Monkeypox Case: అమెరికాలో 20ఏళ్ల తర్వాత మంకీపాక్స్.. దగ్గినా, తుమ్మినా వ్యాప్తి

రెండు దశాబ్దాల తర్వాత అమెరికాలో అరుదైన 'మంకీ పాక్స్' మరోసారి కల్లోలం రేపుతోంది. కొద్దిరోజుల క్రితం నైజీరియా నుంచి తిరిగొచ్చిన టెక్సాస్‌కి చెందిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం అతణ్ని డల్లాస్‌లోని ఓ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు.

Monkeypox Case: అమెరికాలో 20ఏళ్ల తర్వాత మంకీపాక్స్.. దగ్గినా, తుమ్మినా వ్యాప్తి

Monkeypox Case

Monkeypox Case: రెండు దశాబ్దాల తర్వాత అమెరికాలో అరుదైన ‘మంకీ పాక్స్’ మరోసారి కల్లోలం రేపుతోంది. కొద్దిరోజుల క్రితం నైజీరియా నుంచి తిరిగొచ్చిన టెక్సాస్‌కి చెందిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం అతణ్ని డల్లాస్‌లోని ఓ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. కొద్ది రోజులుగా అతనితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించి వారిని అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. అతనితో పాటు విమాన ప్రయాణం చేసిన తోటి ప్రయాణికులని, ఇటీవల అతన్ని కలిసినవారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది.

అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌.. సీడీసీ మంకీపాక్స్‌ గురించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. మంకీ పాక్స్ కేసులు చివరిసారిగా అమెరికాలో 2003లోనే బయటపడ్డాయి. అప్పట్లో 47 మందికి ఈ వ్యాధి సోకింది. మిడ్‌వెస్ట్‌ ప్రాంతంలోని పెంపుడు కుక్కల్లో ఈ వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మంకీ పాక్స్ కేసు బయటపడటంతో ఆందోళన కలిగిస్తోంది.

దీని గురించి ఆందోళన చెందనక్కర్లేదని… ఈ వైరస్ ప్రభావంతో సాధారణ ప్రజలకు ఎటువంటి ముప్పు లేదని చెబుతున్నారు అధికారులు. సీడీసీ అంచనాల ప్రకారం ప్రతీ వందమందిలో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా.

మంకీ పాక్స్ సాధారణంగా జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా గాలి ద్వారా ఇది ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది. వ్యాధి బారినపడిన వారిలో జ్వరం, ముఖం, శరీర భాగాలపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దాదాపుగా రెండు నుంచి నాలుగు వారాల్లో ఈ వ్యాధి తగ్గిపోయే అవకాశముంది. మశూచి తరహా లక్షణాలకు ఈ లక్షణాలు దగ్గరగా ఉంటాయి.

WHO ప్రకారం… రక్తం, శరీర స్రావాలు, జంతువుల గాయాల ద్వారా మంకీ పాక్స్ వ్యాప్తి చెందుతుంది. అర్థోపోక్స్‌ వైరస్ అనే జాతికి చెందిన వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుందట.

సాధారణంగా పశ్చిమాఫ్రికా దేశాల్లో మంకీ పాక్స్ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. 1970లో తొలిసారిగా కాంగో ప్రాంతంలో ఈ వ్యాధి బయటపడింది. ఇప్పటివరకూ పశ్చిమాఫ్రికాతో పాటు సెంట్రల్ ఆఫ్రికాలోని 9 దేశాల్లో ఈ వ్యాధి బయటపడింది. ఇటీవలే యూకేలోని నార్త్ వేల్స్‌లోనూ మంకీ పాక్స్ కేసులు నమోదైంది. నైజీరియా నుంచే ఈ వ్యాధి వ్యాప్తి చెందిందనే అనుమానాలు ఉన్నాయి. 2018 సెప్టెంబర్‌లో ఇజ్రాయెల్‌‌కు, డిసెంబర్ 2019లో యూకె దేశాలకు, మే 2019లో సింగపూర్ దేశాలకు మంకీ పాక్స్ వ్యాపించింది.

మంకీ పాక్స్ వ్యాధి ఏ జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుందనేది నిర్దారించే పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికైతే దీనికి ప్రత్యేకించి ఏ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. భవిష్యత్తులో దీనికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. స్మాల్ పాక్స్ వ్యాధి చికిత్సకు ఉపయోగించే జిన్నియోస్ వ్యాక్సిన్ మంకీ పాక్స్ నుంచి రక్షణ కల్పించగలదని అంచనా వేస్తున్నారు వైద్యులు. కాంగోలో ప్రస్తుతం దీనిపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.