ట్రంప్ వర్సెస్ బైడెన్ : ప్రెసిడెన్షియల్ రెండో డిబేట్ వాయిదా

  • Published By: madhu ,Published On : October 10, 2020 / 01:24 PM IST
ట్రంప్ వర్సెస్ బైడెన్ : ప్రెసిడెన్షియల్ రెండో డిబేట్ వాయిదా

Trump vs biden : ప్రెసిడెన్షియల్ రెండో డిబేట్ వాయిదా పడింది. ట్రంప్‌ వర్చువల్‌ పద్ధతిలో డిబేట్‌కు అంగీకరించకపోవడంతో దీన్ని వాయిదా వేస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 15న ట్రంప్, బైడెన్ మధ్య డిబేట్ జరగాల్సి ఉంది. ట్రంప్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రెండో డిబేట్‌ను వర్చువల్ పద్ధతిలో జరపాలని కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్స్ నిర్ణయించింది.




కానీ.. సీపీడీ నిర్ణయాన్ని ట్రంప్ వ్యతిరేకించారు. వర్చువల్‌ పద్ధతిలో జరిగే డిబేట్‌లో పాల్గొని తన టైం వేస్ట్ చేసుకోనని చెప్పారు. ఇది.. తమకు అంగీకారం కాదని స్పష్టం చేశారు. బైడెన్‌ను రక్షించేందుకే సీపీడీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. సీపీడీ తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నారు. డొనాల్డ్ కామెంట్స్‌పై డిబేట్స్‌ కమిషన్‌ స్పందించింది.

ఇప్పుడు తమ నిర్ణయాన్ని మళ్లీ పరిశీలించే ఆలోచన లేదని.. డిబేట్‌ వర్చువల్‌గానే జరుగుతుందని స్పష్టం చేసింది. మరోవైపు బైడెన్‌.. వర్చువల్‌ డిబేట్‌కు ఓకే చెప్పారు. అయితే ట్రంప్ వెనక్కు తగ్గకపోవడంతో ట్రంప్, బైడెన్ మధ్య రెండో ముఖాముఖి వాయిదా పడింది.




ట్రంప్ కు ఇటీవలే కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన మిలటరీ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. నాలుగు రోజులు గడిచాయో లేదో వైట్ హౌస్ లో ప్రత్యక్షమయ్యారు. అంతకంటే ముందు..కారులో ట్రంప్ ప్రయాణించడం వివాదాస్పదమైంది. తనను కోలుకోవాలని కోరుకుంటున్న ప్రజలకు ధన్యవాదాలు తెలియచేసేందుకు తాను బయటకు రావాల్సి వచ్చిందని ట్రంప్ వివరణనిచ్చారు.

తాజాగా ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని వైద్యులు వెల్లడిస్తున్నట్లు సమాచారం. దీంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ట్రంప్ ఆసక్తి చూపుతున్నారంట. అయితే..డాక్టర్ల ప్రకటనపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.