డొనాల్డ్ ట్రంప్ పై అభిశంసన తీర్మానం

10TV Telugu News

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అభిశంసన తీర్మానం స్టార్ట్ అయ్యింది. ఈ తీర్మానంపై ఓటింగ్ ప్రారంభించారు. తీర్మానానికి 215 మందికిపైగా సభ్యులు మద్దతు పలికారు. సవరణతో డొనాల్డ్ ట్రంప్ ను తొలగించేందుకు తీర్మానం చేశారు. దేశాధ్యక్షుడు మానసిక, శారీరక అసమర్థకు లోనైన సమయంలోనే 25 అమెండ్‌మెంట్ వినియోగించాలని తేల్చి చెప్పారు. ట్రంప్‌ను సాగనంపేందుకు ఉపాధ్యక్షుడు పెన్స్ చొరవ చూపాలనే తీర్మానంపై ప్రతినిధుల సభ ఓటింగ్ పెట్టిన సందర్భంలోనే పెన్స్ ఈ లేఖ రాశారు.

25 అమెండ్‌మెంట్ ప్రకారం.. శారీరక మానసిక కారణాల రీత్యా అమెరికా అధ్యక్షుడు అధికారిక బాధ్యతలు నిర్వహించలేని స్థితిలో ఉన్నప్పుడు.. అధికార పగ్గాలు ఉపాధ్యక్షుడికి బదిలీ అవుతాయి. అయితే.. అధ్యక్షుడు తన బాధ్యతలు నిర్వహించలేని స్థితికి చేరుకున్నారని ఉపాధ్యక్షుడు, క్యాబినెట్ ముందుగా ప్రకటించాల్సి ఉంటుంది. మరోవైపు.. అభిశంసన ద్వారా ట్రంప్‌ను పదవిఛ్చితుణ్ణి చేసేందుకు కూడా ప్రతినిధుల సభ సమాయత్తమైంది. ఈ ప్రయత్నానికి పార్టీలకతీతంగా మద్దతు లభిస్తోంది. అయితే.. దేశంలో చీలికలు తెచ్చే క్షణికావేశాలకు దూరంగా ఉండాలని, సులువుగా అధికార బదిలీ జరపడంపై దృష్టి పెట్టాలని కూడా పెన్స్‌ లేఖలో సూచించారు.

ట్రంప్‌ను సాగనంపేందుకు పెన్స్‌ నిరాకరించిన పక్షంలో ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెడతామని స్పీకర్ నాన్సీ పెలోసీ ఇదివరకే ప్రకటించారు. ట్రంప్ పార్టీకి చెందిన ముగ్గురు రిపబ్లికన్ నేతలు కూడా దీనికి మద్దతు తెలిపారు. ప్రతినిధుల సభలో గనుక దీనికి ఆమోదం తెలిపితే.. రెండు సార్లు అభిశంసనకు గురైన ఏకైక అధ్యక్షుడుగా ట్రంప్ అమెరికా చరిత్రలో నిలిచిపోతారు.

అయితే.. దీనికి ఎగువ సభ సెనెట్ కూడా అమోదించాల్సి ఉంటుంది. కానీ.. 100 సభ్యులు ఉన్న సెనెట్‌లో ఇరు పార్టీలకు సమానబలం ఉండటంతో ట్రంప్‌ను పదవిచ్యుతుడిని చేయడం అంతసులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికా చట్టసభల నిలయం క్యాపిటల్‌పై దాడి తరువాత అమెరికా రాజకీయం కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనను అనేక మంది అమెరికా ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. ఈ దారుణానికి ట్రంప్‌ బాధ్యత వహించి మూల్యం చెల్లించుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే అధ్యక్ష పదవీకాలం ముగియక మునుపే ట్రంప్‌ను సాగనంపాలని డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారు. ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ఈ విషయంలో గట్టి పట్టుదలగా ఉన్నారు. పెన్స్ సహాయంతో ట్రంప్‌ను పదవిఛ్చితుణ్ణి చేయాలని, కుదరని పక్షంలో అభిశంసన ద్వారా ఆయన్ను గద్దె దింపాలని యత్నిస్తున్నారు.

×