బీచ్ లోకి కొట్టుకొచ్చిన బంగారం, వెండి..జల్లెడలతో గాలించేస్తున్న జనాలు

  • Published By: nagamani ,Published On : December 14, 2020 / 05:07 PM IST
బీచ్ లోకి కొట్టుకొచ్చిన బంగారం, వెండి..జల్లెడలతో గాలించేస్తున్న జనాలు

Venezuelan beach gold and silver washed : బీచ్ లో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటాయి. ఆ నీటితో పాటు చిన్న చిన్న ప్రాణులు కొట్టుకొస్తుంటాయి. తిరిగి మరో కెరటం రాగానే ఆ నీటితో పాటు సముద్రంలోకి వెళ్లిపోతుంటాయి. కానీ కెరటంతో పాటు బంగారం, వెండి కొట్టుకొస్తే..!!

ఏంటీ బీచ్ లో నీటితో పాటు బంగారం కొట్టుకొస్తే ఇంకేమన్నా ఉందా? జనాలు ఎగబడిపోరూ?. నిజమే మరి బంగారం ఎవరికి చేదు? అదే జరిగింది వెనిజులాలోని ఓ బీచ్ లో. వెనిజులాలోని గాకా బీచ్‌కు బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకొచ్చాయి. దాన్ని ఎవరో ఒకరు చూశారు. ఏంటీ మెరుస్తోంది? అని చేతిలోకి తీసుకున్నారు. అది ఓ బంగారపు ఆభరణం అని తెలిసింది. అంతే ఒక్కసారిగా పెద్దగా బంగారం, వెండి కొట్టుకొస్తున్నాయి. అంటూ అరిచాడు.

 

అంతే అక్కడున్న జనాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎక్కడా ఎక్కడా అంటూ వెతికేయటం మొదలుపెట్టారు. అలా ఒకరిని చూసి మరొకరు జనాలంతా కళ్లను పత్తికాయల్లా చేసుకుని వెతకటం ప్రారంభించారు. చాలామందికి బంగారం, వెండి ఆభరణాలు దొరకాయి. దాంతోవాళ్లు నాకు దొరికింది అంటే నాక్కూడా దొరికిందంటూ అరవటం వెతకటం కంటిన్యూ చేశారు.

అలా బీచ్ లో బంగారం వెండి దొరుకుతోందని తెలిసి చుట్టుపక్కల జనాలంతా ఏకంగా జల్లెడలు పట్టుకుని తరలివచ్చి వెతకటం మొదలు పెట్టేశారు. దొరికిన వాటిని దొరికినట్లు తీసుకుని వెళ్లిపోయారు.

దీనిపై అనధికారిక లెక్కల ప్రకారం ప్రతి ఒక్కరికీ ఏదో ఒక వస్తువు లభించిందట. అంతేకాదు వారిలో చాలా మంది తమకు దొరికిన వస్తువులను అత్యధికంగా 1500 డాలర్లకు అమ్ముకున్నారనే వార్తలు వచ్చాయి.

ఈ విషయంపై స్థానిక మత్స్యకారులు స్పందించారు. తమ జీవితంలో ఇలాంటి ఘటనను ఎన్నడూ చూడలేదని, విషయం తెలియగానే నేను ఆశ్చర్యపోయామని అంటున్నారు. బీచ్ లో బంగారం అంటూ దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.