చంద్రుడిపై నీరుందా లేదా ?

  • Published By: veegamteam ,Published On : April 18, 2019 / 08:33 AM IST
చంద్రుడిపై నీరుందా లేదా ?

చంద్రుడిపై ఆవాసానికి వీలుందా లేదా…? జాబిల్లిపై నీరుందా లేదా… ? ఈ ప్రశ్నలకు ఎన్నాళ్లుగానో సమాధానాలు వెతుకుతున్న నాసా మరో ఇంటస్ట్రింగ్ వార్తను బయటపెట్టింది. చంద్రుడిపై ఆవిరి రూపంలో నీళ్లు వచ్చినట్లు గుర్తించింది… ఇంతకీ ఈ నీళ్లు ఎక్కడ్నుంచి వచ్చాయి…?

చిన్నపిల్లలకు చందమామను చూపించి అన్నం తినిపిస్తాం…చందమామరావే జాబిల్లిరావే అని పాటలు పాడతాం. పండువెన్నెల్లో కూర్చుని చంద్రుడ్ని చూస్తూ కబుర్లు చెప్పుకుంటాం… మనకెంతో ఇష్టమైన చంద్రుడి గురించి శాస్త్రవేత్తలు రకరకాల పరిశోధనలు చేస్తున్నారు. మానవుడు ఎప్పుడో చంద్రుడిపై కాలు పెట్టాడు. కానీ ఇప్పటివరకూ చంద్రుడి రహస్యాలు పూర్తిగా బయటపడలేదు. అందినట్లే అంది అర్థం కాకుండా ఊరిస్తున్నాడు చంద్రుడు. మనకు అంతుచిక్కని ప్రశ్నల్లో ముఖ్యమైనది చంద్రుడిపై నీరుందా లేదా ఉంటే ద్రవరూపంలోనా లేక మంచు రూపంలోనా అనేది. దీనిపై చాలాకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. 

చంద్రుడిపై పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడే విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా బయటపెట్టింది. చంద్రుడిపై మంచు ఉందని ఎప్పట్నుంచో భావిస్తున్నా ఆవిరి రూపంలో కూడా నీరు ఉన్నట్లు గుర్తించింది. నాసాకు చెందిన రోబోటిక్‌ మిషన్‌.. లూనార్‌ అట్మాస్పియర్‌ అండ్‌ డస్ట్‌ ఎన్విరాన్‌మెంట్ ఎక్స్‌ఫ్లోరర్‌ ద్వారా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు. చంద్రుడిపై ఉన్న వాతావరణంలో నీరు, హైడ్రోకిల్స్ ఉన్నట్లు ఇప్పటికే ఆధారాలున్నా అవి ఎక్కడ్నుంచి వస్తున్నాయన్న దానికి సమాధానం లేదు. దానికి ఇప్పుడు నాసా సమాధానం చెప్పింది.

చంద్రుడికి ఉల్కలు దగ్గరగా వచ్చిన సమయంలో.. నీటి ఆవిరి బయటకు వచ్చినట్లు తాము గుర్తించినట్లు నాసా చెబుతోంది. మళ్లీ ఆ ఉల్క చంద్రుడికి దూరంగా వెళ్లిన సమయంలో హెచ్‌2ఓ, ఓహెచ్‌ మళ్లీ తగ్గిపోతోంది. చంద్రుడి ఉపరితలాన్ని ఉల్క ఢీ కొట్టిన సమయంలో నీళ్లు వచ్చినట్లు నాసా చెబుతోంది. చంద్రుడిలో ఈ నీరు మంచు రూపంలో ఉన్నట్లు భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఉల్కలకు, నీటికి సంబంధం ఏంటి? ఉల్కలు పడిన సమయాల్లో నీరు ఎలా బయటకు వస్తుంది అనేదానిపై నాసా విస్తృతంగా పరిశోధనలు చేస్తోంది. 

ఈ కొత్త పరిశోధనకు సంబంధించి విషయాలను నేచురల్ జియో సైన్సెస్ లో మెహదీ బెన్న ఆఫ్ నాసా ఫ్లయిట్ సెంటర్ ప్రచురించింది. అక్టోబర్ 2013 నుంచి ఏప్రిల్ 2014 నుంచి చంద్రుడి ఉపరితలంలోకి పంపిన రోబొటిక్ మిషన్ అక్కడి వాతావరణ పరిస్థితులకు సంబంధించి సమాచారాన్ని సేకరించి నాసాకు చేరవేసింది. చంద్రుడిపై నీళ్లు ఉంటే.. భవిష్యత్తులో మరిన్ని విషయాలను శోధించేందుకు వీలవుతుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.