చైనాకు మళ్లీ ట్రంప్ చెక్ : టిబెట్ బిల్లుపై సంతకం..దలైలామాకు అమెరికా దన్ను

చైనాకు మళ్లీ ట్రంప్ చెక్ : టిబెట్ బిల్లుపై సంతకం..దలైలామాకు అమెరికా దన్ను

పదవీకాలం ముగుస్తున్న సమయంలో చైనాకు చెక్ పెట్టే చర్యలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొనసాగిస్తూనే ఉన్నారు. చైనా జోక్యం లేకుండా… అంతర్జాతీయ సహకారంతో టిబెట్ బౌద్ధ కమ్యూనిటీ తమ దలైలామా వారసుడిని ఎన్నుకునే వీలు కల్పించే బిల్లును అమెరికా ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే. టిబెట్..తమ దలైలామా తదుపరి వారసుడిని ఎన్నుకోవడంతో పాటు ఇతర కార్యక్రమాల్లో టిబెటన్లకే హక్కు ఉండే విధంగా రూపొందించిన ది టిబెటన్ పాలసీ,సపోర్ట్ యాక్ట్ 2020కి గతవారం అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)ఆమోదం తెలిపింది. చైనా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ బిల్లును అమెరికా చట్టసభ గతవారం ఏకగ్రీవంగా ఆమోదించింది.

చైనా చేసిన హెచ్చరికలను పట్టించుకోకుండా …తాజాగా ఆ బిల్లుపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. దీని ప్రకారం.. టిబెట్ లోని లాసాలో అమెరికా రాయబార కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. దీనికి చైనా అడ్డుతగిలే ఆస్కారం ఉన్న కారణంగా డ్రాగన్ పై ఆంక్షలు విధించింది అమెరికా. టిబెట్ లోని లాసాలో అమెరికా దౌత్య కార్యాలయం ఏర్పాటయ్యే వరకూ.. అమెరికాలో కొత్తగా చైనా కాన్సులేట్ ఏర్పాటు చేసే వీల్లేకుండా చూసే అధికారాన్ని ఈ చట్టం అమెరికా అధికారులకు కల్పించింది.

అదేవిధంగా, కేవలం టిబెట్‌ లోని బౌద్ధులు మాత్రమే కొత్త దలైలామాను ఎంపిక చేయాలని కొత్త చట్టం పేర్కొంది. కొత్త దలైలామాను ఎంపిక చేసేలా చూడటానికి వీలుగా అంతర్జాతీయ మిత్రపక్షాలను కూడగట్టాలని.. ఈ ఎంపిక విషయంలో చైనా జోక్యం చేసుకోకూడదని చట్టం స్పష్టంచేసింది. దానిపై నిర్ణయాలన్నీ ప్రస్తుత దలైలామా, టిబెట్‌వాసులే తీసుకోవాలని తెలిపింది. ఇందులో జోక్యం చేసుకునే చైనా అధికారులపై ఆర్థిక, వీసా సంబంధ ఆంక్షలు విధించాలని అమెరికా ప్రభుత్వానికి స్పష్టంచేసింది.

ఈ చట్టం ద్వారా టిబెట్‌ వాసులకు అమెరికా స్వచ్ఛంద సంస్థలు ఆర్థిక సాయం చేసే అవకాశం ఏర్పడింది. నిజమైన స్వయంప్రతిపత్తిని కోరుకునే టిబెట్‌లోని ఆరు మిలియన్ల మంది, ముఖంగా 14 వ దలైలామా దీనిని సమర్థిస్తున్నారని కొత్త చట్టం పేర్కొంది. నీటి భద్రతపై ప్రాంతీయ కార్యాచరణను ప్రోత్సహించేలా అమెరికా విదేశాంగ శాఖ చర్యలు తీసుకోవాలని సదరు చట్టం సూచించింది. నదీ జలాలపై హక్కులున్న దేశాల మధ్య సహకార ఒప్పందాలు కుదిరేలా చూడాలని పేర్కొంది.

నదులపై అడ్డగోలుగా డ్యామ్‌లు నిర్మిస్తున్న చైనా వైఖరిని గర్హిస్తూ… భారత వైఖరిని సమర్థించేలా ఈ నిబంధనలు ఉన్నాయి. కాగా, టిబెట్ అంశంపై అమెరికా చర్యలపై డ్రాగన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతమున్న 14 వ దలైలామాను… చైనా నుంచి టిబెట్‌ను విభజించడానికి కృషి చేస్తున్న “వేర్పాటువాది” గా చైనా అభిప్రాయపడింది.

మరోవైపు, ఈ బిల్లుతోపాటు కోవిడ్‌-19 సంక్షోభం ఉద్దీపన ప్యాకేజీ బిల్లుపై కూడా డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఫెడరల్ ప్రభుత్వానికి నిధులు ఇచ్చేందుకు, కరోనా వైరస్ అదుపునకు ఉద్దేశించిన కార్యక్రమాల తోడ్పాటుకు 2.3 ట్రిలియన్ డాలర్ల భారీ ప్యాకేజీ బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు.