కావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఏడుగురు పాకిస్తాన్ మాజీ ప్రధానులు జైలుకు వెళ్లారు. మరో విశేషం ఏంటంటే.. ఒక ప్రధానిని ఉరి తీశారు కూడా. అయితే పాకిస్తాన్ ఏ మాజీ ప్రధాని జైలుకు వెళ్లాల్సి వచ్చిందో, వారిపై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయో తెలుసుకుందాం.

హుస్సేన్ షాహీద్ సుహ్రావర్ది
పాకిస్తాన్ ఐదవ ప్రధానమంత్రి హుస్సేన్ షాహీద్ సుహ్రావర్ది సెప్టెంబరు 1956 నుంచి అక్టోబర్ 1957 వరకు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నారు. మహ్మద్ అలీ జిన్నా సన్నిహితుల్లో సుహ్రవర్ది ఒకరు. ఆ సమయంలో ఆయన జనరల్ అయూబ్ ఖాన్ సైనిక తిరుగుబాటుకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించాడని చెబుతారు. ఈ కారణంగా ఆయన ఎన్నికల సంస్థ అనర్హత ఉత్తర్వు (EBDO) ద్వారా రాజకీయాల నుంచి నిషేధించబడ్డారు. జూలై 1960లో ఇది ఉల్లంఘించబడిందని ఆరోపణలు ఎదుర్కొన్నారు. 1962లో పాకిస్తాన్ సెక్యూరిటీ యాక్ట్ 1952 ప్రకారం దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై జైలుకెళ్లారు. ఎలాంటి విచారణ లేకుండా కరాచీ సెంట్రల్ జైలులో ఏకాంత ఖైదులో ఉంచారు.

జుల్ఫికర్ అలీ భుట్టో
జుల్ఫికర్ అలీ భుట్టో ఆగస్టు 1973 నుంచి జులై 1977 వరకు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది. 1974లో రాజకీయ ప్రత్యర్థిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో 1977లో అరెస్టయ్యారు. తర్వాత లాహోర్ హైకోర్టు న్యాయమూర్తి ఖ్వాజా మహ్మద్ అహ్మద్ సమ్దానీ అరెస్టుకు ఎటువంటి ఆధారం లేదని చెప్పి విడుదల చేశారు. అయితే, ఆయన మూడు రోజుల తర్వాత మార్షల్ లా రెగ్యులేషన్ 12 కింద మళ్లీ అరెస్టు అయ్యారు. ఏప్రిల్ 4, 1979న ఆయనను ఉరితీశారు.

బేనజీర్ భుట్టో
పాకిస్తాన్ తొలి మహిళా ప్రధాని బెనజీర్ భుట్టో కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. భుట్టో రెండు సార్లు పాకిస్తాన్ ప్రధానిగా ఉన్నారు. ఆమె మొదటిసారి డిసెంబర్ 1988 నుంచి ఆగస్టు 1990 వరకు, ఇక రెండవసారి అక్టోబర్ 1993 నుంచి నవంబర్ 1996 వరకు పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. 1977 నుంచి 1988 వరకు జియా-ఉల్-హక్ నియంతృత్వ పాలనలో ఆమె ప్రతిపక్ష నాయకురాలిగా పని చేశారు.

అయితే 1985 ఆగస్టులో ఆమె సోదరుడు మరణించిన తరువాత, ఆమె పాకిస్తాన్‌కు తిరిగి వచ్చారు. అప్పుడే ఆమెను అరెస్ట్ చేసి 90 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. ఇది కాకుండా 1986లో స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇక 1998, 1999, 2007లో కరాచీలో జరిగిన ర్యాలీలో ప్రభుత్వాన్ని విమర్శించినందుకు అరెస్టయ్యారు. 1999లో అవినీతి ఆరోపణలపై ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఆ తర్వాత ఆమె ఏడేళ్లపాటు ప్రవాస జీవితం గడిపారు. 2007లో పాకిస్తాన్‌కు తిరిగి వచ్చిన ఆమె ఆత్మాహుతి దాడిలో మరణించారు.

యూసుఫ్ రజా గిలానీ
2008లో పాకిస్తాన్‌లోని అనేక రాజకీయ పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి యూసఫ్ రజా గిలానీ ప్రధానమంత్రిగా ఉన్నారు. అవినీతి కేసులో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. నకిలీ కంపెనీల పేరుతో నగదు లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

నవాజ్ షరీఫ్
1999లో కార్గిల్ యుద్ధం తర్వాత నవాజ్ షరీఫ్‌ను జనరల్ పర్వేజ్ ముషారఫ్ బహిష్కరించారు. అయితే ఆయన తరువాత పాకిస్తాన్‌కు తిరిగి వచ్చారు. కాగా ఇస్లామాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే ఆయనను అరెస్టు చేశారు. అయితే ప్రవాసంలో మిగిలిన మూడు సంవత్సరాలు సేవ చేయడానికి సౌదీ అరేబియాలోని జెడ్డాకు పంపించారు. అవినీతి ఆరోపణలపై నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) నవాజ్‌తో పాటు ఆయన కుమార్తె మరియం నవాజ్‌కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. రెండు నెలల జైలు శిక్ష తర్వాత హైకోర్టు తుది నిర్ణయం పెండింగ్‌లో ఉంచి చివరికి శిక్షను కోర్టు సస్పెండ్ చేసింది.

2018లో సౌదీ అరేబియాలోని ఉక్కు కర్మాగారాల యాజమాన్యం కోసం షరీఫ్‌కు మరోసారి శిక్ష పడింది. ఈ సారి ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. అయితే వైద్య చికిత్స కోసం నవంబర్ 2019లో దేశం విడిచి వెళ్ళడానికి అనుమతించారు. అప్పటి నుంచి ఆయన పాకిస్థాన్‌కు తిరిగి రాలేదు. ఇప్పుడు ఆయన సోదరుడు షాబాజ్ షరీఫ్ ప్రధానిగా ఉన్నారు.

షాహిద్ ఖాకాన్ అబ్బాసీ
2017 నుంచి 2018 వరకు పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న షాహిద్ ఖాకాన్ అబ్బాసీని 2013లో ఎల్‌ఎన్‌జీ కోసం బిలియన్ల రూపాయల దిగుమతి కాంట్రాక్టులను ఇవ్వడానికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై జూలై 19న అరెస్టు చేశారు. పెట్రోలియం-సహజ వనరుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ ఆరోపణ వచ్చింది. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) ఆయనను 12 మంది సభ్యుల బృందంతో కస్టడీలోకి తీసుకుంది. అనంతరం ఫిబ్రవరి 27, 2020న అడియాలా జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు.

షెహబాజ్ షరీఫ్
ప్రస్తుత పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా గతంలో అరెస్టయ్యారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు 2020 సెప్టెంబర్ 28న నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యారు. ఆయన బెయిల్ పిటిషన్‌ను లాహోర్ హైకోర్టు తిరస్కరించింది. లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే వరకు దాదాపు ఏడు నెలల పాటు నిర్బంధంలో ఉంచారు.

ఇమ్రాన్ ఖాన్
ఇమ్రాన్ ఖాన్ 18 ఆగస్టు 2018 నుంచి 10 ఏప్రిల్ 2022 వరకు పాకిస్తాన్ 22వ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇమ్రాన్‌పై 140కి పైగా కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన బహుమతులను విక్రయించడం, అల్ ఖదీర్ ట్రస్టు భూములను తారుమారు చేయడం వంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. మే 9, 2023న ఇమ్రాన్ ఖాన్‌ను పాకిస్తాన్ రేంజర్లు అరెస్ట్ చేశారు. కాగా, శుక్రవారం తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ను సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో ఆయనకు మూడేళ్ల శిక్ష పడింది. శిక్ష పడిన వెంటనే ఇస్లామాబాద్ పోలీసులు ఇమ్రాన్‌ను అరెస్టు చేశారు.