Uganda Airport : అప్పు తీర్చలేదని..ఉగాండా ఏకైక ఎయిర్ పోర్ట్ ను చైనా బలవంతంగా స్వాధీనం చేసుకుంటోందా!

  విమానాశ్రయాన్ని విస్తరించడానికి తీసుకున్న రుణాన్ని చెల్లించనందున ఉగాండాలోని ఏకైక అంతర్జాతీయ విమానాయాశ్రయాన్ని(ఎంటెబ్బే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్) చైనా

Uganda Airport : అప్పు తీర్చలేదని..ఉగాండా ఏకైక ఎయిర్ పోర్ట్ ను చైనా బలవంతంగా స్వాధీనం చేసుకుంటోందా!

Airport

Uganda Airport :  విమానాశ్రయాన్ని విస్తరించడానికి తీసుకున్న రుణాన్ని చెల్లించనందున ఉగాండాలోని ఏకైక అంతర్జాతీయ విమానాయాశ్రయాన్ని(ఎంటెబ్బే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్) చైనా స్వాధీనం చేసుకోబోతుందంటూ అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తలను ఉగాండా సివిల్ ఏవియేషన్ అథారిటీ(UCAA)కొట్టిపారేసింది. ఆ వార్తలన్నీ అవాస్తవమేనని ఉగాండా సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రతినిధి వియానీ ఎం. లుగ్యా శనివారం ట్విట్టర్ ద్వారా తెలిపారు.

కాగా,ఎంటెబ్బే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ విస్తరణ కోసం మార్చి 31, 2015న.. 200 మిలియన్ డాలర్ల కోసం ఎక్స్ పోర్ట్-ఇంపోర్ట్ (EXIM) బ్యాంక్ ఆఫ్ చైనాతో రుణ ఒప్పందంపై ఉగాండా సంతకం చేసిన విషయం తెలిసిందే. అయితే, రుణ ఒప్పందంలో సమస్యాత్మక నిబంధనలు ఉన్నాయని..కాబట్టి ఒప్పందంలోని కొన్ని నిబంధనలను సవరించాలని ఉగాండా అధికారులు కోరుతున్నారు. చైనా బ్యాంకు పెట్టిన ముఖ్యమైన రెండు షరతులను మర్చాలని ఉగాండా ప్రభుత్వం కోరుతోంది. ఆ రెండు నిబంధనలలో ఒకటి..ఉగాండా సివిల్ ఏవియేషన్ అథారిటీ తన బడ్జెట్ మరియు వ్యూహాత్మక ప్రణాళికల కోసం చైనీస్ రుణదాత(ఎగ్జిమ్ బ్యాంక్) నుండి ఆమోదం పొందాల్సిన అవసరం ఉంది. రెండవది…పార్టీల మధ్య ఏదైనా వివాదం తలెత్తితే దానిని చైనా ఇంటర్నేషనల్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ ఆర్బిట్రేషన్ కమిషన్ పరిష్కరించాలి.

అయితే ఉగాండాకు అనుకూలం కాని కొన్ని నిబంధనలను UCAA అమలు చేయడంలో విఫలమైందని, రుణ ఒప్పందాన్ని ఉల్లంఘించినందున ఎగ్జిమ్ బ్యాంక్ నిధులను నిలిపివేసిందని, ఆ తర్వాత ఉగాండా బీజింగ్‌కు ఓ ప్రతినిధి బృందాన్ని పంపిందని, డబ్బులు చెల్లించడానికి బదులుగా ఉగాండా ప్రభుత్వం ఎంటెబ్బే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చైనా అప్పగించించేందుకు సిద్ధమయ్యిందని వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఉగాండా సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రతినిధి వియానీ ఎం. లుగ్యా శనివారం వరుస ట్వీట్ లు చేశారు. వియానీ ఎం. లుగ్యా శనివారం చేసిన వరుస ట్వీట్ లలో….” స్టాన్బిక్ బ్యాంక్ ఉగాండాలో.. UCAA సేల్స్ కలక్షన్ అకౌంట్ తెరిచిన మాట వాస్తవమే. సీఏఏ యొక్క అన్ని ఆదాయాలు ఎస్క్రో అకౌంట్ ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా అందులో జమ చేయబడతాయి. కానీ ఇది మా ఆర్థిక వ్యవహారాలను ఎవరో నియంత్రిస్తున్నారని అర్థం కాదు. అథారిటీ (బడ్జెట్ ప్రకారం) సేకరించిన దానిని ఖర్చు చేసే స్వేచ్ఛ,స్వతంత్రాన్ని కలిగి ఉంది. ఎవరైనా జీతం లోన్ లేదా మరేదైనా లోన్‌ను పొందినప్పుడు ఏమి జరుగుతుందో అదే విధంగా ఖాతాపై రుణదాత పర్యవేక్షణ ఉంటుంది. జీతం తమ బ్యాంక్ ద్వారా అందించబడాలని బ్యాంక్ అభ్యర్థించింది. రుణం ఇచ్చే బ్యాంకు మీ జీతాన్ని తీసుకుంటుందని దీని అర్థం కాదు”అని పేర్కొన్నారు.

ఎగుమతి-దిగుమతి (ఎగ్జిమ్) బ్యాంక్ ఆఫ్ చైనా ద్వారా ఉగాండాకు మంజూరు చేయబడిన రుణం 7 సంవత్సరాల గ్రేస్ పీరియడ్‌ను కలిగి ఉందని…ఒప్పందంలో పేర్కొన్న వ్యవధిలో ఉగాండా ప్రభుత్వం కేవలం వడ్డీని మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని.. అయితే గ్రేస్ పీరియడ్ ఇంకా ముగియలేదని, ప్రభుత్వం ఇప్పటి వరకు వడ్డీని తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్ చేయలేదని, ఎంటెబ్బే అంతర్జాతీయ విమానాశ్రయం సురక్షితమైన చేతుల్లో ఉందని వియానీ ఎం లుగ్యా మరొక ట్వీట్ లో హామీ ఇచ్చారు. ఉగాండా ప్రభుత్వం అటువంటి జాతీయ ఆస్తిని(ఎయిర్ పోర్ట్) ని వదులుకునేందుకు సిద్ధంగా లేదని తెలిపారు.

మరోవైపు, చైనా ప్రభుత్వం కూడా ఈ ఇష్యూపై స్పందించింది. ‘అప్పు ఉచ్చు’ సృష్టించడం ద్వారా ఉగాండా విమానాశ్రయాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని చైనా చూస్తోందంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని ఆఫ్రికన్ వ్యవహారాలను చూసే చైనా డైరెక్టర్ జనరల్ వు పెంగ్ తెలిపారు. “చైనీస్ ప్రాజెక్ట్‌ల ద్వారా ఆఫ్రికాలో ఏదైనా జప్తు చేయబడిందా? ఏదీ లేదు! ఆఫ్రికాలో చైనీస్ ‘అప్పు ఉచ్చు’ అంటూ జరుగుతున్న ప్రచారానికి వాస్తవ ఆధారం లేదు. అలాంటి మీడియా నివేదికలు అశాస్త్రీయ ప్రచారం”అని అన్నారు.

ALSO READ Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి