అమెరికా క్యాపిటల్ భవనంలో కాల్పులు, ట్రంప్ ప్రకటన చేయాలన్న బైడెన్

అమెరికా క్యాపిటల్ భవనంలో కాల్పులు, ట్రంప్ ప్రకటన చేయాలన్న బైడెన్

US Capitol lockdown : అమెరికా క్యాపిటల్‌ భవనంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది.. ఈ కాల్పుల్లో ఓ మహిళ చనిపోయింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆందోళనకారులపై కాల్పులు జరపడంతో… ఓ మహిళ మెడపై బుల్లెట్‌ గాయమైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చికిత్స తీసుకుంటూ చనిపోయింది.

ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌ స్పందించారు. ఈ చర్యను ఇంతటితో ఆపాలని, ఆందోళనకారులను ఆపడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి ట్రంప్‌ వెంటనే జాతీయ ఛానల్‌లో ప్రకటన చేయాలన్నారు.. వాషింగ్టన్‌ మేయర్‌ బౌజర్‌ నగరంలో కర్ఫ్యూ విధించారు. అత్యవరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. సెంట్రల్‌ కమాండ్‌ ఫోర్స్‌ క్యాపిటల్‌ భవనంను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

అసలు ఏం జరిగింది ?

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్‌ గెలుపును ధ్రువీకరించేందుకు యూఎస్‌ కాంగ్రెస్‌ సమావేశమైంది. అయితే బైడెన్‌ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్‌ మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ క్యాపిటల్‌ భవనంలోకి దూసుకొచ్చారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులను నిలువరించడానికి పోలీసులు టియర్‌ గ్యాస్‌ను సైతం ప్రయోగించారు. ఈ ఘర్షణ వాతావరణంతో బైడెన్‌ గెలుపు ధ్రువీకరణ ప్రక్రియకు ఆటంకం కలిగింది.

దీంతో ఆందోళనకారులను కట్టడిచేసేందుకు స్వాట్‌ టీమ్స్‌ రంగంలోకి దిగాయి. ఆందోళనకారులు శాంతియుతంగా వ్యవహరించాలంటూ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. క్యాపిటల్‌ భవనంలో అందరూ సంయమనం పాటించాలంటూ ట్రంప్‌ హితవు పలికారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ వెంటనే ఆందోళనకారులు క్యాపిటల్‌ భవనం విడిచివెళ్లాలని కోరారు.