Thief In Teddy Bear : పోలీసులకు దొరక్కుండా ప్రేయసి టెడ్డీబేర్​ లో దాక్కున్న దొంగ..! వైరల్ అవుతున్న ‘దొంగ ప్రియుడు’..

పోలీసులకు దొరక్కుండా ప్రేయసి టెడ్డీబేర్​ లో దాక్కున్న దొంగ..! వైరల్ అవుతున్నాడు ఈ ‘దొంగ ప్రియుడు’..

Thief In Teddy Bear : పోలీసులకు దొరక్కుండా ప్రేయసి టెడ్డీబేర్​ లో దాక్కున్న దొంగ..! వైరల్ అవుతున్న ‘దొంగ ప్రియుడు’..

UK cops catch wanted thief hiding in teddy bear

UK cops catch wanted thief hiding in teddy bear : అతనో ‘దొంగ ప్రియుడు’. వయస్సు 18 ఏళ్లు. ఇది సినిమా టైటిల్ కాదు..నిజంగా అతను ఓ దొంగ. ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ‘దొంగ ప్రియుడు’. అని అనాల్సి వచ్చింది. ఆ దొంగ ప్రియుడు చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంటే ప్రేయసితో చిలిపి పనులు చేసి వైరల్ కాలేదు. ఓ దొంగతనం చేసి పోలీసులకు ప్రియురాలి ముందే పట్టబడిపోయాడు. పైగా ప్రియురాలికి ఎంతో ముచ్చటపడి కొని ఇచ్చిన టెడ్డీబేర్ లో దాక్కుని పోలీసులకు పట్టుబడిపోయాడు. బ్రిటన్ లోని మాంచెస్టర్ కు చెందిన ఈ దొంగప్రియుడు చోరకళ వ్యవహారాలేమని చెప్పాలి..?అబ్బో బాగానే ఉన్నాయిలెండి..

సదరు దొంగగారి పేరు జోషువా డాబ్సన్. ఈ 18 ఏళ్ల నవ యవ్వన ప్రియుడు ఇటీవల ఓ కారును దొంగతనం చేశాడు. ఆ కారులో పెట్రోల్ పోసుకుని బంకు నుంచి డబ్బులు కట్టకుండా పరారయ్యాడు. ఈ చోరీలే కాదు గతంలో మనోడికి ఈ చోరకళలో చాలా ఘనతలే ఉన్నాయి. కార్లు దొంగతనం చేయడం, సూపర్ మార్కెట్లలో వస్తువులు ఎత్తుకుపోవడం వంటి ‘దొంగ’ చరిత్ర కూడా ఉంది. దీంతో పోలీసులు అతడి కోసం వెతకటం మొదలుపెట్టారు. పోలీసులు తనకోసం తీవ్రంగా వెదుకుతున్నారని తెలిసిన జోషువా చాలా చోట్ల దాక్కున్నాడు. దాక్కుంటూ దాక్కుంటూ కొన్నాళ్లు గడిపాడు. అలా ఓ రోజు తన ప్రేయసి ఇంట్లో దాక్కున్నాడు. అక్కడ ఉన్నాడని తెలిసిన పోలీసులు అక్కడికి వచ్చారు. పోలీసులు అక్కడికీ రావడంతో గతంలో తన ప్రేయసికి గిఫ్టుగా ఇచ్చిన ఐదు అడుగుల టెడ్డీబేర్ లో దూరి కూర్చున్నాడు. టెడ్డీబేర్ లో ఉన్న దూది అంతా తీసేసి దాంట్లో దూరి కూర్చున్నాడు.

అంతా బాగానే ఉందిగానీ..కానీ టైమ్ బాగాలేదేమో అడ్డంగా బుక్ అయ్యాడు. పోలీసులు ఆ రూమ్ లోకి కూడా వచ్చి వెదుకుతుంటంతో భయపడిపోయాడు పాపం దొంగ ప్రియుడు. అప్పటి వరకు ఊపిరి బిగపట్టి ఇక ఆగలేక గట్టిగా శ్వాస తీసుకోవడంతో టెడ్డీబేర్ ఛాతీ భాగం కదిలింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అనుమానంతో పోలీసులు టెడ్డీ బేర్ ను పరిశీలిస్తే డాబ్సన్ అడ్డంగా పట్టుబడిపోయాడు. మాంచెస్టర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ ఫేస్‌ బుక్‌ లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. ఏదేమైనా టెడ్డీ బేర్ దొంగ పాపులర్ అయిపోయాడు.