Whale Vomit: తిమింగ‌లం వాంతి రూ.10 కోట్లు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు!

Whale Vomit: తిమింగ‌లం వాంతి రూ.10 కోట్లు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు!

Whale Vomit

Whale Vomit: సాధారణంగాఈ సృష్టిలో జీవి ఏదైనా వాంతి చేసుకుంటుంటే మనుషుల ఫీలింగ్ ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. కానీ తిమింగలం వాంతి చేసుకుంటే మాత్రం మనుషులు లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోతారు. అంటే ఇది అలాంటిలాంటి వాంతి కాదన మాట. అంబ‌ర్‌గ్రీస్‌గా పిలిచే ఈ తిమింగలం వాంతి దొరికి కోట్ల రూపాయలు వెనకేసుకున్న కథలు మనం గతంలో కొన్ని చూడగా తాజాగా యెమెన్ దేశంలో మాత్రం ఏకంగా రూ.10 కోట్లు విలువచేసే అంబ‌ర్‌గ్రీస్‌ దొరికింది.

యెమెన్‌కు చెందిన 35 మంది జాల‌ర్లు కలిసి ఒకేసారి స‌ముద్రంలో వేట‌కు వెళ్లగా.. వారికి నీటిలో తేలుతున్న ఒక విచిత్ర వ‌స్తువు క‌నిపించింది. తీరా దగ్గరకెళ్తే అది స్పెర్మ్ వేల్ వాంతి అని తెలిసింది. దీని విలువ అక్ష‌రాల రూ.10 కోట్ల‌కు పైమాటేనని తెలియడంతో ఆ జాలర్లు ఎగిరి గంతేశారు. ఈ వేల్ వాంతి అమ్మడం ద్వారా వచ్చే డబ్బును ఆ జాలర్లు తమతో పాటు త‌మ వృత్తిపై ఆధారప‌డి జీవిస్తోన్న కొంద‌రు పేద‌ల‌కు ఇవ్వనున్నట్లు చెప్పారు. అయితే.. అసలు వేల్ వాంతికి ఎందుకింత క్రేజ్.. కోట్లు పలికేంత ఈ వాంతిలో ఏముంది అనిపిస్తుంది.

అంబ‌ర్‌గ్రీస్‌గా పిలిచే ఈ స్పెర్మ్ వేల్ వాంతిని సుగంధ పరిశ్రమలు అతి విలువైన ఖజానాగా లెక్కిస్తుంటాయి. అది దొరకడం అరుదు కాబట్టి ఎంతయినా వెచ్చించి కొనుగోలు చేసి తమ సుగంద పరిమళాల ఉత్పత్తుల్లో ఉపయోగిస్తుంటాయి. ఈ వాంతి ఫ్రెష్‌గా ఉన్నప్పుడు కంపు వాసన కొడుతుంది. కానీ.. ఓసారి గట్టిపడ్డాక సువాసన వెదజల్లుతుంది. ఇది పెర్ఫ్యూమ్ వాసను రెట్టింపుచేయడంతో పాటు దీర్ఘకాలం కొనసాగేలా చేస్తుంది. ఇది తిమింగళాల జీర్ణకోశంలో తయారవగా అవి వాంతి చేసుకుంటే.. నీటిలో తేలియాడుతూ తీరానికి కొట్టుకొస్తాయి.