Hinduja: హిందూజ గ్రూప్‌ ఛైర్మన్‌ శ్రీచంద్ పర్మానంద్ కన్నుమూత.. గ్రూప్ తదుపరి ఛైర్మన్?

శ్రీచంద్ పర్మానంద్ హిందూజ భార్య మధు హిందూజ కూడా నాలుగు నెలల క్రితమే కన్నుమూశారు.

Hinduja: హిందూజ గ్రూప్‌ ఛైర్మన్‌ శ్రీచంద్ పర్మానంద్ కన్నుమూత.. గ్రూప్ తదుపరి ఛైర్మన్?

Srichand Parmanand Hinduja

Updated On : May 18, 2023 / 7:28 AM IST

Srichand Parmanand Hinduja: అనారోగ్యంతో బాధపడుతూ హిందూజ గ్రూప్‌ (Hinduja Group) ఛైర్మన్‌ శ్రీచంద్ పర్మానంద్ హిందూజ (87) కన్నుమూశారు. లండన్‌ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిత్తవైకల్యం, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడినట్లు తెలుస్తోంది.

తమ అందరికీ ఆయన మార్గదర్శకుడని హిందూజ కుటుంబం పేర్కొంది. ఆయన నివసించిన యూకే, సొంతదేశం భారత్ మధ్య సత్సంబంధాలను మరింత దృఢం చేయడలో సోదరులతో కలిసి ప్రధాన పాత్ర పోషించారని చెప్పింది. శ్రీచంద్ పర్మానంద్ హిందూజ 1935, నవంబర్ 28న అప్పటి బ్రిటిష్ ఇండియాలోని కరాచీలో జన్మించారు.

స్వీడన్‌ సంస్థ ఏబీ బోఫోర్స్‌కు భారత సర్కారు కాంట్రాక్టు దక్కేలా చేసేందుకు శ్రీచంద్ పర్మానంద్ హిందూజ తన సోదరులతో కలిసి కమీషన్ తీసుకున్నట్లు అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అవి రుజువు కాలేదు. 2005లోనే ఢిల్లీ హైకోర్టు హిందూజ సోదరులను నిర్దోషులుగా పేర్కొంది.

తదుపరి ఛైర్మన్?

శ్రీచంద్ పర్మానంద్ హిందూజ భార్య మధు హిందూజ కూడా నాలుగు నెలల క్రితమే కన్నుమూశారు. శ్రీచంద్ పర్మానంద్ హిందూజకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆయన ఒక్కగానొక్క కుమారుడు కూడా మృతి చెందారు. తన సోదరులతో కలిసి బ్యాంకింగ్, ఆటోమోటివ్, హెల్త్‌కేర్, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో హిందూజ తిరుగులేని విజయాలు సాధించారు.

ఇకపై ఆయన సోదరుడు గోపీచంద్ హిందూజా (83) హిందూజ గ్రూప్ ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తోంది. శ్రీచంద్ పర్మానంద్ హిందూజకు మరో తమ్ముడు (ప్రకాశ్ హిందూజ) కూడా ఉన్నారు. హిందూజ గ్రూప్ కు రూ.4.94 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉన్నట్లు తెలుస్తోంది.

Twitter CEO Elon Musk : పొరపాటు మాదే.. కొంతమంది ట్విట్టర్ ఉద్యోగుల తొలగింపు సరైనది కాదు.. మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటున్నాం..!