నాదల్ ఖాతాలో 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్.. ఫెదరర్ అభినందనలు

నాదల్ ఖాతాలో 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్.. ఫెదరర్ అభినందనలు

వరల్డ్ ర్యాంక్ నెం.1 నొవాక్ జకోవిచ్‌ను ఓడించి Rafael Nadal 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్నాడు. రఫెల్ నాదల్ కెరీర్లో ఇది 13వ టైటిల్. ఈ సందర్భంగా రోజర్ ఫెదరర్ కూడా అభినందనలు తెలియజేశాడు. ఆదివారం సాయంత్రం రోలాండ్‌ గ్యారోస్‌ ఫైనల్స్‌లో ఏకపక్షంగా సాగిన పురుషుల సింగిల్స్‌ రెండో సీడ్‌ నాదల్‌ 2 గంటల 41 నిమిషాల్లో 6–0, 6–2, 7–5తో జకోవిచ్‌ను చిత్తు చేశాడు.

జకోవిచ్‌తో తలపడిన ఈ మ్యాచ్‌లో నాదల్‌ వరుస సెట్లలో గెలుపొందాడు. ఎర్రమట్టి తివాచిపై తొలి రౌండ్‌లో ఏ మాత్రం అవకాశమివ్వని అతడు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. రెండో రౌండ్‌లోనూ మంచి ప్రదర్శనే చేశాడు. కానీ మూడో రౌండ్‌లో అనూహ్యంగా పుంజుకున్న జకోవిచ్.. రఫెల్‌కు గట్టిపోటీనిచ్చాడు. ఉత్కంఠగా సాగిన ఈ రౌండ్‌లో చివరికి నాదలే స్వల్ప తేడాతో గెలుపొందాడు.



సాధారణంగా ప్రతి యేటా ఫ్రెంచ్‌ ఓపెన్‌ మే–జూన్‌ మాసాల్లో జరుగుతుంది. కరోనా వైరస్‌ కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌–అక్టోబర్‌లో నిర్వహించాల్సి వచ్చింది. టోర్నీ మొత్తంలో ప్రత్యర్థులతో ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా టైటిల్‌ నెగ్గడం నాదల్‌‌కు నాలుగోసారి. విజేతగా నిలిచిన నాదల్‌కు 16 లక్షల యూరోలు (రూ. 13 కోట్ల 82 లక్షలు), రన్నరప్‌ జకోవిచ్‌కు 8లక్షల 50వేల 500 యూరోలు (రూ. 7 కోట్ల 34 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

‘నేనెప్పుడూ నా ఫ్రెండ్ రాఫెల్ ను ఓ ఛాంపియన్ గానే కాకుండా వ్యక్తిగానూ గౌరవిస్తాను. కొన్ని సంవత్సరంగా నా గొప్ప ప్రత్యర్థి అయినప్పటికీ.. మేం ఒకరితో ఒకరం పోటీపడి బెటర్ ప్లేయర్స్ అయ్యాం. కాబట్టి అతను 20వ గ్రాండ్ స్లామ్ విజయం దక్కించుకోవడం నాకు గర్వంగా అనిపిస్తుంది. అతని టీంకు అభినందనలు తెలుపుతున్నా. ఇది కేవలం ఏ ఒక్కరో మాత్రమే చేయలేరు. నాకు తెలిసి 20అనేది ఇద్దరికీ మరో అడుగు వేయడానికి ప్రేరణ లాంటిదే. రఫెల్ బాగా ఆడావు. ఈ విజయానికి నువ్వు అర్హుడివి’ అని ఎమోషనల్‌గా ట్వీట్‌ చేశాడు.

రోజర్‌ ఫెదరర్‌ 2018లోనే ఆస్ట్రేలియా ఓపెన్‌ గెలుపొంది ఈ ఘనత సాధించాడు. దీంతో ఫెదరర్, నాదల్ ప్రస్తుతం సమాన గ్రాండ్‌స్లామ్‌లతో కొనసాగుతున్నారు.