Taliban: తాలిబాన్ల దండయాత్ర.. కాబూల్‌కు ఏడు మైళ్లే.. 20రాజధానులు స్వాధీనం

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు ఫ్రావిన్సులను ఆధీనంలోకి తీసుకుని హింసాకాండ సాగిస్తున్నారు. కాబూల్‌కు ఏడు మైళ్ల దూరంలోని అసియాబ్ జిల్లాకు చేరుకున్నారు.

Taliban: తాలిబాన్ల దండయాత్ర.. కాబూల్‌కు ఏడు మైళ్లే.. 20రాజధానులు స్వాధీనం

Taliban

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ వేగంగా పురోగతి సాధిస్తున్నారు. ఇప్పటికే ఫ్రావిన్సులను ఆధీనంలోకి తీసుకుని హింసాకాండ సాగిస్తున్న తాలిబన్లు.. కాబూల్ సమీపంలోని లోగర్ ప్రావిన్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. తాలిబాన్లు కాబూల్‌కు ఏడు మైళ్ల దూరంలోకి అంటే 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న చార్ అసియాబ్ జిల్లాకు చేరుకున్నారు. ప్రభుత్వ దళాలతో పోరాటం చేస్తున్నారు. లోగర్ నుండి ఎంపీ హోడా అహ్మదీ దీనిని ధృవీకరించారు. కాబూల్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోగర్ రాజధాని పుల్-ఇ-ఆలంను తాలిబాన్లు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో నాల్గవ అతిపెద్ద నగరం మజార్-ఇ-షరీఫ్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు.

శాంతి కోసం అష్రఫ్ ఘనీ విజ్ఞప్తి:
తాలిబాన్లు ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్‌లోని 34 ప్రావిన్షియల్ రాజధానులలో 20 రాజధానులను స్వాధీనం చేసుకున్నారు. వీటితో సహా, ఆఫ్ఘనిస్తాన్‌లో మూడింట రెండు వంతుల ప్రాంతం తాలిబన్ల చేతికి వెళ్లిపోయింది. ఈ సమయంలో హింసను కొనసాగించొద్దు అంటూ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తాలిబాన్‌లకు పిలుపునిచ్చారు, కానీ తాను రాజీనామా చేసే సంకేతాలను మాత్రం ఇవ్వలేదు. ఘనీ రాజీనామా షరతును తాలిబాన్లు ఇప్పటికే పెట్టాయి.

లోగర్ ప్రావిన్స్ గవర్నర్ అబ్దుల్ ఖయ్యూమ్ రహీమి తాలిబాన్‌లో చేరినట్లు తాలిబాన్ అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ చెప్పారు. దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లోని పెద్ద నగరం మజార్-ఇ-షరీఫ్‌ను స్వాధీనం చేసుకోవడానికి అనేక వైపుల నుండి తాలిబాన్లు దాడి చేశారు. బాల్ఖ్ ప్రావిన్స్ రాజధాని మజార్-ఇ-షరీఫ్ తాలిబాన్ నియంత్రణలోకి వచ్చిందని ఆఫ్ఘన్ చట్టసభ సభ్యుడు చెప్పారు. భయంతో ఉన్న సాధారణ ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి మార్గాలను చూస్తున్నారు.

ప్రావిన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి మునీర్ అహ్మద్ ఫర్హాద్ ఈ విషయాన్ని ధృవీకరించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా తాలిబాన్లు మరియు ప్రభుత్వ దళాల మధ్య పోరాటం జరుగుతోంది. రాయిటర్స్ ప్రకారం, తీవ్రమైన పోరాటాల మధ్య హింసను ఆపాలని ఖతార్ తాలిబాన్లకు విజ్ఞప్తి చేసింది. తాలిబన్లకు నిరంతరం మద్దతు ఇస్తున్న ఏకైక దేశం ఖతార్. ఖతార్ రాజధాని దోహాలో తాలిబాన్ల రాజకీయ కార్యాలయం పనిచేస్తోంది.

కాబూల్ చేరుకున్న అమెరికా మెరైన్ కమాండోల బృందం:
ఆఫ్ఘనిస్తాన్‌లోని అమెరికా బలగాలు దాదాపుగా తిరిగి వెళ్లిపోగా.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిపై శనివారం తన ప్రత్యేక సహాయకులతో చర్చించారు. బిడెన్ మిత్రులతో చర్చల తర్వాత, ఆఫ్ఘనిస్తాన్ నుండి తన సైన్యాన్ని ఉపసంహరించుకునే ప్రక్రియను అమెరికా కొన్ని రోజుల పాటు వాయిదా వేసినట్లు సూచనలు కనిపించాయి. రాబోయే రోజుల్లో, అఫ్గానిస్తాన్‌కు అమెరికా కొందరు సైనికులను పంపే అవకాశం ఉంది. వారు కాబూల్ మరియు ఇతర నగరాలను తాలిబాన్ స్వాధీనం చేసుకోకుండా కాపాడడంలో ఆఫ్ఘన్ సైన్యానికి సాయం చేస్తారు. అలాగే, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కాన్సులర్ సిబ్బందిని తరలించడానికి 3,000 మంది సైనికులలో మెరైన్ కమాండోల మొదటి బృందం శుక్రవారం కాబూల్ చేరుకుంది. ఆదివారం నాటికి మిగిలిన అమెరికన్ దళాలు వస్తాయి.