Wiener Zeitung: ప్రపంచంలో పురాతన వార్తా పత్రికకు బ్రేక్.. ప్రింట్ ఎడిషన్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటన.. ఎందుకంటే?
ప్రపంచంలో పురాతన వార్తా పత్రికగా గుర్తింపు పొందిన ‘వీనర్ జైటుంగ్’ ప్రింటింగ్ ఎడిషన్‌ను నిలిపివేసింది. కేవలం ఆన్‌లైన్ ఎడిషన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Wiener Zeitung
Wiener Zeitung: ప్రపంచం (World) లోని పురాతన వార్తాపత్రిక (oldest newspaper) ల్లో ఒకటి వియన్నాకు చెందిన వీనర్ జైటుంగ్ (Wiener Zeitung). మూడు దశాబ్దాల తరువాత దాని రోజువారీ ముద్రణ (Daily Print)ను శుక్రవారంతో ముగించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. వియన్నా డైరియం (Wiennerisches Diarium) పేరుతో మొదటిసారిగా 8 ఆగస్టు 1703లో ఈ పేపర్ ప్రచురితం ప్రారంభమైంది. 320 సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు దిగ్విజయంగా దీని దినపత్రిక ముద్రణ కొనసాగింది. 12 మంది అధ్యక్షులు, 10 మంది చక్రవర్తులు, రెండు దేశాలు, ఒకే పత్రిక అంటూ చివరిరోజు ఎడిషన్ మొదటి పేజీలో వీనర్ జైటుంగ్ ప్రచురించింది. అయితే, కేవలం ప్రింటింగ్ ఎడిషన్ మాత్రమే నిలిపివేస్తున్నామని, ఆన్‌లైన్ ఎడిషన్ కొనసాగుతుందని యాజమాన్యం తెలిపింది.
1703లో వీనర్ డైరియం పేరుతో ప్రారంభమైన ఈ పత్రిక కొద్దికాలంకు వీనర్ జైటుంగ్ గా మారింది. ఆస్ట్రియా ప్రభుత్వమే దీనికి యాజమాన్యంగా ఉన్నప్పటికీ.. ఎడిటోరియల్ పరంగా స్వతంత్రంగానే కొనసాగింది. ప్రింట్ మీడియాకు సంబంధించిన ఓ చట్టంలో ఇటీవల మార్పులు చోటుచేసుకోవడంతో వియన్నా కేంద్రంగా నడిచిన ఈ పత్రికకు శరాఘాతంగా మారింది. దాని ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఫలితంగా ముద్రణను నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.
The oldest newspaper in the world – the Wiener Zeitung – has been printed for the last time. This is the final front page pic.twitter.com/M28gHihw7W
— James Jackson (@derJamesJackson) June 30, 2023
కేవలం ఆన్‌లైన్ ఎడిషన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే, నెలవారి మాసపత్రికను ప్రింటింగ్ రూపంలో అందించేందుకు యాజమాన్యం ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రింటింగ్ ఎడిషన్ నిలిపివేసిన కారణంగా యాజమాన్యం సుమారు 63మంది ఉద్యోగులను తొలగించింది. అదేవిధంగా సంపాదకీయ సిబ్బందిని దాదాపు మూడింట రెండు వంతులు తొలగించింది.