చరిత్రలో మొదటిసారి : హౌడీ మోడీ ఈవెంట్ కు ట్రంప్

  • Published By: venkaiahnaidu ,Published On : September 16, 2019 / 09:40 AM IST
చరిత్రలో మొదటిసారి : హౌడీ మోడీ ఈవెంట్ కు ట్రంప్

ఈ నెల 22న అమెరికాలోని  హ్యూస్టన్‌ లో జరగనున్న “హౌడీ మోడీ”మెగా ఈవెంట్ లో భారత ప్రధాని నరేంద్రమోడీతో కలిసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాల్గొనబోతున్నారని వైట్ హౌస్ తెలిపింది. ఓ అమెరికా అధ్యక్షుడు,ఓ భారత ప్రధాని కలిసి సంయుక్త ర్యాలీలో ప్రసంగించడం ఇదే మొదటిసారి. ఇద్ద‌రు నేత‌లు ఒకే వేదిక‌పై క‌ల‌వ‌డం రెండు దేశాల బంధాన్ని చాటిచెబుతుంద‌ని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్ర‌ట‌రీ స్టిఫెనీ గ్రిసామ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ట్రంప్-మోడీల మధ్య G 20, G 7 శిఖరాగ్ర సమావేశాల తర్వాత కొన్ని వారాల వ్యవధిలో వరుసగా ఇది మూడవ సమావేశం కావడం విశేషం.

హ్యూస్టన్‌లోని విశాలమైన ఎన్‌ఆర్‌జి స్టేడియంలో సెప్టెంబర్ 22న జరగనున్న  “హౌడీ, మోడీ! షేర్డ్ డ్రీమ్స్, బ్రైట్ ఫ్యూచర్స్” కార్యక్రమానికి అమెరికా నలుమూలల నుండి 50,000 మంది భారతీయ-అమెరికన్లు రిజిస్ట‌ర్ చేసుకున్నారు. ఈ వేదికపైనే ఇరు దేశాల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న వాణిజ్య విభేదాలకు కూడా తెరపడొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

మోడీతో వేదిక పంచుకోవడం, భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం లాంటి చర్యలు.. 2020లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ కి అనుకూలించే అంశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 27న ఐరాస సర్వసభ్య సమావేశంలో మోదీ ప్రసంగిస్తారు.